కర్మకాండలన్నీ అయ్యాక..! తిరిగి వచ్చిన మృతుడు | A shocking case has came into light from Ghaziabad | Sakshi
Sakshi News home page

కర్మకాండలన్నీ అయ్యాక..! తిరిగి వచ్చిన మృతుడు

Jun 27 2026 7:24 AM | Updated on Jun 27 2026 8:19 AM

A shocking case has came into light from Ghaziabad

చనిపోయినట్లు భావించి ఓ వ్యక్తికి అతడి కుటుంబసభ్యులు కర్మకాండలన్నీ జరిపించారు. అంతలోనే అతడు తిరిగి క్షేమంగా ఇంటికి చేరుకున్నాడు. కుటుంబసభ్యులు షాకవ్వగా, పోలీసులు తప్పుగా గుర్తించిన మృతదేహం తాలుకూ కేసును తిరగదోడాల్సి వచ్చింది. ఈ ఘటన యూపీలోని గజియాబాద్‌లో చోటుచేసుకుంది. స్థానిక దుకాణదారులతో తలెత్తిన వివాదం నేపథ్యంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నాడంటూ వైశాలిలోని కల్పనా అపార్టుమెంట్‌లో ఉండే గిరిధర్‌ సింగ్‌ బిష్త్‌ అనే వ్యక్తిని మే 16వ తేదీన పోలీసులు అరెస్ట్‌ చేశారు. 

మే 21వ తేదీన దస్నా జైలు నుంచి బెయిల్‌పై విడుదలైన బిష్త్‌ ఆ తర్వాత ఎటువెళ్లాడో ఎవరికీ తెలియదు. కుటుంబసభ్యులు వెదికినా ఫలితం లేకపోవడంతో మసూరి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దర్యాప్తు సమయంలో పోలీసులకు గుర్తు తెలియని మృతదేహాన్ని కనుగొన్నారు. అతడు బిష్త్‌ అంటూ కుటుంబసభ్యులు తీసుకెళ్లి, దహన సంస్కారాలు జరిపించారు. 13వ రోజు శాంతిపూజ, అన్నదానం కూడా 24వ తేదీన జరిపించేశారు. 

ఈలోగా మృతదేహానికి జరిపిన పోస్టుమార్టంలో అతడు నీళ్లలో మునిగి చనిపోయినట్లు తేలింది. కేసు నమోదు చేసిన పోలీసులు, కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు ఆరుగురిని అరెస్ట్‌ చేశారు. ఇలా ఉండగా, జూన్‌ 25వ తేదీన ఉదయం 5 గంటల సమయంలో సొంతింటికి చేరుకున్నాడు బిష్త్‌. అతడిని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. పోలీసులకు సమాచారమిచ్చారు. అతడు ఎక్కడికెళ్లాడు, ఎందుకెళ్లాడు..? ఎక్కడున్నాడు? వంటి వివరాలపై అన్ని కోణాల్లోనూ ఆరా తీస్తున్నారు. ఆ గుర్తు తెలియని మృతదేహం కేసుపై తిరిగి దర్యాప్తు చేపట్టారు. ఆరుగురు నిందితుల అరెస్ట్‌ను సమీక్షిస్తున్నామని అధికారులు చెప్పారు.  

-ఉత్తరప్రదేశ్

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement