మావోల బంకర్‌ | Security forces unearth bunker of Maoists in Chhattisgarh | Sakshi
Sakshi News home page

మావోల బంకర్‌

Feb 1 2024 4:36 AM | Updated on Feb 1 2024 4:36 AM

Security forces unearth bunker of Maoists in Chhattisgarh - Sakshi

పోలీసులు గుర్తించిన బంకర్‌

సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం/చర్ల: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు నిర్మించిన బంకర్‌ను భద్రతాబలగాలు గుర్తించారు. బస్తర్‌ డివిజన్‌లో మావోయిస్టులు బంకర్‌లను నిర్మించి వినియోగిస్తున్న విషయం బయటపడటం ఇదే తొలిసారి కావడం గమనార్హం. బస్తర్‌లో ఇలాంటివి ఉండొచ్చని భద్రతా బలగాలకు సమాచారం ఉందిగానీ ఇన్నాళ్లలో ఎన్నడూ ఒక్కదానిని కూడా గుర్తించలేకపోయారు.

బీజాపూర్‌–దంతెవాడ జిల్లాల మధ్య ఇంద్రావతి నదీతీరంలో మావోయిస్టులు ఏర్పాటు చేసిన మందుపాతరలను గుర్తించేందుకు జిల్లా రిజర్వ్‌ గార్డ్, సీఆర్‌పీఎఫ్‌ బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ సందర్భంగా బీజాపూర్‌ జిల్లాలోని తోడోపాట్‌–ఉస్పారీ గ్రామ సమీప అడవిలో మంగళవారం ఈ బంకర్‌ను భద్రతా బలగాలు గుర్తించాయని దంతేవాడ అదనపు ఎస్పీ బర్మన్‌ చెప్పారు. ఈ సొరంగం 130 మీటర్ల పొడవు, 6 అడుగుల లోతు, 3 అడుగుల వెడల్పుతో ఉంది.

బంకర్‌ కనపడకుండా ప్రవేశమార్గాన్ని మట్టితో కూడిన కర్రలను కప్పి వాటిపైన చెట్ల పొదలను పరిచారు. మావోలు డంపింగ్‌ ప్రాంతంగానూ దీనిన వినియోగించినట్లు భద్రతాబలగాలు గుర్తించాయి. జనవరి 9న మావోయిస్టుల తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిని ఎన్నుకున్నారు. మైదాన ప్రాంతంలో సమావేశం ఏర్పాటు చేస్తే డ్రోన్ల సాయంతో జాడ కనిపెట్టే అవకాశం ఉండటంతో ఇటీవలే ఈ బంకర్‌ నిర్మించి సమావేశం జరిపి ఉంటారని భద్రతా బలగాలు భావిస్తున్నాయి.

ఇంద్రావతి నదిఒడ్డున ఏర్పాటు చేసిన ఈ బంకర్‌లో 100 మంది మావోయిస్టులు ఆయుధాలతో సహా దాక్కునేందుకు వీలుగా ఉంది. ఇలాంటి బంకర్‌లు ఛత్తీస్‌గఢ్‌ అడవుల్లో మరిన్ని ఉండొచ్చని భావిస్తున్న పోలీసులు, వాటిని గుర్తించేందుకు అడవుల్లో సోదాలు గాలింపు ముమ్మరం చేశారు. అబూజ్‌మడ్‌ అడవుల్లో ఇలాంటివి ఎన్ని బంకర్లు ఉన్నాయి? ఎక్కడ ఉన్నాయి? అనే అంశాలపై భద్రతాదళాలకు కొత్త సవాల్‌గా మారినట్టయ్యింది. వచ్చే వేసవిలో విస్తృతంగా కూంబింగ్‌ చేపట్టేందుకు యాక్షన్‌ ప్లాన్‌ సిద్ధం చేసుకున్న భద్రతాదళాలకు కనిపించని బంకర్‌లతో మరిన్ని చిక్కులు వచ్చి పడే అవకాశముంది.

గాలి, వెలుతురు సోకేలా ఏర్పాట్లు
బైరాంఘర్‌ పోలీస్‌స్టేషన్, భద్రతాదళాల బేస్‌ క్యాంప్‌ నుంచి 12 కిలోమీటర్ల  దూరంలో దట్టమైన అడవిలో ఈ బంకర్‌ ఉంది. బంకర్‌లోకి వచ్చి వెళ్లేందుకు ప్రత్యేక ఏర్పాట్లు ఉన్నాయి. గాలి, వెలుతురు సోకేలా ప్రతీ ఆరు మీటర్లకు ఒకటి చొప్పున ద్వారాలు ఏర్పాటు చేశారు. అయితే, ఇవి బయటకు కనిపించకుండా చెట్ల పొదలు అడ్డుపెట్టారు. మావో అగ్రనేతలు తలదాచుకునేందుకు ఉపయోగించుకోవడంతో పాటు మెరుపు దాడులకు వీలుగా దీనిని నిర్మించారని వార్తలొచ్చాయి. అయితే దీని నిర్మాణ వివరాలను భద్రతా బలగాలు ఇంకా అధికారికంగా బహిర్గతంచేయలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement