
వెంటాడి..వేటాడుతాం..!
భద్రతా బలగాల వెల్లడి
నగ్రోటా: జమ్మూ ప్రాంతంలో చురుగ్గా ఉన్న 40 నుంచి 50 మంది ఉగ్రవాదుల ఆచూకీ కనిపెట్టడమే లక్ష్యంగా భద్రతా బలగాలు కూంబింగ్‌ను నిర్విరామంగా కొనసాగిస్తున్నాయి. జమ్మూలోపలి ప్రాంతాలతోపాటు సరిహద్దులకు సమీపంలోనూ ప్రస్తుతం పరిస్థితులు ప్రశాంతంగానే కనిపిస్తున్నా పలు అంచెల భద్రతా వ్యవస్థను కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా అదనపు బలగాల మోహరింపు, రాత్రి వేళ తనిఖీలు, డ్రోన్లపై నిషేధం వంటి చర్యలతో ముష్కరుల కట్టడికి పకడ్బందీగా వ్యవహరిస్తున్నారు.
పీర్ పంజాల్ పర్వత శ్రేణికి దక్షిణ ప్రాంతంలో 40 నుంచి 50 మంది ఉగ్రవాదులు పలు గ్రూపులుగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లుగా నిఘా వర్గాలు, కూంబింగ్ సందర్భంగా సేకరించిన సమాచారం ఆధారంగా భద్రతా బలగాలు అంచనా వేస్తున్నాయి. ఈ మేరకు రాజౌరీ, పూంఛ్, కిష్త్‌వార్, దోడా, ఉధంపూర్ జిల్లాలో ఉగ్రవాద వ్యతిరేక చర్యలను చేపట్టారు. బలగాలు వెంటాడుతున్న విషయం పసిగట్టిన ముష్కరులు ఎప్పటికప్పుడు తప్పించుకు తిరిగే పనిలో ఉన్నారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. పర్వత ప్రాంతాలతోపాటు అత్యంత సున్నితంగా ఉండే ప్రాంతాల్లో బలగాలను అదనంగా మోహరించారు.
దీంతో, ఈ ప్రాంతమంతా బలగాల నియంత్రణలోకి వచ్చేసిందని చెప్పాయి. రాత్రి పూట స్పష్టంగా చూడగలిగే పరికరాలు, ఆధునిక సాధనా సంపత్తితో రాత్రి వేళలోనూ నిఘా కొనసాగుతోందని ఓ అధికారి తెలిపారు. గతంలో ఉగ్రవాదులు సంచరించిన, చొరబడిన మార్గాలను పూర్తిగా దిగ్బంధించామన్నారు. సరిహద్దుల ఆవల ఉగ్ర మూకలు చొరబాటుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. రాత్రి వేళ ఉగ్రవాదులు ముఠాలుగా ఏర్పడటం, సంచరించడం, ఆశ్రయం తీసుకోవడం వంటి వాటిని అడ్డుకునేందుకు పర్వత ప్రాంతాలపై ఎక్కువగా దృష్టి సారించామన్నారు. ‘కీలక ప్రాంతాలపై పట్టుబిగించాం. వారి కదలికలను ఎప్పటికప్పుడు కనిపెట్టి, వెంటాడుతున్నాం. నేడోరేపో వారు చిక్కడం ఖాయం’అని ఆ అధికారి స్పష్టం చేశారు.