వాషింగ్టన్: వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్‌పై అమెరికా ఏళ్ల తరబడి నిఘా వేస్తూ వస్తోందా? తాజాగా వెలుగు చూసిన అమెరికా డ్రగ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అడ్మిని్రస్టేషన్ (డీఈఏ) పత్రాలు అవుననే చెబుతున్నాయి. 2018లో ఉపాధ్యక్షురాలు అయినప్పటి నుంచే ఆమెకు సంబంధించిన అన్ని వివరాలనూ డీఈఏ సేకరిస్తూ వస్తున్నట్టు అవి వెల్లడించాయి. అంతేగాక రోడ్రిగ్జ్‌ను డీఈఏ తమ ‘ముఖ్యమైన లక్ష్యం’ జాబితాలో చేర్చింది కూడా! డ్రగ్ ట్రాఫికింగ్ మొదలుకుని బంగారం స్మగ్లింగ్ దాకా ఆమెపై వచ్చిన ఆరోపణలన్నింటినీ ఎప్పటికప్పుడు డీఈఏ ట్రాక్ చేస్తూ వస్తోంది.
కరీబియన్ దీవుల్లోని ఇస్లా మార్గరీటా రిసార్టుల్లోని పలు హోటళ్లను మనీ లాండరింగ్‌కు కేంద్రాలుగా రోడ్రిగ్జ్ మలచుకున్నట్టు కూడా 2021 నాటి డీఈఏ రహస్య పత్రాలు పేర్కొన్నాయి. అయితే ఆమెపై అమెరికా ఇప్పటిదాకా ఎలాంటి నేరారోపణలూ చేయకపోవడం గమనార్హం. పైగా రోడ్రిగ్జ్ అద్భుత నాయకురాలంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల పదేపదే కీర్తించడం తెలిసిందే. ఇటీవల వెనెజువెలా నియంత నికొలస్ మదురో దంపతులను అమెరికా నిర్బంధించి పదవీచ్యుతున్ని చేయడం తెలిసిందే.


