సాక్షి, న్యూఢిల్లీ: నోట్ల కట్టల వ్యవహారంలో.. జస్టిస్ యశ్వంత్‌వర్మకు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. తనను తొలగించాలని కోరుతూ వచ్చిన తీర్మానాన్ని లోక్‌సభ స్పీకర్ ఆమోదించడంతోపాటు తనపై దర్యాప్తు కోసం ఏర్పాటుచేసిన పార్లమెంటరీ ప్యానల్ చట్టబద్ధతను సవాల్ చేస్తూ వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు (Supreme Court) కొట్టివేసింది.
గతేడాది మార్చిలో.. ఢిల్లీ హైకోర్టు జడ్జిగా యశ్వంత్ వర్మ విధులు నిర్వహిస్తున్న టైంలో ఆయన అధికారిక నివాసంలో అగ్నిప్రమాదం జరిగింది. ఆ సమయంలో ఒక గదిలో పెద్దఎత్తున నోట్లకట్టలు లభ్యమయ్యాయి. ఈ విషయాన్ని సుప్రీం కోర్టు తన వెబ్‌సైట్‌లో వీడియో, ఫొటోలతో సహా బయటపెట్టి సంచలనం సృష్టించింది. ఆపై ఈ అంశంపై దర్యాప్తునకు అంతర్గత త్రిసభ్య సంఘం ఏర్పాటు చేసింది.
విచారణ జరిపిన కమిటీ ఇచ్చిన నివేదిక నేపథ్యంలో పదవి నుంచి వైదొలగాల్సిందిగా సుప్రీంకోర్టు సూచించింది. కానీ, ఆయన దానికి అంగీకరించకపోవడంతో పార్లమెంటులో అభిశంసనకు ప్రయత్నాలు జరిగాయి. ఈ క్రమంలో.. స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లిన జస్టిస్ వర్మకు అక్కడ మళ్లీ చుక్కెదురైంది.
లోక్‌సభ స్పీకర్ జడ్జెస్ (Inquiry) Act, 1968 ప్రకారం కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ఏర్పాటు చట్టబద్ధం కాదని వర్మ తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి వాదించారు. అయితే.. లోక్‌సభ సెక్రటేరియట్ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదిస్తూ కమిటీ చట్టబద్ధమేనని కారణాలతో సహా వివరించారు. వాదనలు విన్న జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ సతీష్ చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం జనవరి 8వ తేదీన తీర్పు రిజర్వ్ చేసింది. ఇవాళ జస్టిస్ వర్మ పిటిషన్‌ను తోసిపుచ్చుతూ తీర్పు ఇచ్చింది.


