
ఢిల్లీ : అవినీతి మరక అంటుకుని దాని నుంచి ఎలా బయటపడాలో తెలియని అయోమయ స్థితిలో ఉన్న ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి యశ్వంత్ వర్మను.. అలహాబాద్ హైకోర్టుకే బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం మరోమారు నిర్ణయం తీసుకుంది. యశ్వంత్ వర్మ బదిలీ అంశానికి సంబంధించి గురువారం, సోమవారాల్లో ప్రత్యేకంగా రెండు సార్లు సమావేశమైన సుప్రీంకోర్టు కొలీజియం చివరకు అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తిగా పంపాలని నిర్ణయించింది.
ఈ మేరకు సీజేఐ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం తీసుకున్న నిర్ణయాన్ని.. కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. దీనికి కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే యశ్వంత్ వర్మ అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తిగా వెళ్లాల్సి ఉంటుంది.
ఢిల్లీ హైకోర్టులో నో వర్క్..!
అవినీతి ఆరోపణల అనంతరం ఏం జరుగుతుందా అని ఉత్కంఠ ఏర్పడింది. యశ్వంత్ యధావిధిగా ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా కొనసాగుతారా.. లేక అలహాబాద్ హైకోర్టు వెళతారా అనే సందిగ్థంలో ఉండగా సుప్రీంకోర్టు కొలీజియం ఎట్టకేలకు అలహాబాద్ హైకోర్టుకు పంపడానికే మొగ్గుచూపింది. ఢిల్లీ హైకోర్టులో యశ్వంత్ కు ఎటువంటి బాధత్యలు అప్పగించకపోవడంతోనే.. సుప్రీంకోర్టు కొలీజియం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ నిరసనలు..
అయితే అలహాబాద్ హైకోర్టు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం తొలుత తీసుకున్న నిర్ణయంపై పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్.. దీనిపై తీవ్రంగా మండిపడింది. అవినీతి ఆరోపణలు ఉన్న యశ్వంత్ ను ఇక్కడకు ఎలా బదిలీ చేస్తారంటూ నేరుగా సీజేఐకే లేఖ రాసింది. ఆ ‘ చెత్త’ మాకొద్దంటూ ఘాటుగా వ్యాఖ్యానించింది. అయితే బదిలీకి, అవినీతి అంశానికి ఎటువంటి సంబంధం లేదని సీజేఐ చెప్పుకొచ్చారు. యశ్వంత్ పై దర్యాప్తు జరుగుతుందంటూనే బదిలీని సమర్ధించుకుంది ధర్మాసనం
కాగా, ఇటీవల జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న సమయంలో భారీగా నోట్ల కట్టలు బయటపడ్డాయి. దాని విలువ సుమారు రూ. 15 కోట్లు ఉంటుందని అంచనాలు కూడా వేశారు. ఒక న్యాయమూర్తి వద్ద అంత డబ్బు ఎలా వచ్చిందంటూ చర్చ మొదలైంది. అదే సమయంలో ఇది కచ్చితంగా అవినీతి చేసే కూడపెట్టిందని వాదన బలంగా వినిపించింది.
2021లో అలహాబాద్ నుంచి ఢిల్లీ హైకోర్టుకు..
ఈ నేపథ్యంలో యశ్వంత్ ను అలహాబాద్ హైకోర్టు బదిలీ చేయడం, ఆపై తమకు ఆ జడ్జి వద్దని అక్కడ నుంచి తీవ్ర నిరసన వ్యక్తం కావడం జరిగింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టులోనే యశ్వంత్ కొనసాగుతారని భావించారు. కానీ అక్కడ ఆయన చేదు అనుభవం ఎదురుకావడంతో ఇప్పుడు అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయం తీసుకుంది. 2021 లో అలహాబాద్ హైకోర్టు నుంచి ఢిల్లీ హైకోర్టుకు వచ్చిన యశ్వంత్.. మళ్లీ అక్కడికే వెళ్లడానికి దాదాపు రంగం సిద్ధం కావడంతో అలహాబాద్ హైకోర్టులో ఆయనకు ఏ పరిణామాలు ఎదురవుతాయో చూడాల్సిందే.
సుప్రీంకోర్టులో పిల్..
యశ్వంత్ వర్మ ఇంట్లో వెలుగుచూసిన నోట్ల కట్టల వ్యవహారంపై దర్యాప్తునకు ఆదేశిస్తూ ప్రజా ప్రయోజన వాజ్యం(పిల్0 దాఖలైంది. ముందు భారీగా నోట్ల కట్టలు దొరికాయనే ఆరోపణలపై ముందుగా ఎప్‌ఐఆర్ నమోదు చేయాలని సుప్రీంకోర్టులో పలువురు న్యాయవాదులు పిల్ దాఖలు చేశారు.