ఈశాన్యాన భగభగలు | Satellite reveals hidden environmental crisis in Manipur, Arunachal | Sakshi
Sakshi News home page

ఈశాన్యాన భగభగలు

Jun 6 2025 4:34 AM | Updated on Jun 6 2025 4:34 AM

Satellite reveals hidden environmental crisis in Manipur, Arunachal

తగ్గిపోతున్న అటవీ విస్తీర్ణం 

కార్చిచ్చు, పోడు, ప్రాజెక్టులే కారణం 

అధ్యయనంలో వెల్లడి

ఈశాన్య భారతంలో పచ్చదనానికి మారుపేరైన అరుణాచల్‌ప్రదేశ్, మణిపూర్‌లో అటవీ విస్తీర్ణం శరవేగంగా తగ్గిపోతోంది. కార్చిచ్చులను సకాలంలో గుర్తించి అదుపు చేయకపోవడం, విచ్చలవిడి పోడు వ్యవసాయం, గంజాయి వంటివాటి అక్రమ సాగు, రోడ్లు, రైల్వే తదితర మౌలిక అభివృద్ధి ప్రాజెక్టుల కోసం భారీగా భూ సేకరణ తదితరాలు ఇందుకు కారణమని ప్రముఖ భూ పరిశీలన, విశ్లేషణ సంస్థ సుహోరా టెక్నాలజీస్‌ అధ్యయనం వెల్లడించింది. 

రెండు రాష్ట్రాలకు సంబంధించి గత నాలుగేళ్ల ఉపగ్రహ డేటాను లోతుగా విశ్లేíÙంచిన మీదట ప్రమాదకర అంశాలు వెలుగులోకి వచి్చనట్టు తెలిపింది. ముఖ్యంగా దట్టమైన అడవుల లోపలి, మారుమూల ప్రాంతాల్లో రేగే కార్చిచ్చులు పెను నష్టానికి కారణమవుతున్నాయి. అరుణాచల్‌లోని నందిపార్‌ ప్రాంతంలో గత ఏప్రిల్‌ 24న రేగిన భారీ కార్చిచ్చు భారీ నష్టం మిగిల్చింది. 

ఒక్క రోజులోనే ఏకంగా 10 వేల ఎకరాలకు పైగా అటవీ ప్రాంతం బుగ్గిగా మారింది. ప్లానెట్‌స్కోప్‌ ఉపగ్రహ చిత్రాల సాయంతో జరిపిన విశ్లేషణ ద్వారా సుహోరా ఈ మేరకు వెల్లడించింది. ఇలాంటి కార్చిచ్చులను ఉపగ్రహ డేటా సాయంతో ఆదిలోనే గుర్తించి అదుపు చేయవచ్చని పేర్కొంది. ఇక జీవవైవిధ్యానికి మారుపేరైన మణిపూర్‌లో 2001 నుంచే అటవీ విస్తీర్ణంలో భారీ తగ్గుదల నమోదవుతూ వస్తోంది! 

రాష్ట్రంలో గత నాలుగేళ్లలో 21,100 హెక్టార్ల అటవీ భూమి మాయమైనట్టు గ్లోబల్‌ ఫారెస్ట్‌ వాచ్‌ పేర్కొంది. ఇందులో ఏకంగా 17,800 హెక్టార్ల అటవీ భూమిని ఒక్క 2024లోనే కోల్పోయిందని వెల్లడించింది. ఫలితంగా 91 కోట్ల మెట్రిక్‌ టన్నుల అదనపు కార్బన్‌ డయాక్సైడ్‌ వాతావరణంలోకి విడుదలైనట్టు పేర్కొంది.

 కార్చిచ్చుకు తోడు పోడు, గంజాయి వంటివాటి అక్రమ సాగు, జనం వంట చెరుకుపై ఆధారపడుతుండటం, రోడ్లు, రైల్వే వంటి మౌలిక ప్రాజెక్టులు ఇందుకు కారణమని అధ్యయనం తేల్చింది. పచ్చదనపు తొడుగు లేకపోవడంలో కొన్నేళ్లుగా కొండచరియలు విరిగిపడే ప్రమాదం పెరగడమే గాక వర్షపాత ధోరణులు కూడా బాగా మారిపోయినట్టు వివరించింది. తక్షణం దిద్దుబాటు చర్యలు తీసుకోని పక్షంలో ఈశాన్య భారతంలో పెను పర్యావరణ సంక్షోభం తప్పదని  హెచ్చరించింది.

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌ 
 

Advertisement
 
Advertisement
Advertisement