
తెలంగాణలో మూడు మాస్టర్‌ప్లాన్‌లు మంజూరు
లింక్ రోడ్ల నిర్మాణం బాధ్యత రాష్ట్రాలదే
లోక్‌సభలో స్పష్టం చేసిన కేంద్రమంత్రి తోఖన్ సాహు
సాక్షి, న్యూఢిల్లీ: శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో వాహనాల రద్దీని తగ్గించేందుకు.. మాస్టర్ ప్లాన్ ఆధారంగా లింక్ రోడ్ల నిర్మాణం అవసరమవుతోందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. హైదరాబాద్ సహా పలు నగరాల్లో నివాసితులు.. మున్సిపల్ కార్పొరేషన్లను లింక్ రోడ్ల నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించాలంటూ కోరిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం స్పందించింది. అయితే పట్టణ ప్రణాళిక బాధ్యత రాష్ట్రాలకే ఉందని కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి తోఖన్ సాహు గురువారం లోక్‌సభలో బీజేపీ ఎంపీ డీకే అరుణ అడిగిన ప్రశ్నకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో స్పష్టం చేశారు.
రాష్ట్రాల సహాయార్థంగా కేంద్రం అమృత్ పథకం ద్వారా పలు పట్టణాల్లో ఏఐ ఆధారిత మాస్టర్ ప్లాన్ తయారీకి నిధులు మంజూరు చేస్తోందని తెలిపారు. దేశవ్యాప్తంగా మొత్తం 461 పట్టణాల్లో ఈ పనులు చేపట్టగా, తెలంగాణలో 12 నగరాల్లో ఏఐ డేటాబేస్ సిద్ధమవగా.. వాటిలో 10 మాస్టర్ ప్లాన్‌లు రూపుదిద్దుకున్నాయి. కాగా, ఇప్పటి వరకు కేవలం మూడు మాస్టర్ ప్లాన్‌లకే అధికారిక అనుమతి లభించిందని వెల్లడించారు. అమృత్ 2.0 లో రెండో స్థాయి పట్టణాలు (జనాభా 50,000 నుంచి 99,999 మధ్య) కూడా మాస్టర్ ప్లాన్‌ల పరిధిలోకి వచ్చాయి.
అయితే, తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు ఒక్క పట్టణం కోసం కూడా మాస్టర్ ప్లాన్ రూపకల్పన జరగలేదని కేంద్ర మంత్రి చెప్పారు. పట్టణ ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలకు దీర్ఘకాలిక పరిష్కారంగా లింక్ రోడ్ల నిర్మాణం కీలకమవుతుందని, అందుకు ప్రణాళికల దశ నుంచే సమగ్రంగా ముందుకు సాగాలని సూచించారు. ‘వికసిత భారత్ – 2047‘ లక్ష్యంతో పట్టణాలలో జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు మౌలిక వసతుల అభివృద్ధిపై కేంద్రం దృష్టి సారించినట్టు మంత్రి స్పష్టం చేశారు.