లోక కళ్యాణమే వీరి వివాహ బంధం.. | Sakshi Special Story On Un Married CMs And Leaders In India | Sakshi
Sakshi News home page

లోక కళ్యాణమే వీరి వివాహ బంధం..

May 10 2026 9:00 AM | Updated on May 10 2026 9:22 AM

Sakshi Special Story On Un Married CMs And Leaders In India

సాక్షి, స్పెషల్‌ డెస్క్‌: పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సువేందు అధికారి బ్రహ్మచారి కావడంతో దేశంలో బ్రహ్మచారులు పాలకులుగా ఉన్నత పదవులు చేపట్టి ప్రజాసేవలో రాణిస్తుండడం ఆసక్తి గొలుపుతోంది. బ్రహ్మచర్యం అనేది కేవలం పెళ్లి చేసుకోకపోవడం మాత్రమే కాదు.. అది అంతకంటే లోతైన అర్థం కలిగిన ఒక జీవన విధానం. తన ఇంద్రియాలను అదుపులో ఉంచుకొని ఉన్నతమైన లక్ష్యం కోసం తన శక్తిని మళ్లించడమే బ్రహ్మచర్యం.

శాస్త్రీయంగా చూస్తే ‘బ్రహ్మ’అంటే పరమాత్మ లేదా సత్యం. ‘చర్యం’అంటే నడుచుకోవడం. అంటే సత్య మార్గంలో పయనించడం అని అర్థం. ఆధ్యాత్మిక కోణంలో దీనికి మూడు ప్రధాన పునాదులు ఉన్నాయి. అవి క్రమశిక్షణ (శారీరక, మానసిక కోరికలపై నియంత్రణ కలిగి ఉండటం), ఏకాగ్రత (ప్రాపంచిక సుఖాల కంటే సమాజ హితం లేదా ఆధ్యాత్మిక ఉన్నతిపై దృష్టి పెట్టడం), నిస్వార్థం (వ్యక్తిగత కుటుంబ పరిధిని దాటి లోకాన్నే తన కుటుంబంగా భావించడం).

కలాం, వాజ్‌పేయిల సందేశం.. 
మాజీ రాష్ట్రపతి డాక్టర్‌ ఏపీజే అబ్దుల్‌ కలాం, మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి బ్రహ్మచర్య దీక్షతో ఉన్నత పదవులను అధిరోహించి సమాజానికి పలు సందేశాలు అందించారు.

దేశమే ప్రథమ ప్రాధాన్యత: వారికి సొంత కుటుంబం, వారసులనే బంధాలు లేవు. తీసుకునే నిర్ణయాల్లో పక్షపాతం లేదా ‘నా వారు’అనే స్వార్థం ఉండదు. సమాజాన్నే కుటుంబంగా భావిస్తారు.

అంకితభావం: కుటుంబ బాధ్యతలు లేకపోవడంతో పూర్తి సమయాన్ని, శక్తిని ప్రజాసేవకే కేటాయించగలరు. అబ్దుల్‌ కలాం శాస్త్రవేత్తగా, రాష్ట్రపతిగా రాత్రింబవళ్లు శ్రమించడమే దీనికి నిదర్శనం.

నిరాడంబరత: అత్యున్నత పదవుల్లో ఉన్నా సాదాసీదాగా జీవిస్తారు. పదవి అనుభవించడానికి కాదు.. బాధ్యతను నెరవేర్చడానికని వీరు నిరూపించారు.

నైతిక బలం: బ్రహ్మచర్యం ఇచ్చే ఆత్మనిగ్రహం వల్ల ఒత్తిళ్లకు లొంగరు. అవినీతికి ఆస్కారంలేని పాలనను అందించడానికి ఈ మానసిక స్థితి ఎంతో దోహదపడుతుంది. బ్రహ్మచారిగా ఉండటం అంటే బాధ్యతల నుంచి పారిపోవడం కాదు.. మరింత పెద్ద బాధ్యతను (దేశాన్ని/సమాజాన్ని) భుజాన వేసుకోవడం. అబ్దుల్‌ కలాం, వాజ్‌పేయి ల జీవితాలే ఇందుకు నిదర్శనం. దేశం కోసం జీవితాలను అంకితం చేసి నిస్వార్థంగా పనిచేస్తే చరిత్రలో నిలిచిపోతామని నిరూపించారు.

వీరంతా బ్రహ్మచారులే.. 
దేశంలో బ్రహ్మచారులుగా ఉండి ఉన్నత పదవుల్లో రాణించినవారు చాలా మంది ఉన్నారు. ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ హిందుత్వవాది. గోరఖ్‌నాథ్‌ మఠానికి మహంత్‌. దేశంలోనే అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రానికి రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పశ్చిమ బెంగాల్‌కు మూడుసార్లు ముఖ్యమంత్రిగా ఉన్న మమతా బెనర్జీ (దీదీ) కూడా అవివాహితురాలే. 24 ఏళ్లపాటు ఒడిశా ముఖ్యమంత్రిగా సేవలు అందించిన నవీన్‌ పట్నాయక్‌ సైతం బ్రహ్మచారే. బీఎస్పీ అధినేత్రి మాయావతి ఉత్తరప్రదేశ్‌కు నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. పెళ్లి చేసుకోకుండానే తన రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీ మాజీ అధ్యక్షుడు, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ కూడా అవివాహితుడే. ప్రధాని నరేంద్ర మోదీ పెళ్లి చేసుకున్నప్పటికీ గృహస్థ జీవితానికి దూరంగా బ్రహ్మచారిగానే ఉంటూ దేశ సేవకు అంకితమయ్యారు.   

Advertisement
 
Advertisement
Advertisement