నమోదుకాని మా సంస్థను గతంలో ఎలా మూడు సార్లు నిషేధించారు
విపక్షాల విమర్శలకు భాగవత్ ధీటైన జవాబు
బెంగళూరు: నమోదుకాకుండానే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్‌ఎస్‌ఎస్) దేశవ్యాప్తంగా విస్తృత స్థాయిలో కార్యకలాపాలు కొనసాగిస్తోందంటూ విపక్షాలు చేస్తున్న విమర్శలపై ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ ధీటైన జవాబిచ్చారు. ఆదివారం బెంగళూరులో ఆర్‌ఎస్‌ఎస్ అంతర్గతంగా నిర్వహించిన ప్రశ్నావళి కార్యక్రమంలో భాగవత్ పలు ప్రశ్నలకు ఘాటుగా సమాధానమిచ్చారు. ‘‘ఆర్‌ఎస్‌ఎస్‌ను 1925లో స్థాపించాం. ఆనాడు భారతీయ ప్రభుత్వం లేదు. బ్రిటిషర్ల అరాచక పాలన కొనసాగుతోంది. వాళ్ల వద్దకు వెళ్లి మా సంస్థను నమోదుచేయండి అని బతిమాలాలా?. స్వాతంత్య్రంవచ్చాక సంస్థలను తప్పనిసరిగా నమోదుచేయాలనే నిబంధనను భారత ప్రభుత్వం అమలుచేయలేదు. దీంతో మేం వ్యక్తుల సంఘంగా కొనసాగాం.
అలాగే ప్రజల సమ్మతితో సంస్థగా సేవలందిస్తున్నాం. ఆర్‌ఎస్‌ఎస్ అనేది వ్యక్తుల సంస్థ అని ఇది ఆదాయ పన్ను కట్టాల్సిన పనిలేదంటూ మినహాయింపునిస్తూ గతంలోనే ఆదాయ పన్ను శాఖ, కోర్టులుసైతం పేర్కొన్నాయి. నమోదుకాని మా సంస్థపై గతంలో మూడు సార్లు నిషేధం విధించారు. అంటే మమ్మల్ని ప్రభుత్వం నమోదిత సంస్థగా గుర్తించినట్లే లెక్క. ఒకవేళ గుర్తించకపోయి ఉంటే నిషేధం విధించడం ఎలా సాధ్యం?’’అని ఆయన ఎదురు ప్రశ్నించారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, ప్రాంగణాల్లో ఆర్‌ఎస్‌ఎస్ కార్యాక్రమాలు, కవాతులను అడ్డుకోవాలని, నిషేధం విధించాలని కర్ణాటక ప్రభుత్వానికి కాంగ్రెస్ మంత్రి ప్రియాంక్ ఖర్గే లేఖ రాసిన నేపథ్యంలో భాగవత్ ఈ మేరకు స్పందించారు.
మేం ఎవరికీ మద్దతివ్వబోం
‘‘దేశంలో ఆర్‌ఎస్‌ఎస్ అనేది ఏ రాజకీయ పార్టీకి మద్దతు పలకబోదు. మేం కేవలం విధానాలకు మాత్రమే మద్దతు పలుకుతాం. సరైన ప్రజా విధానాలకు మాత్రమే మేం జైకొడతా. మేం ఏ వ్యక్తి, సంఘం, రాజకీయ పార్టీకి కొమ్ముకాయబోం. అయోధ్యలో రామమందిరం అంశంలోనూ సంఘ్ కార్యకర్తలు ఏ పార్టీకి మద్దతు పలకలేదు. కేవలం ఆలయ నిర్మాణానికి మాత్రమే సంపూర్ణ మద్దతు పలికారు. అక్కడ బీజేపీ కావొచ్చు కాంగ్రెస్ కావొచ్చు. మరేదైనా పార్టీ ఆలయ నిర్మాణానికి మద్దతిస్తే వాళ్లకే మా మద్దతు ఉంటుంది. మాకు ప్రత్యేకంగా బీజేపీ అంటే మమకారం ఏమీ లేదు. కేవలం ఒక్క పార్టీ కాదు భారతదేశంలోని పార్టీలన్నీ మాపార్టీలే’’అని భాగవత్ వ్యాఖ్యానించారు.
‘హద్దు’మీరితే ఓటమి తప్పదు
‘‘మనతో పాకిస్తాన్ ఏనాటికీ శాంతిని కోరుకోదు. అది కూడా మనశ్శాంతిగా ఉండదు. ఎప్పుడూ భారత్‌కు హాని తలపెట్టాలని తలపోస్తూ తలనొప్పులు తెచ్చుకుంటుంది. సరిహద్దు కట్టుబాట్లను అతిక్రమించాలని చూస్తుంది. తర్వాత భంగపాటుకు గురవుతుంది. 1971 యుద్ధం ఇందుకు నిదర్శనం. భారత్‌ను ఇబ్బంది పెట్టాలని చూసి పాకిస్తాన్ తన తూర్పు భూభాగాన్ని కోల్పోయింది. అది చివరకు బంగ్లాదేశ్‌లా అవతరించింది. యుద్ధం చేయడం కంటే సహకారం అందించడం ముఖ్యం. అది వాళ్లకు చేతకాకపోతే వాళ్లకు అర్థమయ్యే భాషలోనే చెప్పాల్సి ఉంటుంది’’అని అన్నారు.
లవ్ జిహాద్‌కు అంత సీన్ లేదు
‘‘లవ్ జిహాద్ గురించి జనం మరీ అంతలా ఆలోచించాల్సిన సీరియస్ అంశం కాదు. లవ్ జిహాద్‌కు ప్రాధాన్యత ఇచ్చేవాళ్లు ఇస్తే ఇవ్వనివ్వండి. అలాంటి దానిని తుద ముట్టించాలంటే మనం మన ఇళ్లలో హిందూ సంస్కారానికి పట్టం కట్టాలి’’ అని భాగవత్ పిలుపునిచ్చారు.
దేశంలో కులం లేదు.. గందరగోళమే ఉంది
‘‘దేశంలో కుల వ్యవస్థ లేదు. ఈ అంశంలో ప్రజల్లో కాస్తంత గందరగోళం ఉంది. ఎన్నికల కోసమే రాజకీయ పార్టీలు కులం కార్డ్‌ను పట్టుకొస్తున్నాయి. కులంను నిర్మూలించాల్సిన అవసరం లేదు. కులం అనే భావనను మర్చిపోతే సరిపోతుంది. ఇది చాలా సులభం. వ్యక్తిగతం దేశంలోని ప్రతి ఒక్కరూ కులం అనే భావనను పూర్తిగా తమ ఆలోచనల నుంచి తొలగిస్తే చాలు’’అని భాగవత్ వ్యాఖ్యానించారు.


