రాజకీయ సన్యాసం అనుకుంటే.. దేశ ప్రధాని అయ్యారు! | From Retirement to PM : The Incredible Journey of PV Narasimha Rao | Sakshi
Sakshi News home page

రాజకీయ సన్యాసం అనుకుంటే.. దేశ ప్రధాని అయ్యారు!

Jun 28 2026 10:33 AM | Updated on Jun 28 2026 10:46 AM

From Retirement to PM : The Incredible Journey of PV Narasimha Rao

తమిళనాడులోని శ్రీపెరంబుదూర్‌లో 1991 మే 21న జరిగిన బాంబు పేలుడులో రాజీవ్ గాంధీ మరణించడం దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆ సమయంలో రాజకీయ సన్యాసం తీసుకుని, ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు తిరిగి వెళ్లిపోయేందుకు సామాన్లు కూడా సర్దుకున్న పివి నరసింహారావు జీవితం ఒక ఊహించని మలుపు తిరిగింది. అనూహ్య రాజకీయ పరిణామాల మధ్య ఆయన భారతదేశపు 9వ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. నేడు (జూన్ 28) పీవీ 105వ జయంతి సందర్భంగా ఆయన జీవితంలోని కొన్ని ఆసక్తికరమైన విషయాలు..

శంకర్ దయాల్ శర్మ తిరస్కరణ.. పివి వైపు మొగ్గు
రాజీవ్ గాంధీ అంత్యక్రియల అనంతరం తదుపరి ప్రధాని ఎవరనే దానిపై సోనియా గాంధీ చర్చలు జరిపారు. పీఎన్ హక్సర్ సలహా మేరకు తొలుత అప్పటి ఉపరాష్ట్రపతి శంకర్ దయాల్ శర్మకు ఈ పదవిని ప్రతిపాదించారు. అయితే, తన ఆరోగ్య కారణాల దృష్ట్యా ఆయన ఈ బాధ్యతను నిరాకరించారు. ఆ తర్వాత హక్సర్‌తో పాటు రాజీవ్ గాంధీ మిత్రుడు సతీష్ శర్మ కూడా పివి నరసింహారావు పేరును సూచించారు. దీంతో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఆయనను పార్టీ అధ్యక్షుడిగా ఎన్నుకుంది.

సంక్షోభంలో అతిపెద్ద పార్టీగా కాంగ్రెస్
10వ లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ 521 సీట్లలో 232 స్థానాలను గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. ప్రధాని రేసులో శరద్ పవార్ పేరు కూడా వినిపించినప్పటికీ, చివరికి ఆయన వెనక్కి తగ్గారు. మధ్యప్రదేశ్ దిగ్గజ నేత అర్జున్ సింగ్ ప్రతిపాదనతో పివి నరసింహారావును పార్లమెంటరీ పార్టీ నేతగా ఎన్నుకున్నారు. 1991 జూన్ 21న ఆయన ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన క్యాబినెట్‌లో మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా, శరద్ పవార్ రక్షణ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత నంద్యాల ఉపఎన్నికలో పీవీ ఘనవిజయం సాధించారు.

17 భాషల కోవిడుదు పీవీ
పీవీ నరసింహారావు కేవలం రాజకీయ నాయకుడే కాదు, బహుభాషా కోవిదుడు. ఆయనకు తెలుగు, హిందీలతో పాటు అరబిక్, పర్షియన్, స్పానిష్, ఫ్రెంచ్ వంటి దాదాపు 17 భాషలపై అసాధారణ పట్టు ఉండేది. విదేశీ పర్యటనల్లో ఇతర దేశాల నాయకులతో మాట్లాడేటప్పుడు ఆయనకు ఎలాంటి అనువాదకుల (ట్రాన్స్‌లేటర్స్) అవసరం పడేది కాదు. సాహిత్య రంగంలో కూడా ఆయనకు అమితమైన అభిరుచి ఉంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement