
బెంగళూరు, హైదరాబాద్, గురుగ్రామ్ లాంటి నగరాల్లో ట్రాఫిక్ సమస్యలు తలెత్తడం సహజమే. కానీ, జాతీయ రహదారిల్లో.. అదీ నాలుగు రోజులుగా ట్రాఫిక్ ఎక్కడికక్కడే నిలిచిపోవడం గురించి ఎప్పుడైనా విన్నారా?(Massive Traffic Jam). ఇదేదో సమ్మెలో భాగం జరిగిందనుకుంటే మీరు పొరపడినట్లే!!.
బీహార్‌లోని ఔరంగాబాద్-రోహ్‌తాస్ మధ్య ఢిల్లీ-కోల్‌కతా జాతీయ రహదారిపై(Delhi Kolkata Highway) గత నాలుగు రోజులుగా భారీ ట్రాఫిక్ జామ్ కొనసాగుతోంది. వందలాది వాహనాలు బంపర్-టు-బంపర్‌గా నిలిచిపోయి, కిలోమీటర్ల మేర రోడ్డుపై నిలిచిపోయాయి. అయితే ఈ పరిస్థితికి కారణం గత శుక్రవారం రోహ్తాస్ జిల్లాలో కురిసిన భారీ వర్షాలు.
భారీ వర్షాల కారణంగా.. జాతీయ రహదారి 19పై నిర్మాణంలో ఉన్న ఆరు లైన్ల రహదారిపైకి నీరు చేరింది. డైవర్షన్లు, సర్వీస్ రోడ్లు నీటితో మునిగిపోయాయి. అధికార యంత్రాగం సమన్వయం లేకపోవడం, పట్టించుకోకపోవడంతో ట్రాఫిక్ అంతకంతకూ పెరుగుతూ వస్తోంది. కొన్ని కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి గంటల సమయం పడుతోంది.


తాజా సమాచారం ప్రకారం.. ఈ ట్రాఫిక్ జామ్ ఇప్పుడు రోహ్‌తాస్ నుంచి 65 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఔరంగాబాద్ వరకు విస్తరించింది. స్థానిక పరిపాలన, జాతీయ రహదారి ప్రాధికార సంస్థ (NHAI), రహదారి నిర్మాణ సంస్థ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల పరిస్థితి మరింత దిగజారిందని అక్కడ ఆగిపోయిన డ్రైవర్‌లు చెబుతున్నారు.
‘‘30 గంటల్లో కేవలం 7 కిలోమీటర్లు మాత్రమే ప్రయాణించగలిగాం. టోల్, రోడ్ టాక్స్ చెల్లిస్తున్నాం కదా. అయినా ఎవరూ సహాయం చేయరా?’’అని ప్రవీణ్ సింగ్ అనే ఓ డ్రైవర్ ఆవేదన వ్యక్తం చేశాడు. మరో డ్రైవర్ సంజయ్ సింగ్ మాట్లాడుతూ, “రెండు రోజులుగా ట్రాఫిక్‌లోనే ఉన్నాం. ఆకలితో, దాహంతో బాధపడుతున్నాం. కొన్ని కిలోమీటర్లు ప్రయాణించడానికే గంటల సమయం పడుతోంది” వాపోయాడు.
ఇదిలా ఉంటే.. ఈ ట్రాఫిక్ వల్ల వ్యాపారాలు కూడా దెబ్బతింటాయని పలువురు ఆందోళన చెందుతున్నారు. ఆహార పదార్థాలు తీసుకెళ్తున్న డ్రైవర్లు అవి పాడైపోతాయని చెబుతున్నారు. ఇంకోవైపు.. అంబులెన్సులు, అత్యవసర సేవలు, పర్యాటక వాహనాలు ఈ ట్రాఫిక్‌తో ప్రభావితం అయ్యాయి. NHAI ప్రాజెక్ట్ డైరెక్టర్ రంజిత్ వర్మ ఈ ట్రాఫిక్ సమస్యపై స్పందించేందుకు అందుబాటులోకి రాకపోవడం గమనార్హం.
ప్రపంచంలో అత్యంత దారుణమైన ట్రాఫిక్ జామ్ ఎక్కడ ఏర్పడిందో తెలుసా?(World Worst Traffic Jam Incident).. అధికారిక గణాంకాలేవీ లేకపోయినా.. 2010లో చైనా దేశంలోని బీజింగ్-టిబెట్ ఎక్స్‌ప్రెస్‌వే (National Highway 110) పై ఏర్పడిన ట్రాఫిక్ జామ్ ప్రపంచ చరిత్రలోనే అత్యంత దారుణమైనదిగా గుర్తించబడింది. మంగోలియా ప్రాంతం నుండి బీజింగ్‌కు బొగ్గు తీసుకెళ్తున్న వేలాది ట్రక్కులు రహదారిపై నిలిచిపోవడంతో.. బీజింగ్, హెబీ ప్రావిన్స్, ఇన్నర్ మంగోలియాకు రాకపోకలు నిలిచిపోయాయి. ఆగస్టు 14 నుంచి ఆగస్టు 26 వరకు 12 రోజుల పాటు 100 కిలోమీటర్లకు పైగా వాహనాలు నిలిచిపోయి.. ప్రజలు అవస్థలు పడ్డారు.
ఇదీ చదవండి: సౌర తుపానుతో మనిషికి ముప్పేనా?