రాజీనామానే మంచిదనుకున్న ధన్‌ఖడ్‌! | Reason Behind Dhankar Resign May This Also | Sakshi
Sakshi News home page

రాజీనామానే మంచిదనుకున్న ధన్‌ఖడ్‌!

Jul 22 2025 4:05 PM | Updated on Jul 22 2025 5:26 PM

Reason Behind Dhankar Resign May This Also

జనతాదళ్‌, కాంగ్రెస్‌, బీజేపీలలో వివిధ పదవులు, బాధ్యలతో సుదీర్ఘ రాజకీయానుభవం సంపాదించుకున్న వ్యక్తి. పైగా ఓ రాష్ట్రానికి గవర్నర్‌గా పని చేసిన వ్యక్తి.  అనూహ్యంగా తెర మీదకు తెచ్చి.. ‘రైతుబిడ్డ’గా ప్రమోట్‌ చేస్తూ మరీ ఉపరాష్ట్రపతి రేసులో నిలబెట్టి గెలిపించుకుంది ఎన్డీయే కూటమి. అలాంటిది బలవంతంగా ఆయన్ని పదవి నుంచి దించేశారా? లేకుంటే నిజంగానే ఆయన అనారోగ్య కారణాలతో రాజీనామా చేశారా?.. ఇతర కారణాలు ఉన్నాయా?..  

దేశంలో ఇప్పుడు జగ‍్దీప్‌ ధన్‌ఖడ్‌ రాజీనామాపై రాజకీయ రచ్చ నడుస్తోంది. అకస్మాత్తుగా ఆయన ఉపరాష్ట్రపతి పదవికి ఎందుకు రాజీనామా చేశారు? అనే ప్రశ్న తలెత్తింది. లోక్‌సభ వర్షాకాల సమావేశాల్లో నవ్వుతూ కనిపించిన ఆయన.. గంటల వ్యవధిలోనే ఎందుకు రాజీనామా ప్రకటించారు?.. దానికి అంతే వేగంగా ఆమోద ముద్ర ఎందుకు, ఎలా పడింది?. పైగా ఎలాంటి వీడ్కోలు లేకుండానే(కనీసం ఫేర్‌వెల్‌ స్పీచ్‌ కూడా లేకుండా) ఆయన్ని సాగనంపడం.. పలు అనుమానాలకు తావిస్తోంది. ఇందుకు గత ఆరు నెలల పరిణామాలను ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు.

👉ధన్‌ఖడ్‌(74)కు ఈ ఏడాది మార్చిలో ఛాతీ సంబంధమైన సమస్యలు రావడంతో ఎయిమ్స్‌లో చేరి చికిత్స తీసుకున్నారు. ఈ నెల 17వ తేదీన ఓ గార్డెన్‌ విజిటింగ్‌కు వెళ్లిన ఆయన హఠాత్తుగా కుప్పకూలి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆ సమయంలో ఆయన సతీమణితో పాటు ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనా అక్కడే ఉన్నారు. దీంతో వైద్యుల సూచన మేరకే రాజీనామా నిర్ణయం తీసుకున్నానని లేఖలో ధన్‌ఖడ్‌ తెలిపారు.

 అయితే.. ‘‘రాజీనామా వెనుక లోతైన కారణాలే ఉన్నాయి, ఆయన ఎందుకు రాజీనామా చేశారో ఆయనకే తెలుసు..’’ అంటూ కాంగ్రెస్‌ అగ్రనేతలు స్పందించడం ఆసక్తికర చర్చకు దారి తీసింది. 

👉పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్లో భాగంగా జరిగిన బీఏసీ సమావేశానికి బీజేపీ కీలక నేతలు జేపీ నడ్డా, కిరెన్‌ రిజిజ్జు గైర్హాజరు కావడం, ఆ సమావేశంలో ఈ అంశంపై ధన్‌ఖడ్‌ సీరియస్‌ అయ్యారని, ఆ తర్వాతే ఏదో జరిగిందని కాంగ్రెస్‌ వాదన. కానీ, జేపీ నడ్డా మాత్రం ముందస్తు సమాచారం ఇచ్చామని, కాంగ్రెస్‌ అనవసర రాజకీయం చేస్తోందని మండిపడుతున్నారు. ఆయన(ధన్‌ఖడ్‌) వ్యక్తిగత నిర్ణయానికి గౌరవం ఇవ్వాలని బీజేపీ నేత ఒకరు కూడా వ్యాఖ్యానించారు. అయితే.. 

👉ధన్‌ఖడ్‌ పక్షపాత ధోరణితో.. ఏకపక్షంగా సభను(రాజ్యసభ) నడుపుతున్నారంటూ ఆయన్ని అభిశంసించేందుకు ప్రతిపక్ష ఎంపీలు గతేడాది డిసెంబర్‌లో నోటీసులు ఇచ్చారు(ఆ నోటీసు తిరస్కరణకు గురైంది). ఆ ఎంపీలే ఇప్పుడు ధన్‌ఖడ్‌కు సానుభూతిగా స్టేట్‌మెంట్లు ఇస్తుండడం కొసమెరుపు. మరోవైపు.. బీజేపీ మాత్రం ధన్‌ఖడ్‌ రాజీనామా వ్యవహారానికి కాస్త దూరంగానే ఉంటోంది.

👉గత ఆరు నెలలుగా ప్రభుత్వానికి, ధన్‌ఖడ్‌కి మధ్య గ్యాప్‌​ నడుస్తున్న విషయాన్ని కొందరు ఎంపీలు ఇవాళ్టి పార్లమెంట్‌ సెషన్‌ సందర్భంగా బహిరంగంగానే చర్చించుకోవడం గమనార్హం. అయితే ప్రభుత్వం, ఉపరాష్ట్రపతి ధన్‌ఖడ్‌ మధ్య మనస్పర్థలు నివురు గప్పిన నిప్పులా కొనసాగాయని.. గత కొంతకాలంగా అవి తారాస్థాయికి చేరాయన్నది ఆ ముచ్చట్ల సారాంశం.  

👉అంతేకాదు.. ఈ ఆరు నెలల కాలంలో ఉపరాష్ట్రపతిగా ధన్‌ఖడ్‌ చేయాల్సిన విదేశీ పర్యటనలు రద్దవుతూ వచ్చాయి. పైగా ఉపరాష్ట్రపతి హోదాలో ధన్‌ఖడ్‌కు ప్రధాని నరేంద్ర మోదీకి మధ్య భేటీ జరిగి నెలలు కావొస్తున్నాయి(కాకుంటే రాజీనామా తర్వాత ఆయన ఆరోగ్యం బాగుండాలంటూ మోదీ ఓ ట్వీట్‌ మాత్రం చేశారు). ఈ పరిణామాలన్నీ ఏదో జరిగిందనే సంకేతాలనే అందిస్తున్నాయి. వీటికి తోడు బీజేపీ శ్రేణుల నుంచే కొన్ని గుసగుసలు బయటకు వచ్చి తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. 

ఈ మనస్పర్థల కారణంగానే ఆయన్ని పదవి నుంచి తొలగించే ప్రయత్నాలు మొదలయ్యాయని, కొందరు బీజేపీ నేతలు ఈ విషయమై ధన్‌ఖడ్‌ అప్రమత్తం చేశారని చెప్పుకుంటున్నారు. అయితే అవమానకర రీతిలో పదవి కోల్పోవడం కంటే.. రాజీనామానే బెటర్‌ అనుకున్నారన్నది  ఆ గుసగుసల సారాంశంగా పలు జాతీయ మీడియా చానెల్స్‌ కథనాలు ఇస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement