సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ బీఆర్‌ఎస్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్‌ఎస్‌లో తనను విస్మరించిన కారణంగానే పార్టీని వదుకోవాల్సి వచ్చిందని వ్యాఖ్యలు చేశారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు కొత్త చర్చకు దారి తీశాయి.
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తాజాగా సాక్షితో మాట్లాడుతూ..‘పోస్టుల కోసం పదవుల కోసం నేను ఎక్కడికిపోలేదు. విస్మరించారు కాబట్టే నేను వదలాల్సి వచ్చింది. నేను ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజలు నాకు సహకరిస్తారు. నా ప్రజలపై ఆధారపడే నా నిర్ణయాలు ఉంటాయి. ప్రజల ఆశీర్వాదంతోనే ఆరుసార్లు ఎన్నికల్లో పోటీ చేసి గెలిచాను. ఖైరతాబాద్ ప్రజలే నాకు బలం. సేవ చేయాలనే ఉద్దేశం తప్ప పదవుల కోసం నేనెప్పుడూ ఆలోచించలేదు.
ఎంతవరకు అయితే అంత వరకు పోరాటం చేస్తాను. స్పీకర్ నోటీసులు నాకు ఇంకా అందలేదు. పిటిషనర్‌కి నోటీసులు అంది ఉండవచ్చు. ఉన్న విషయాలను సమర్థవంతం చేసుకోవడానికి లీగల్ అంశాలను పరిశీలిస్తున్నాను. స్పీకర్ ఏం అడుగుతారో దానికి సమాధానం చెప్తాం. స్పీకర్ ప్రశ్నలను బట్టి నా సమాధానాలు ఉంటాయి. విచారణకు వ్యక్తిగతంగా హాజరుకావాలని నాకు చెప్పలేదు. మా అడ్వకేట్ స్పీకర్‌కు లేఖలో ఏం రాశారో తెలియదు. బీఆర్‌ఎస్ నన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేయలేదు. వాళ్లు తీసుకునే యాక్షన్ బట్టి నా రియాక్షన్ ఉంటుంది. ఎన్నికలంటే నేనేమీ భయపడను’ అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.


