
ముంబై: దిగ్గజ పారిశ్రామికవేత్త, టాటా గ్రూప్స్ గౌరవ ఛైర్మన్ రతన్ టాటా కన్నుమూశారు. ముంబయిలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి 11.30 గంటలకు తుదిశ్వాస విడిచారు. రతన్ టాటా మరణ వార్తను టాటాసన్స్ ఛైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ ధ్రువీకరించారు.
కాగా రతన్ టాటా అంత్యక్రియలను పూర్తి అధికార లాంఛనాలతో నిర్వహిస్తామని మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండేప్రకటించారు. దివంగత పారిశ్రామికవేత్తకు గౌరవసూచికంగా రాష్ట్ర ప్రభుత్వం గురువారం సంతాప దినంగా ప్రకటించింది. ఈ మేరకు మహారాష్ట్రలోని ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ జెండాను సగానికి ఎగురవేస్తామని సీఎం వెల్లడించారు. అలాగే నేడు జరగాల్సిన అన్నీ వినోదాత్మక కార్యక్రమాలను రద్దు చేస్తున్నట్లు తెలిపారు.
ఇక రతన్ టాటా భౌతికకాయాన్ని ముంబైలోని నారిమన్ పాయింట్‌లోని నేషనల్ సెంటర్ ఫర్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ (ఎన్‌సీసీఏ)లో ఈరోజు ఉదయం 10 నుండి సాయంత్రం 4 గంటల వరకు ఉంచుతారు. అక్కడ ప్రజలు ఆయనకు చివరి నివాళులు అర్పించనున్నారు. ఈజు సాయంత్రం వర్లీ ప్రాంతంలో రతన్ టాటా అంత్యక్రియలు జరగనున్నాయి.
చదవండి: వ్యాపార దిగ్గజం.. దాతృత్వ శిఖరం 'రతన్ టాటా' అస్తమయం
రతన్ టాటా మరణ వార్తతో ప్రధాని మోదీ, రాష్ట్రపతి ముర్ము, ఉపరాష్ట్రపతి ధన్‌ఖడ్ సహా పలువురు ప్రముఖులు సామాజిక మాధ్యమాల వేదికగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. అయితే సోమవారం రతన్ టాటా ఆస్పత్రికి వెళ్లడంతో ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారని, ఐసీయూలో చేరారని వార్తలొచ్చాయి. వాటిపై స్పందించిన ఆయన.. తన ఆరోగ్యం బాగానే ఉందని, ఎలాంటి ఆందోళన అవసరం లేదన్నారు. కేవలం వైద్య పరీక్షలు చేయించుకునేందుకు వెళ్లినట్లు స్పష్టం చేశారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేసిన రెండ్రోజులకే ఆయన దివంగతులయ్యారు.
