వింత రైల్వే వంతెన.. భయపెడుతున్న 90 డిగ్రీల మలుపు.. | Railway Bridge with 90 Degree Turn In Bhopal | Sakshi
Sakshi News home page

వింత రైల్వే వంతెన.. భయపెడుతున్న 90 డిగ్రీల మలుపు..

Jun 12 2025 1:50 PM | Updated on Jun 12 2025 3:04 PM

Railway Bridge with 90 Degree Turn In Bhopal

భోపాల్‌: మనం ఎన్నో రైల్వే వంతెనలను చూసి ఉంటాం. కానీ ఇప్పుడు మనం చూడబోయే రైల్వే వంతెనను ఎక్కడా చూసి ఉండం. ఆ వంతెన మన ఊహకు అందని రీతిలో నిర్మితమయ్యింది. ఈ వింత రైల్వే వంతెన గురించి తెలుసుకున్న వారంతా దానిని చూసేందుకు పరుగులు తీస్తున్నారు.

మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లోని ఐష్‌బాగ్ స్టేడియం సమీపంలో నిర్మించిన ఈ రైల్వే ఓవర్‌బ్రిడ్జి (ఆర్‌ఓబీ)అధికారికంగా ప్రారంభించకముందే, చర్చనీయాంశంగా మారింది. ఈ వంతెన అత్యంత విచిత్రంగా 90 డిగ్రీల మలుపును కలిగి  ఉండటాన్ని అందరూ విశేషంగా చెప్పుకుంటున్నారు. మరోవైపు స్థానికులు వంతెన ఇలావుంటే ప్రమాదాలు జరుగుతాయేమోనని భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.

ఈ వంతెన నిర్మాణానికి భూమి కొరత ఎదురుకావడం సమీపంలోనే మెట్రో రైలు స్టేషన్ ఉండటంతో వంతెను ఈ విధంగా నిర్మించక తప్పలేదని వంతెను నిర్మించిన అధికారులు చెబుతున్నారు. ఈ వంతెన మహామై కా బాగ్, పుష్పా నగర్,స్టేషన్ ప్రాంతం నుండి న్యూ భోపాల్‌కు ప్రజల రాకపోకలను సులభతరం చేయనుంది. 2023, మార్చిలో దీని నిర్మాణానికి ముందు.. ఇది పూర్తయ్యాక ఐష్‌బాగ్ ప్రాంత ప్రజలు రైల్వే క్రాసింగ్ వద్ద వేచి ఉండాల్సిన  పని లేదని అధికారులు చెప్పారు. మూడు లక్షల మంది  ఈ వంతెన కారణంగా ప్రయోజనం పొందుతారని కూడా తెలిపారు.

రూ.18 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ ఓవర్‌బ్రిడ్జి 648 మీటర్ల పొడవు,  8.5 మీటర్ల వెడల్పు కలిగివుంది. అయితే ఈ వంతెనలో ఉన్న 90 డిగ్రీల మలుపు కారణంగా పలువురు ప్రమాద భయం ఉంటుందని అంటున్నారు. సోషల్ మీడియా  యూజర్స్‌, స్థానికులు ఈ వంతెన డిజైన్‌పై పలు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఈ రకమైన మలుపు ప్రమాదాలకు దారితీయవచ్చని, వాహనాలకు ఈ మలుపును గమనించడం కష్టంగా మారవచ్చని అంటున్నారు. పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ (బ్రిడ్జి డిపార్ట్‌మెంట్) చీఫ్ ఇంజనీర్ వి డి వర్మ  మీడియాతో  మాట్లాడుతూ మెట్రో స్టేషన్ కారణంగా,  ఈ ప్రాంతంలో పరిమితమైన భూమి లభ్యత ఉంది.  అందుకే వంతెనను ఇలా నిర్మించడం తప్ప మరో మార్గం లేదు. ఈ ఓవర్‌బ్రిడ్జిపై చిన్న వాహనాలు మాత్రమే నడుస్తాయని, భారీ వాహనాలను అనుమతించబోమని ఆయన అన్నారు.

ఇది కూడా చదవండి: కారులో ఇన్‌ఫ్లుయెన్సర్ కమల్‌ కౌర్‌ మృతదేహం.. రంగంలోకి పోలీసులు

Advertisement
 
Advertisement
Advertisement