వామ్మో తెలుగు అనువాదం! | Sakshi
Sakshi News home page

వామ్మో తెలుగు అనువాదం!

Published Thu, Nov 30 2023 5:29 AM

Rahul Gandhi shared an anecdote from Telangana about how the translator  - Sakshi

కోజికోడ్‌: తెలంగాణలో ఎన్నికల ప్రచార సభల్లో తన ప్రసంగాల అనువాదం సందర్భంగా చిత్రమైన సమస్యలు ఎదుర్కొన్నట్టు కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌గాంధీ చెప్పుకొచ్చారు. తెలంగాణలో నెల రోజులకు పైగా హోరాహోరీగా సాగిన అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి మంగళవారంతో తెర పడటం తెలిసిందే. బుధవారం కేరళలోని కోజికోడ్‌లో రాహుల్‌ ఓ పుస్తకావిష్కరణలో పాల్గొన్నారు. ఆయన ప్రసంగాన్ని ప్రముఖ ఉపన్యాసకుడు, ఐయూఎంఎల్‌ ఎంపీ అబుస్సమద్‌ సమాధానీ మలయాళంలోకి అనువదించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఎన్నికల ప్రచారంలో తనకెదురైన అనుభవాలను రాహుల్‌ గుర్తు చేసుకున్నారు. ‘‘ఒక ప్రచార సభలో నా ప్రసంగాన్ని అనువదిస్తున్న వ్యక్తి ఎందుకోగానీ చాలాసార్లు ఇబ్బంది పడ్డాడు.

నేనొకటి చెబుతుంటే ఆయన మరొకటి చెప్పసాగాడు. ఇక అలా కాదని నేను మాట్లాడిన పదాలు లెక్కబెట్టడం మొదలు పెట్టా. నేను హిందీలో ఐదు పదాలు మాట్లాడినప్పుడు తెలుగులో ఏడెనిమిది పదాలతో ముగిస్తాడని చూశా. కానీ ఆయన ఏకంగా 20 నుంచి 30 పదాలు మాట్లాడాడు. పైగా నేను బోరు కొట్టే విషయాలు మాట్లాడినప్పుడేమో జనం పరమోత్సాహంతో గట్టిగా చప్పట్లు కొట్టారు. మాంచి ఉత్సాహపూరితమైన ముచ్చట్లు చెప్పినప్పుడేమో అందరూ పూర్తి నిశ్శబ్దంగా ఉన్నారు. అంతా అనువాద మహిమ!’’ అంటూ వాపోయారు. ‘‘అంతా అలా ఉల్టాపల్టాగా నడిచింది. అయినా సరే, నేను ఎవరిపైనా కోపగించుకోలేని పరిస్థితి! పైగా ప్రసంగం సాగినంతసేపూ నిండుగా నవ్వుతూనే ఉండాలి’’ అని చెప్పుకొచ్చారు. బహుశా తన ప్రసంగాలకు అనువాదకునిగా ఉండటం ప్రమాదకరమైన పనేనంటూ రాహుల్‌ చమత్కరించడంతో అంతా నవ్వుకున్నారు.

చిరిగిన దుస్తుల మాటున సంపద దాస్తున్న నేతలు
రాజకీయ నాయకుల నిరాడంబర వస్త్ర శైలిని బట్టి వారిని అంచనా వేయకూడదని రాహుల్‌ అభిప్రాయపడ్డారు. నేటి నాయకులు తాము చూపించదలచింది మాత్రమే ప్రజలకు చూపిస్తుంటారని అన్నారు. ‘‘నన్ను కలవడానికి ఎందరో నాయకులు వస్తుంటారు. సాదాసీదా బట్టలు, చిరిగిన బూట్లతో కనిపిస్తారు. కానీ వాళ్లింటికి వెళ్తే పోరి్టకోలో ఖరీదైన బీఎండబ్ల్యూ కార్లుంటాయి. వాళ్ల పిల్లలు అతి ఖరీదైన జీవితం గడుపుతూ కన్పిస్తారు. కనుక ఒక రాజకీయ నాయకుని ఆర్థిక స్థితిని సరిగా అంచనా వేయాలంటే అతని పిల్లలను గమనిస్తే చాలు. 18 ఏళ్ల రాజకీయ జీవితంలో నేను కనిపెట్టిన తిరుగులేని సూత్రమిది’’ అని చెప్పారు. 

Advertisement
 

తప్పక చదవండి

Advertisement