
ఇంఫాల్: సమాజంలో నెలకొన్న సమస్యలకు, వివాదాలకు హింసాకాండ ఎంతమాత్రం పరిష్కార మార్గం కాదని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ తేలి్చచెప్పారు. మణిపూర్‌లో తక్షణమే శాంతి నెలకొనాలని ఆకాంక్షించారు. ఇందుకోసం రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల సహకరించాలని విజ్ఞప్తి చేశారు. రాహుల్ శుక్రవారం మణిపూర్ గవర్నర్ అనసూయ ఉయికేతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో ఘర్షణకు తెరదించి, శాంతియుత పరిస్థితులు నెలకొనేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని గవర్నర్‌ను కోరారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. మణిపూర్ ప్రజల దుఃఖాన్ని పంచుకోవడానికి తాను ఇక్కడికి వచ్చానని రాహుల్ చెప్పారు. రాహుల్ శుక్రవారం ప్రజా సంఘాల సభ్యులతో సమావేశమై తాజా పరిస్థితిపై వారితో చర్చించారు.
పదవి నుంచి తప్పుకోను..: బిరేన్ సింగ్
మణిపూర్‌లో జాతుల మధ్య ఎడతెగని ఘర్షణల నేపథ్యంలో సీఎం రాజీనామా చేశారంటూ వస్తున్న వదంతులకు ముఖ్యమంత్రి బిరేన్ సింగ్ చెక్‌పెట్టారు. పదవి నుంచి వైదొలగడం లేదని స్పష్టతనిచ్చారు. శుక్రవారం రాజ్‌భవన్ వైపు వెళ్తున్న సీఎం కాన్వాయ్‌ను పెద్దసంఖ్యలో ప్రజలు అడ్డగించారు. ఈ సందర్భంగా ఆయన.. సీఎం పదవికి రాజీనామా చేయడం లేదని ప్రకటించారు. ఇలా ఉండగా, గురువారం కాంగ్‌పోక్పి జిల్లాలో ఆందోళనకారులు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన కాల్పుల్లో గాయపడిన అయిదుగురిలో ఒకరు శుక్రవారం ఆస్పత్రిలో చనిపోయారు. దీంతో ఈ ఘటనలో మృతుల సంఖ్య మూడుకు చేరింది.