
అమెరికాలో అదానీ అక్రమాలపై విచారణ జరిపిస్తానని ట్రంప్ భయపెడుతున్నారు
ఆర్థిక ఒప్పందాలు బయటపడతాయని మోదీ భయం
రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారతీయ వస్తువులపై దిగుమతి సుంకాల సుత్తితో మోదుతానని మొత్తుకుంటున్నా మోదీ మౌనం వహించడం వెనుక అక్రమ వ్యాపార సంబంధాలు దాగున్నాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రమైన విమర్శలు గుప్పించారు. మరో 24 గంటల్లో మరోమారు భారత్‌పై దిగుమతి టారిఫ్‌లను పెంచుతానని మంగళవారం ట్రంప్ ప్రకటించిన మరుసటి రోజే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ మోదీపై విమర్శలతో విరుచుకుపడ్డారు.
ఈ మేరకు రాహుల్ తన సామాజిక మాధ్యమ ‘ఎక్స్’ ఖాతాలో పలు పోస్ట్‌లు పెట్టారు. ‘‘ భారత్‌పై అదనపు టారిఫ్‌లు మోపుతానని ట్రంప్ పదేపదే ప్రకటిస్తూ ఇప్పటికే ఒకసారి 25 శాతం పెంచినా ప్రధాని మోదీ ఏమాత్రం ట్రంప్‌ను నిలువరించలేకపోయారు. దీని వెనుక అసలు కారణం ఇప్పటికైనా భారతీయు లకు తెలియాల్సి ఉంది. అదేంటంటే అమెరికాలో గౌతమ్ అదానీపై అక్కడి విచారణ సంస్థలు దర్యాప్తు కొన సాగిస్తున్నాయి.
మోదీ, ఏఏ(అంబానీ, అదానీ), రష్యా ముడి చమురు కొను గోళ్ల వ్యవహారంలో అక్రమ ఆర్థిక సంబంధాలు బట్టబయలు చేస్తానని ట్రంప్ బెదిరిస్తున్నారు. అందుకే భారత్‌పై ఎంతటి టారిఫ్‌ల భారం పడుతున్నా ప్రధాని మోదీ చీమకుట్టినట్లయినా లేకుండా మౌనంగా ఉండిపోయారు. అదానీ దర్యాప్తు పేరు చెప్పి మోదీ చేతుల్ని ట్రంప్ కట్టిపడేశారు’’ అని రాహుల్ గాంధీ ఆరోపించారు.
రాహుల్ ఆరోపణలపై అదానీ గ్రూప్ సంస్థనుంచిగానీ కేంద్రప్రభుత్వం నుంచిగానీ ఇంతవరకు ఎలాంటి స్పందన, వివరణ రాలేదు. రష్యాతో ముడి చమురు వాణిజ్యాన్ని భారత్ మరింతగా పెంచుకోవడంపై ట్రంప్ మొదట్నుంచీ తీవ్ర స్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేస్తుండటం తెల్సిందే. ఈ అక్కసుతోనే ఆయన భారత్‌పై అదనపు దిగుమతి టారిఫ్‌లను విధిస్తు న్నారు. ఇప్పటికే ఒక దఫా పెంచగా మరోదఫా మరికొన్ని గంటల్లో పెంచుతానని ప్రకటించడం, భారత్ ఘాటుగా బదులివ్వడం తెల్సిందే.