ఓట్ల చోరీ ఆరోపణలు, ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్)పై సోమవారం సుప్రీంకోర్టు వరకు భారీ మార్చ్ నిర్వహించిన ప్రతిపక్షాలు.. తాజాగా తమ తదుపరి కార్యాచరణపై దృష్టి సారించాయి. ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్‌పై పోరును మరింత ఉధృతం చేసేందుకు కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సిద్ధమయ్యారు.
‘మార్చ్ ఫర్ డెమోక్రసీ’ పేరుతో సోమవారం ఢిల్లీలో నిర్వహించిన ఆందోళనలో ప్రతిపక్ష నేతలు, కార్యకర్తలు, పౌరసమాజ ప్రతినిధులు పాల్గొన్నారు. ఎన్నికల సంఘం పనితీరు, ఓటర్ల జాబితా సవరణలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై తమ నిరసనను వ్యక్తం చేశారు. అనంతరం ఇండియా కూటమి నేతలు సుప్రీంకోర్టును ఆశ్రయిస్తూ ఉమ్మడి పిటిషన్ దాఖలు చేశారు.
ఈ నేపథ్యంతో.. ఇవాళ ఇండియా కూటమి నేతలు సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించనున్నారు. ఆపై సాయంత్రం రాహుల్ నివాసంలో హై టీ సమావేశం జరగనుంది. ఇండియా కూటమి నేతలు, పౌరసమాజ ప్రతినిధులు, విద్యార్థి సంఘాల నాయకులకు ఆయన ఆహ్వానం పంపినట్లు తెలుస్తోంది. సీజేపీ నేతలకు ఆహ్వానం వెళ్లిందా? వాళ్లు హాజరవుతారా? అనే సస్పెన్స్ కొనసాగుతోంది.
జ్ఞానేశ్ కుమార్ టార్గెట్‌గా..
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఓటర్ల పేర్ల తొలగింపు, ఎన్నికల జాబితాల్లో అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ.. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ఎస్‌ఐఆర్ ప్రక్రియను ఉపసంహరించుకోవాలని కోరుతున్నాయి. సుప్రీంకోర్టులో దాఖలు చేసిన ఉమ్మడి పిటిషన్‌లో జ్ఞానేశ్ కుమార్‌తో పాటు ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధు, వివేక్ జోషీలను ప్రతివాదులుగా పేర్కొన్నాయి. ఎస్‌ఐఆర్ నిర్వహణకు సంబంధించిన నిర్ణయం చట్టబద్ధతను పరిశీలించాలని విజ్ఞప్తి చేశాయి.
ఢిల్లీలో భద్రత కట్టుదిట్టం
మరోవైపు, ఢిల్లీలో నిరసనల నేపథ్యంలో కేంద్ర ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రతిపక్షాల ఆందోళనలు, తదుపరి కార్యాచరణపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉండగా, బిహార్ రాజధాని పాట్నాలోనూ విద్యార్థి, యువజన సంఘాలు ఎస్‌ఐఆర్‌కు వ్యతిరేకంగా మంగళవారం ఆందోళనకు పిలుపునిచ్చాయి. గాంధీ మైదాన్ నుంచి లోక్‌భవన్ వరకు మార్చ్ నిర్వహించి, సీఈసీ రాజీనామా, ఎస్‌ఐఆర్ ఉపసంహరణను డిమాండ్ చేయనున్నాయి. బిహార్, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలను రద్దు చేయాలని కూడా కోరుతున్నాయి.
ఈ పరిణామాల మధ్య రాహుల్ గాంధీ ఏర్పాటు చేసిన సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. ఎన్నికల సంఘంపై విపక్షాల ఆరోపణలు, ఎస్‌ఐఆర్‌పై న్యాయపోరాటం, తదుపరి నిరసన కార్యక్రమాలపై ఈ భేటీలో చర్చించే అవకాశం ఉంది.
ఇదీ చదవండి: రాహుల్ గాంధీ పిటిషన్ చెల్లదా?


