
రాహుల్ గాంధీ హెచ్చరిక
పట్నాలో ఈసీ కార్యాలయం ఎదుట నిరసన
పట్నా: 2024లో మహారాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో బీజేపీకి అనుకూలంగా రిగ్గింగ్ జరిగిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. త్వరలో బిహార్‌లో జరిగే ఎన్నికల్లోనూ ఇవే ఫలితాలను పునరావృతం చేయాలని కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు. ఇందులో భాగంగా ఈసీ చేపట్టిన ఓటరు జాబితా (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) సవరణ ద్వారా ప్రజల నుంచి ఓటు హక్కును లాగేసుకునేందుకు కుట్ర పన్నిందన్నారు.
పట్నాలోని ఎన్నికల కమిషన్ కార్యాలయం ఎదుట బుధవారం ఇండియా కూటమి పార్టీలు ప్రత్యేక ఓటరు జాబితా సవరణకు వ్యతిరేకంగా చేపట్టిన నిరసన ర్యాలీలో రాహుల్ మాట్లాడారు. బీజేపీ మహారాష్ట్రలో బోగస్ ఓట్లను భారీగా చేర్పించడం ద్వారా ఫలితాలను అనుకూలంగా మార్చుకుందన్నారు. రాజ్యాంగాన్ని కాపాడాల్సిన ఎన్నికల కమిషన్ బీజేపీ ఆదేశాల మేరకు పనిచేస్తోందని విమర్శించారు.
బీజేపీ నామినేట్ చేసిన ఎన్నికల కమిషనర్లు, ఆ పార్టీకి అనుకూలంగా పని చేస్తున్నారన్నారు. ప్రజల ఓట్లు, ముఖ్యంగా యువత నుంచి ఓటు హక్కును దొంగిలించేందుకు ఈసీ చేసే ప్రయత్నాలను తాము కొనసాగనీయబోమని స్పష్టం చేశారు. రాజ్యాంగ ప్రతిని చూపుతూ రాహుల్ ప్రసంగించారు.
కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా ట్రేడ్ యూనియన్లు చేపట్టిన జాతీయ స్థాయి నిరసనల్లో భాగంగా చేపట్టిన ఈ ర్యాలీలో ఆర్‌జేడీ నేత తేజస్వీ యాదవ్ మాట్లాడుతూ.. ఎన్నికల కమిషన్ రాజకీయ పార్టీ మాదిరిగా తయారైందని దుయ్యబట్టారు. ఓటర్ల జాబితా నుంచి ఇప్పుడు పేర్లు తీసేస్తున్నారు..ఆ తర్వాత రేషన్, పింఛను కూడా రాకుండా చేస్తారంటూ నితీశ్ సర్కార్‌పై మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో ఈ సర్కార్‌కు ఘోర పరాజయం తప్పదన్నారు. అనంతరం సీపీఐ, సీపీఎం, సీపీఐఎంఎల్ ప్రధాన కార్యదర్శులు డి.రాజా, ఎంఏ బేబీ, దీపాంకర్ భట్టాచార్య కూడా మాట్లాడారు.