
న్యూఢిల్లీ: అమెరికాతో కొనసాగుతున్న వాణిజ్య సుంకాల ఉద్రిక్తతల నడుమ ప్రధాని నరేంద్ర మోదీ జపాన్ పర్యటన ఆసక్తికరంగా మారింది. జపాన్‌తో ఆర్థిక, వ్యూహాత్మక సంబంధాలను పెంచుకునే వార్షిక ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ జపాన్ చేరుకున్నారు. ఈ రెండు రోజుల పర్యటనలో ప్రధాని మోదీ ‘క్వాడ్’పై దృష్టి సారించనున్నారు.
ప్రధాని మోదీ జపాన్ ప్రధాని షిగేరు ఇషిబాతో పాటు 15వ ఇండియా-జపాన్ వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొననున్నారు. జపాన్‌కు చెందిన మీడియా ప్లాట్‌ఫామ్ నిక్కీ ఆసియా, రాబోయే దశాబ్దంలో భారతదేశంతో ద్వైపాక్షిక వ్యాపారాన్ని పెంచడానికి జపాన్ 10 ట్రిలియన్ యన్ (68 బిలియన్ అమెరికన్ డాలర్ల) పెట్టుబడి పెడుతుందని తెలిపింది. కృత్రిమ మేధస్సు, సెమీకండక్టర్లు, పర్యావరణం మరియు వైద్యంతో సహా బహుళ రంగాలో ఇది ఊతం కానున్నదని పేర్కొంది. ఈ పర్యటనకు ముందు ప్రధాని మోదీ‘ఎక్స్’లో.. ‘ఇరుదేశాల మధ్య సహకారాన్ని పెంపొందించేందుకు, ఆర్థిక,పెట్టుబడి సంబంధాల పరిధిని, ఆశయాన్ని విస్తరించేందుకు, ఏఐ,సెమీకండక్టర్‌లతో సహా నూతన సాంకేతిక రంగాలలో సహకారాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తామని అన్నారు.
ప్రపంచంలో చైనాకు పెరుగుతున్న ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు, ఇండో-పసిఫిక్ దేశాలకు నిధులు, ఆర్థిక అభివృద్ధికి ప్రత్యామ్నాయాన్ని అందించడానికి ఏర్పడిన వ్యూహాత్మక సమూహమే ‘క్వాడ్’ అని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ‘క్వాడ్’లో భారతదేశం, ఆస్ట్రేలియా, జపాన్, యునైటెడ్ స్టేట్స్ భాగస్వాములుగా ఉన్నాయి. కాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశంపై 50 శాతం సుంకాలు విధించిన తర్వాత క్వాడ్ దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. జపాన్ వాణిజ్య సంధానకర్త రియోసీ అకాజావా చివరి నిమిషంలో అమెరికా పర్యటనను రద్దు చేసుకున్నారు. అలాగే జపాన్.. అమెరికాకు అందించే 550 బిలియన్ డాలర్ల పెట్టుబడి ప్యాకేజీని ఖరారు చేయడంలో ఆలస్యం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Landed in Tokyo. As India and Japan continue to strengthen their developmental cooperation, I look forward to engaging with PM Ishiba and others during this visit, thus providing an opportunity to deepen existing partnerships and explore new avenues of collaboration.… pic.twitter.com/UPwrHtdz3B
— Narendra Modi (@narendramodi) August 29, 2025
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ప్యాకేజీ మొత్తాన్ని తమ ఇష్టానుసారం పెట్టుబడి పెట్టడానికి వినియోగిస్తామని పేర్కొనగా,జపాన్ అధికారులు అందుకు విభేదించారు. తమ పెట్టుబడి పరస్పర ప్రయోజనాలకు లోబడి ఉంటుందని స్పష్టం చేశారు. కాగా ప్రధాని మోదీ ఈ పర్యటనలో టోక్యోలోని ఎలక్ట్రాన్ ఫ్యాక్టరీ, బుల్లెట్ రైళ్ల కోచ్‌లను నిర్మించే తోహోకు షింకన్‌సెన్ ప్లాంట్‌ను కూడా సందర్శిస్తారు. భారతదేశ బుల్లెట్ రైలు ప్రాజెక్టులో టోక్యో భాగస్వామ్యం పై ఇరు దేశాలు చర్చించనున్నాయి. భారత్- జపాన్ మధ్య రక్షణ సహకారాన్ని మరింతగా పెంచాలని ప్రధాని మోదీ యోచిస్తున్నారు. జపాన్ పర్యటన తర్వాత ప్రధాని మోదీ చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ ఆహ్వానం మేరకు టియాంజిన్‌లో జరిగే షాంఘై శిఖరాగ్ర సమావేశంలో పాల్గొననున్నారు.