పుణె పోర్షే కేసు: ఇవేం ట్విస్టులు బాబోయ్‌! | Pune Porsche Accident Case: Two Doctors Arrested For Manipulating Teen Driver's Blood Sample Report | Sakshi
Sakshi News home page

Pune Porsche Case: రీల్‌ను మించిన రియల్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌.. ఇవేం ట్విస్టులు బాబోయ్‌!

Published Mon, May 27 2024 11:36 AM

Pune Porsche case: two Doctors Arrested For Manipulating Teen Report

  • గుద్దింది ఎవరు?.. మైనరేనా? డ్రైవరా?

  • పోయింది మాత్రం రెండు ప్రాణాలు

  • ప్రమాదానికి కారణం ఆ మైనరే!

  • పైగా మద్యం సేవించి ఉన్నాడు

  • తండ్రి బిల్డర్‌.. సంఘంలో పలుకుబడి ఉన్న వ్యక్తి

  • అందుకే కేసును తారుమారు చేసే ప్రయత్నాలు

  • ఈ క్రమంలోనే రోజుకొక ట్విస్ట్‌ తెరపైకి 

పుణె పోర్షే కారు ప్రమాదం.. రోజుకో ట్విస్ట్‌తో థ్రిల్లర్‌ కథను తలపిస్తోంది.  తాజాగా నిందితుడైన మైనర్‌ రక్త నమూనాల రిపోర్టులను తారుమారు చేసినందుకు పోలీసులు ఇద్దరు డాక్టర్లను అరెస్ట్‌ చేశారు. సాసూన్‌ ఆస్పత్రిలోని డా. అజయ్‌ తావ్రే, డా. శ్రీహరి హార్నర్‌ పుణె క్రైం బ్రాంచ్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఎందుకంటే..
ప్రభుత్వ ఆస్పత్రిలో డా. అజయ్‌ తావ్రే ఫొరెన్సిక్‌ హెడ్‌గా పనిచేస్తున్నారు. రోడ్డు ప్రమాద ఘటన రోజు నిందిత మైనర్‌ బాలుడు తన స్నేహతులతో మద్యం చేవించినట్లు సీసీటీవీ ఫుటేజ్‌లో స్పష్టంగా కన్పించిన విషయం తెలిసిందే. అయితే మైనర్‌ బాలుడి రక్త పరీక్షలో మాత్రం మద్యం సేవించనట్లుగా లేకపోవటం, ఆ రిపోర్టు నెగిటివ్‌ రావటం గమనార్హం. దీంతో రక్త నమూనాలను తారుమారు చేసిన ఇద్దరు డాక్టర్లను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

అంతకు ముందు  పుణె పోలిసు కమిషనర్ అమితోష్‌ కుమారు మాట్లాడారు. ‘మద్యం మత్తులో కారు నడపటం వల్ల జరిగిన ప్రమాదం కాదు. మైనర్‌ బాలుడికి తన ప్రవర్తనపై పూర్తి అవగాహన ఉంది. మైనర్‌,అతని స్నేహితులు కలిసి రెండు బార్లలో పార్టీ చేసుకున్నారు. తర్వాత ఇరుకైన వీధిలో నంబర్‌ ప్లేట్‌ లేని కారుతో ర్యాష్‌ డ్రైవింగ్‌ చేశారు. అందుకే మేము దీనిపై దృష్టి పెట్టాము. అతను పూర్తిగా అవగాహనతో ఉన్నాడు. తన చర్యల వల్ల  ఎదుటువారి ప్రాణాలు పోతాయని తెలుసు. ప్రమాదం జరిగిన తర్వాత రెండు వేర్వేరు సమయాల్లో బ్లడ్‌ను పరీక్ష చేయించాము. రెండు ఒకేలా కచ్చితంగా ఉన్నాయి’అని   అమితోష్‌ కుమారు తెలిపారు.

పోలిసులు వివరాల ప్రకారం.. మొదటి రక్త నమూనాలో మద్యం తాగినట్లు రాలేదు. రెండో నమూనాలో మద్యం సేవించినట్లు పాజిటివ్‌ రావటం గమనార్హం. దీంతో డీఎన్‌ఏ టెస్ట్‌ చేయించారు. డీఎన్‌ఏ టెస్ట్‌లో సాంపిళ్లు వేరుగా ఉన్నాయి. మైనర్‌ రక్త నమూనా మరోక వ్యక్తి రక్త నమూనాతో తారుమారు అయింది.దీంతో  మైనర్‌ రిపోర్టులో నెగటివ్‌ వచ్చింది.

ఆదివారం (మే 26): ప్రమాదం జరిగిన సమయంలో తానే కారు నడిపినట్లుగా డ్రైవర్‌ అంగీకరించేందుకు డ్రైవర్‌ కుటుంబానికి.. మైనర్‌ తాత పెద్దమొత్తంలో డబ్బు, బహుమతులు ఆశ చూపించారని పోలీసులు న్యాయస్థానానికి వివరించారు. తాము చెప్పినట్లే నడుచుకోవాలని అతడిని బెదిరించారని తెలిపారు. బాలుడి తాతపై ఉన్న ఇతర కేసుల వివరాలు కూడా పోలీసులు న్యాయస్థానానికి వివరించారు. ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు బాలుడి తాతకి ఈనెల 28 వరకు రిమాండు విధించింది.

శనివారం( మే 25):
రోడ్డు ప్రమాదం ఘటనకు కారకుడైన టీనేజర్‌ తాత సురేంద్ర అగర్వాల్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. డ్రైవర్‌ గంగారాంను ఇరికించే ప్రయత్నం సురేంద్ర చేసిందేనని పోలీసులు నిర్ధారించుకున్నారు. గంగారాంను బెదిరించి.. ప్రమాద సమయంలో కారు తానే నడిపినట్లు పోలీసుల వద్ద చెప్పాలని ఒత్తిడి చేసింది సురేంద్ర అని విచారణలో తేలింది. దీంతో.. కొత్త కేసు నమోదు చేసుకున్న పుణే క్రైమ్‌ బ్రాంచ్‌.. ఇవాళ వేకువ ఝామున 3గం. టైంలో సురేంద్రను ఆయన నివాసంలోనే అరెస్ట్‌ చేసింది. అలా ఈ కేసులో మూడో ఎఫ్‌ఐఆర్‌ నమోదు అయ్యింది.

శుక్రవారం( మే 24): 
ప్రమాదం గురించి వైర్‌లైస్‌ కంట్రోల్‌రూమ్‌కు సమాచారం ఇవ్వలేదన్న కారణంగా పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌, అసిస్టెంట్‌ పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌లను సస్పెండ్‌ చేశారు.

గురువారం( మే 23): పోర్షే కారు ప్రమాద ఘటన జరిగినప్పుడు కారును నడిపింది తమ డ్రైవర్‌ అని మైనర్‌ బాలుడి తండ్రి విశాల్‌ అగర్వాల్‌ పేర్కొన్నారు. దీంతో కేసు కొత్త మలుపు తీసుకుంది. అయితే, కేసు నుంచి మైనర్‌ను తప్పించేందుకే డ్రైవర్‌ను ఇరికిస్తున్నారా? అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి.

బుధవారం( మే 22): 
రోడ్డు ప్రమాదానికి ముందు ప్రముఖ బిల్డర్‌ కుమారుడైన మైనర్‌ బాలుడు కేవలం 90 నిమిషాలకు పబ్బులో రూ. 48 వేలు ఖర్చు చేసినట్లు పోలీసులు తెలిపారు.

మంగళవారం( మే 21): 
రోడ్డు ప్రమాదం కేసులో పోర్షే కారు నడిపిన మైనర్‌ బాలుడి తండ్రి విశాల్‌ అగర్వాల్‌ని పోలీసులు అరెస్ట్‌ చేశారు. జువైనల్‌ జస్టిస్‌ యాక్టు కింద ఆయనపై నమోదైన కేసు ఆధారంగా ఔరంగాబాద్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

సోమవారం( మే 20): 
తన ర్యాష్‌ డ్రైవింగ్‌తో ఇద్దరి ప్రాణాలు బలిగొన్న నిందుతుడైన మైనర్‌కు 15 గంటల్లోనే కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. కోర్టు విధించిన షరతులు చర్చనీయాంశంగా మారి సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. ‘ట్రాఫిక్‌ పోలీసుతో 15 రోజులు పని చేయాలి. మానసిక పరివర్తనకు సైకియాట్రిస్ట్ వద్ద చికిత్స చేయించుకోవాలి. ‘రోడ్డు ప్రమాదాలు, వాటి పరిష్కార మార్గాలు’అనే టాపిక్‌ మీద 300 పదాలలో వ్యాసం రాయాలి. డి- అడిక్షన్‌ సెంటర్‌లో పునరాసం  కోరాలి. ట్రాఫిక్‌ రూల్స్‌ చదవి జువైనల్‌ జస్టిస్‌ బోర్డుకు ప్రజంటేషన్‌  ఇవ్వాలి. రోడ్డు ప్రమాద బాధితులకు భవిష్యత్తులో అండగా ఉండాలి’అని జువైనల్‌ కోర్టు మైనర్‌ బాలుడికి షరతులు విధించింది.

ఆదివారం(మే 19): 
ప్రముఖ బిల్డర్‌ కుమారుడైన మైనర్‌ ఆదివారం ఉదయం కోరేగావ్ పార్క్ వద్ద వేగంగా పోర్షే కారును నడుతూ.. ఓ బైక్‌ను ఢికొట్టాడు. ఈ ప్రమాదంలో అనిస్ దుధియా ,అశ్విని కోస్టా అనే  ఇద్దరు ఐటీ ఉద్యోగులు మృతి చెందారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Advertisement
 
Advertisement
 
Advertisement