
పుణే:మహారాష్ట్రలోని పూణేలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. ఒక ఐటీ ఇంజనీర్ తాను పనిచేస్తున్న సంస్థ సమావేశంలో పాల్గొన్న సమయంలో తనకు అకస్మాత్తుగా ఛాతీ నొప్పి వస్తున్నదని తోటి ఉద్యోగులకు తెలిపారు. తరువాత తనను క్షమించమని అక్కడున్నవారిని కోరుతూ, ఆఫీసు భవనంలోని ఏడవ అంతస్తు నుంచి కిందకు దూకాడు.
హింజెవాడి ఐటీ పార్క్‌లోని అట్లాస్ కాప్కోలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. అతను రాసినదిగా చెబుతున్న లేఖలో తన జీవితంలోని వైఫల్యాలను పేర్కొంటూ, తన తండ్రిని క్షమాపణలు కోరాడు. పుణేలోని 23 ఏళ్ల ఐటీ ప్రొఫెషనల్ పియూష్ అశోక్ కవాడే ఈ ఘటనలో ప్రాణాలొదిలాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం హింజెవాడి ఫేజ్ వన్‌లోని అట్లాస్ కాప్కోలో ఈ ఘటన చోటుచేసుకుంది. ‘నేను జీవితంలో అన్ని చోట్లా ఓడిపోయాను. నన్ను క్షమించండి’ అంటూ పియూష్ రాసిన లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సీనియర్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ బాలాజీ పాండ్రే మాట్లాడుతూ అశోక్ కవాడే ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. పియూష్ కవాడే మహారాష్ట్రలోని నాసిక్‌కు చెందినవాడు.