
ప్రముఖ మోడల్ సాన్ రేచల్ (San Rechal) బలవన్మరణానికి పాల్పడింది. పుదుచ్చేరిలో తన నివాసంలో ఆమె నిద్రమాత్రలు మింగి బలవన్మరణానికి ప్రయత్నించగా.. ఆస్పత్రిలో చికిత్స పొందతూ శనివారం కన్నుమూసింది.
పుదుచ్చేరిలో పుట్టిపెరిగిన సాన్ రేచల్.. మోడలింగ్ రంగంలో మిస్ డార్క్ క్వీన్‌గా, మిస్ బెస్ట్ ఆటిట్యూడ్‌గా, మిస్ ఆఫ్రికా గోల్డెన్ ఇండియా లాంటి టైటిల్స్ గెలుచుకున్నారు. మోడలింగ్ మాత్రమే కాదు.. ఆమె మెడిసిన్ విద్యనూ అభ్యసించారు. ఆర్థిక సమస్యలు, మానసిక ఒత్తిడి కారణంగా డిప్రెషన్‌లోకి వెళ్లిన ఆమె.. అధిక డోస్‌లో నిద్ర మాత్రలు తీసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించారు. గమనించిన కుటుంబ సభ్యుల ఆమెను ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతున్న ఆమె.. రెండు కిడ్నీలు చెడిపోవడంతో జూలై 12వ తేదీన కన్నుమూసినట్లు సమాచారం.
రేచల్ తల్లి ఆమె చిన్నతనంలోనే కేన్సర్‌తో కన్నుమూసింది. అప్పటి నుంచి తండ్రి, సోదరుడి ప్రోత్సాహంతో ఆమె పెరిగారు. రంగు గురించి తోటి స్నేహితులు, బంధువులు ఆమెను ఎగతాళి చేసేవారు. అయినా ఆమె కుంగిపోలేదు. ‘‘రంగులో ఏముందిలే.. కరుపు(నలుపు) కూడా అందమే’’ అనే ఆమె మాటలు మోడలింగ్ రంగంలో ఎంతో మందికి ప్రేరణగా నిలిచాయి. అయితే..
సూసైడ్ నోట్‌లో.. తన మరణానికి భర్త(ఇటీవలె వివాహం జరిగింది), కుటుంబ సభ్యులు కారణం కాదని ఆమె ఒక లేఖలో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. కేసును దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఆమె మృతిపై సోషల్ మీడియాలో అభిమానులు తీవ్రంగా స్పందిస్తున్నారు. అవమానాలను, ట్రోలింగ్‌ను తట్టుకుని మోడలింగ్ రంగంలో తనకంటూ ఓ గుర్తింపు దక్కించుకున్న రేచల్.. పాతికేళ్లకే ఇలా తనువు చాలించడం పట్ల పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
ఆత్మహత్య ఏ సమస్యకూ పరిష్కారం కాదు.. అలాంటి తీవ్ర నిర్ణయాలు తీసుకునే ముందు ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి.
ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001
మెయిల్: roshnihelp@gmail.com