ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ తలపెట్టిన ధర్నాను అడ్డుకున్న పోలీసులు
జంతర్‌మంతర్ చుట్టుపక్కల భారీగా భద్రతా దళాల మోహరింపు
విమానంలోనే అభిజీత్ దీప్కే, సౌరవ్ దాస్, అశుతోష్ అరెస్టు
ఎక్కడికక్కడ నిరసనకారుల నిర్బంధం.. వేర్వేరు పోలీసు స్టేషన్లకు తరలింపు
7,000 మందికిపైగా పోలీసుల అదుపులోకి..
మాజీ సీఎంలు మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్, పినరయి విజయన్, మాణిక్ సర్కార్ అరెస్టు
నేహా బోరా, ప్రశాంత్ భూషణ్, ఎం.ఎ.బేబీ, బృందా కారత్, దీపాంకర్ భట్టాచార్య సైతం పోలీసుల అదుపులోనే
జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేసేదాకా మా పోరాటం ఆగదు
సీజేపీ ఉద్యమ సారథి అజింక్య షిండే స్పష్టీకరణ
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో అక్రమాలు జరిగాయని, ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ), విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో శనివారం తలపెట్టిన నిరసన కార్యక్రమాన్ని పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. జంతర్‌మంతర్ వద్ద ధర్నాకు అనుమతి నిరాకరించారు. అటువైపు ఎవరూ వెళ్లకుండా ఉదయం నుంచే భద్రతను పటిష్టం చేశారు.
35,000 మందికి పైగా భద్రతా సిబ్బందిని మోహరించారు. ఎక్కడికక్కడ బారికేడ్లను ఏర్పాటు చేశారు. ప్రజల రాకపోకలపై ఆంక్షలు విధించారు. జంతర్‌మంతర్‌కు వైపు వెళ్లే నాలుగు మార్గాల వద్దే 5 వేల మంది పోలీసులు బందోబస్తు నిర్వహించారు. అటుగా వస్తున్న ప్రతి వ్యక్తినీ అదుపులోకి తీసుకున్నారు. ధర్నాలో పాల్గొనేందుకు వచ్చిన నలుగురు మాజీ ముఖ్యమంత్రులు, సీజేపీ నేతలు సహా 7,000 మందికి పైగా నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు.నగరంతోపాటు పొరుగు రాష్ట్రాల్లోని వేర్వేరు పోలీసు స్టేషన్లకు తరలించారు.
విమానం దిగకుండానే...
సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేతోపాటు ఆ పార్టీ నేతలు సౌరవ్ దాస్, అశుతోష్ రంకా ముంబై నుంచి ఢిల్లీకి ఎయిర్ ఇండియా విమానంలో చేరుకున్నారు. ఎయిర్‌పోర్టులో ల్యాండ్ కాగానే పోలీసులు లోపలికి చొరబడ్డారు. ఈ ముగ్గురూ తమ సీట్లలో నుంచి లేచేలోపే మహిళా పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. వేర్వేరు నిర్బంధ కేంద్రాలకు తరలించారు. తమ నాయకులు ప్రస్తుతం ఎక్కడున్నారో తెలియడం లేదని కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళన వ్యక్తంచేసింది.
ధర్నాకు దిగిన మమతా బెనర్జీ అరెస్టు
న్యూఢిల్లీ జిల్లాలో బీఎన్‌ఎస్‌ఎస్–2023లోని సెక్షన్ 163 కింద నిషేధాజ్ఞలు అమల్లోకి తెచ్చారు. ప్రజలు గుమిగూడకుండా, శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ఈ చర్యలు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో దుకాణాలు, ఇతర వాణిజ్య కార్యకలాపాలపైనా ఆంక్షలు విధించారు. మెట్రో స్టేషన్లను మూసివేశారు. జంతర్‌మంతర్ వైపు ర్యాలీగా బయలుదేరిన ఆలిండియా స్టూడెంట్స్ అసోసియేషన్(ఏఐఎస్‌ఏ) అధ్యక్షురాలు నేహా బోరా, సామాజిక కార్యకర్త యోగేంద్ర యాదవ్, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆందోళనలో పాల్గొనేందుకు వచ్చిన పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత మమతా బెనర్జీని పోలీసులు అడ్డుకోగా, ఆమె తమ పార్టీ నేతలతో కలిసి సౌత్ అవెన్యూ బస్‌స్టాప్ వద్ద ధర్నాకు దిగారు.
ఈ సందర్భంగా వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వినర్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌తోపాటు ఆ పార్టీ నాయకులను సైతం అరెస్టు చేశారు. కేరళం మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్, త్రిపుర మాజీ ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్‌లను సైతం అరెస్టు చేసి ఛత్రసాల్ స్టేడియానికి తరలించారు. సీజేపీ నిరసనకు మద్దతు ప్రకటించడానికి వచ్చిన యూట్యూబర్ ధ్రువ్ రాఠీని గురుగ్రామ్‌లోని ఆయన నివాసంలో అదుపులోకి తీసుకున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. సీపీఎం ప్రధాన కార్యదర్శి ఎం.ఎ.బేబీ, కమ్యూనిస్టు అగ్రనేత బృందా కారత్, సీపీఐ(ఎంఎల్) ప్రధాన కార్యదర్శి ప్రధాన దీపాంకర్ భట్టాచార్యను సైతం పోలీసులు అరెస్టు చేశారు.
కొన్ని ప్రాంతాల్లో లాఠీచార్జి
నిరసనకారులను అడ్డుకునేందుకు పోలీసులు తమ లాఠీలకు పనిచెప్పారు. దాదాపు 57 మెట్రో స్టేషన్‌లను మూసివేసినప్పటికీ.. ఆందోళనకారులు ఆయా స్టేషన్ల వద్దకు భారీ సంఖ్యలో చేరుకున్నారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో నిరసనకారులపై పోలీసులు లాఠీచార్జి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
సుప్రీంకోర్టు వద్ద లాయర్లు, పోలీసుల మధ్య ఘర్షణ
సీజేపీ నిరసనకు మద్దతు తెలిపేందుకు వందలాది మంది లాయర్లు సుప్రీంకోర్టు నుంచి ర్యాలీగా బయలుదేరారు. వీరిని ప్రధాన ద్వారాల పోలీసు బలగాలు అడ్డుకున్నాయి. ఈ క్రమంలో పోలీసులకు, లాయర్లకు మధ్య వాగి్వవాదం చోటుచేసుకుంది. తోపులాట జరిగింది. కొందరు లాయర్లను పోలీసులు కాలర్లు పట్టుకుని ఈడ్చిపారేసిన దృశ్యాలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. పలువురు లాయర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని తక్షణం విడుదల చేయాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ పోలీసులను ఆదేశించారు.
నిర్మానుష్యంగా మారిన సెంట్రల్ ఢిల్లీ
సెంట్రల్ ఢిల్లీ ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్మానుష్యంగా దర్శనమిచ్చింది. కేంద్ర బలగాలు మినహా సాధారణ ప్రజలు ఆ ప్రాంతంలో కనిపించలేదు. నిరసనకారులు జంతర్‌మంతర్ వరకు చేరుకోకుండానే పోలీసులు మధ్యలోనే నిర్బంధించారు. మొత్తానికి సెంట్రల్ ఢిల్లీ ప్రాంతం లాక్‌డౌన్ పరిస్థితిని తలపించింది.
పోలీసులకు గాయాలు
ఆకాశవాణి భవన్ సమీపంలోని ఇంతియాజ్ అలీ మార్గ్ వద్ద నిరసనకారులు బారికేడ్లను పడగొట్టి, భద్రతా సిబ్బందిపై రాళ్లు రువ్వారని అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులు గాయపడ్డారని చెప్పారు. నిరసనకారుల్లో కొందరిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. అలాగే వేర్వేరు ప్రాంతాల్లో నిరసనకారులను అదుపులోకి తీసుకునే క్రమంలో పింక్ ఫోర్స్‌కు చెందిన ఒక మహిళా సభ్యురాలితో సహా ఆరుగురు పోలీసు సిబ్బంది గాయపడ్డారని పేర్కొన్నారు. గాయపడిన పోలీసులను చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రులకు తరలించామని వెల్లడించారు.
మోదీ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు: కేజ్రీవాల్
ఎన్నికల్లో భారీగా అవకతవకలు జరిగాయని అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. దేశవ్యాప్తంగా యువత నిరసనలు చేపట్టాలని పిలుపునిచ్చారు. నరేంద్ర మోదీ ఓట్లను దొంగిలించి ఎన్నికల్లో గెలిచారని, ఇప్పుడు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారని అన్నారు. పోలీసులు ఎక్కడ ఆపితే అక్కడే బైఠాయించాలని, ఆ ప్రదేశాన్ని జంతర్‌మంతర్‌గా మార్చాలని యువతకు సూచించారు. దేశ యువత మేల్కొందని, మోదీ నిరంకుశత్వానికి భయపడరని కేజ్రీవాల్ తేల్చిచెప్పారు. భారతదేశాన్ని రక్షించాలని, ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని బెంగాల్ మాజీ సీఎం మమతా బెనర్జీ అన్నారు. ఇప్పుడున్న పరిస్థితి ఎమర్జెన్సీని దాటిపోయిందని, ఇది సూపర్ ఎమర్జెన్సీగా మారిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. మోదీ ప్రభుత్వం ప్రతిపక్షాలను చూసి భయపడుతోందని, అందుకే తమను నిర్బంధించిందని కేరళ మాజీ సీఎం విజయన్ విమర్శించారు. అనారోగ్యంతో బాధపడుతున్న విజయన్‌కు ఔషధాలు అందజేయకుండా పోలీసులు అడ్డుకున్నారని సీపీఎం ఎంపీ జాన్ బ్రిట్టాస్ మండిపడ్డారు
నేడు జంతర్‌మంతర్‌కు చేరుకుంటాం: అజింక్య షిండే
దేశ రాజధానిలో కేంద్ర ప్రభుత్వం అప్రకటిత ఎమర్జెన్సీ విధించిందని సీజేపీ ఉద్యమ సారథి అజింక్య షిండే ఆరోపించారు. సారధి దీప్కేతోపాటు ముఖ్య నేతలు సౌరబ్ దాస్, అశుతోష్ రంకాను పోలీసులు నిర్బంధిండంతో ఉద్యమ సారథ్యం బాధ్యతను అజింక్య షిండే(35)కు సీజేపీ అప్పగించింది. కొత్త హోదాలో ఆయన శనివారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఆందోళన చేసేందుకు వస్తున్న నాయకులు, సామాన్య ప్రజలను ఎక్కడికక్కడ అడ్డుకున్నారని ధ్వజమెత్తారు.
ప్రభుత్వం ఎన్ని నిర్బంధాలకు పాల్పడినా, పోలీసు బలగాలతో అణచివేయాలని చూసినా తమ పోరాటం ఆగబోదని అజింక్య షిండే తేల్చిచెప్పారు. ‘‘ఇది ఒక్కరోజుతో ముగిసేది కాదు. మాది సుదీర్ఘమైన పోరాటం. ఓట్ల చోరీతో అధికారంలోకి వచ్చినవారు మళ్లీ గెలవలేమన్న భయంతోనే సీఈసీ జ్ఞానేశ్‌ను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. జ్ఞానేశ్ రాజీనామా చేసేవరకూ ఈ పోరాటం కొనసాగుతుంది. పోలీసులు ఎంతమందిని అరెస్టు చేసినా సరే ఆదివారం ఉదయం 10 గంటలకు మళ్లీ జంతర్‌మంతర్ వద్దకు చేరుకుంటాం’’అని ప్రకటించారు. తమను అరెస్టు చేస్తే ఆందోళన ఆగిపోతుందని ప్రభుత్వం భ్రమపడుతోందని అన్నారు.


