సందేహం వస్తే.. బ్లాక్‌ చేయండి | Prevent suspicious deposits | Sakshi
Sakshi News home page

సందేహం వస్తే.. బ్లాక్‌ చేయండి

Oct 2 2025 2:19 AM | Updated on Oct 2 2025 2:19 AM

Prevent suspicious deposits

అనుమానాస్పద డిపాజిట్లకు అడ్డుకట్ట.. ఐడీ కార్డులనూ బ్లాక్‌ లిస్టులో ఉంచాలి

ఇలా చేస్తే ఆర్థిక మోసాలకు చెక్‌ పెట్టొచ్చు.. పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ ప్రతిపాదన

సాక్షి, స్పెషల్‌ డెస్క్‌: ఆన్ లైన్  ఆర్థిక మోసాలు రోజురోజుకూ పెరుగుతూ ఉన్నాయి. వీటికి సంబంధించిన వార్తలు పేపర్లు, టీవీలు, సామాజిక మాధ్యమాల్లో నిత్యం కళ్లముందు ప్రత్యక్షం అవుతూనే ఉన్నాయి. ప్రభుత్వం, పోలీసు శాఖ, బ్యాంకులు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నప్పటికీ సైబర్‌ నేరగాళ్ల ఉచ్చులో ప్రజలు చిక్కుకుంటూనే ఉన్నారు. 

బాధితుల్లో ఉన్నత విద్యనభ్యసించినవారు, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నవారూ ఉండడం గమనార్హం. ఒకటి కాదు, రెండు కాదు.. కోట్ల రూపాయల కష్టార్జితాన్ని పోగొట్టుకుంటున్నారు. ఇలాంటి ఆన్ లైన్  ఆర్థిక మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ పలు సూచనలు చేసింది.

» మోసపూరిత లావాదేవీ గుర్తిస్తే.. ఆధార్, పాన్  కార్డు వంటి గుర్తింపు కార్డులతో అనుసంధానమైన అన్ని బ్యాంక్‌ ఖాతాలను (మ్యూల్‌) స్తంభింపజేయాలని హోం వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ ప్రతిపాదించింది. అలాగే ఐడీ కార్డులను బ్లాక్‌ లిస్టులో ఉంచాలని, దీంతో మోసగాళ్లు మరో ఖాతా తెరవడానికి వీలు కాదని.. ఆగస్ట్‌లో పార్లమెంట్‌కు సమర్పించిన నివేదికలో కమిటీ సూచించింది. 

తద్వారా సైబర్‌ నేరగాళ్లు దోచుకున్న సొమ్మును ఇతర ఖాతాలను మళ్లించే దారులు మూసుకుపోతాయని అభిప్రాయపడింది. అధీకృత వ్యక్తులే డిపాజిట్‌ చేస్తున్నారని నిర్ధారించుకోవడానికి ఆధార్‌ ఆధారిత ఈ–కేవైసీ వంటి డిజిటల్‌ గుర్తింపు తనిఖీలను చేపట్టాలని, తద్వారా నేరస్థులు దోపిడీ చేసే అవకాశాలను పరిమితం చేయవచ్చని కమిటీ తెలిపింది. ఈ ప్రతిపాదనలు కీలక ముందడుగు అని నిపు ణులు చెబుతుంటే... అమలు అంత సులువు కాదని బ్యాంకులు వాదిస్తున్నాయి.

ఆర్థిక నేరాలు మూడింతలు
డిజిటల్‌ అరెస్ట్‌ పేరుతో ఆర్థిక నేరగాళ్లు చేస్తున్న దందా మన దేశంలో కొన్ని నెలలుగా ముప్పుగా పరిణమించింది. ఆన్ లైన్  ఆర్థిక నేరాలు గత ఏడాది మూడింతలు అయ్యాయంటే సమస్య తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. నేషనల్‌ సైబర్‌ క్రైమ్‌ రిపోర్టింగ్‌ పోర్టల్‌ (ఎన్ సీఆర్‌పీ) ప్రకారం 2024లో ఆన్ లైన్  ఆర్థిక నేరాల్లో సామాన్యులు రూ.21,181 కోట్లు పోగొట్టుకున్నారు. 2023తో పోలిస్తే ఈ మొత్తం దాదాపు మూడు రెట్లు ఎక్కువ కావడం గమనార్హం. 

2024లో పోగొట్టుకున్న దాంట్లో సుమారు 12% మాత్రమే.. అంటే రూ.2,530 కోట్లు స్తంభింపజేయడం లేదా రికవరీ జరిగింది. ఆన్ లైన్  ఫైనాన్షియల్‌ ఫ్రాడ్స్‌కు సంబంధించి గత ఏడాది ఎన్ సీఆర్‌పీ ఏకంగా 20 లక్షల పైచిలుకు ఫిర్యా దులు స్వీకరించడం.. మోసాల తీవ్రతకు అద్దం పడుతోంది.

వెంటనే నివేదిస్తే బహుమతి!
నో యువర్‌ కస్టమర్‌ (కేవైసీ) నియమాలు అమలవుతున్న ప్పటికీ మ్యూల్‌ ఖాతాలను సైబర్‌ నేరగాళ్లు తెరుస్తూనే ఉన్నారు. టైపింగ్‌ వేగం, మౌస్‌ కదలికల తీరును విశ్లేషించేందుకు బయోమెట్రిక్‌ వ్యవస్థను బ్యాంకులు అమలు చేయాలని కమిటీ సూచించింది. మోసాన్ని వెంటనే నివేదించే వినియోగదారులకు బహుమతులు ఇచ్చే అవకాశాన్ని పరిశీలించాలని ఆర్‌బీఐకి సూచించింది.

» అసాధారణ కార్యకలాపాలను గుర్తించి, అనుమానిత డిపాజిట్లను తాత్కాలికంగా నిరోధించాలని (బ్లాక్‌) తెలిపింది. మోసగాడి బారిన పడటం వల్ల కలిగే పరిణామాలు, కస్టమర్‌ బాధ్యత అనే అంశాన్ని పునఃపరిశీలించాలని కమిటీ సిఫార్సు చేసింది. 
»  ప్రజలకు కూడా భద్రత విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన బాధ్యత ఉంటుందని.. ఈ విషయంలో వారికి మరింత అవగాహన కల్పించాలని సూచించింది.

నియంత్రణ యంత్రాంగం
బ్యాంకులు, సంస్థలు, వినియోగదారులు, ఇతర భాగస్వామ్య పక్షాలు అనుసరించాల్సిన చట్ట పరమైన విధానాలను నిర్దేశించే ఒకే నియంత్రణ యంత్రాంగం ఏర్పాటు ప్రతిపాదనతో సహా.. జాతీయ భద్రతా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కమిటీ ప్రతిపాదనలను ఎలా అమలు చేయాలన్న అంశంపై మంత్రిత్వ స్థాయిలో వివిధ దశల్లో చర్చలు జరుగుతున్నాయని డేటా సెక్యూ రిటీ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా తెలిపింది. ప్యానెల్‌ సిఫార్సుల అమలును ఇండియన్  సైబర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్ ్స టీమ్, ఇండియన్ సైబర్‌ క్రై మ్‌ కో–ఆర్డి నేషన్  సెంటర్‌ పర్యవేక్షించనున్నాయి. పలు బ్యాంకులు ఈ చర్చల్లో పాల్గొన్నట్టు సమాచారం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement