రెండు నెలల పాటు అమర్నాథ్ యాత్ర.. కాశ్మీర్ డివిజనల్ కమీషనర్ కీలక ప్రకటన  

Preparations Begins For 62 Day Long Amarnath Yatra  - Sakshi

శ్రీనగర్: ఈ ఏడాది జరగబోయే అమర్నాథ్ యాత్రకు సంబంధించి కీలక సమాచారాన్ని వెల్లడించారు కాశ్మీర్ డివిజనల్ కమీషనర్ విజయ్ కుమార్ బిధూరి. జులై 1 నుండి ఆగస్టు 31 వరకు సాగే ఈ యాత్రకు సంబంధించిన ఏర్పాట్లు కూడా ప్రారంభించినట్లు ఆయన తెలిపారు.   

ఏర్పాట్లు షురూ.. 
రెండు నెలలపాటు జరిగే ఈ యాత్ర ఏర్పాట్ల విషయమై శ్రీనగర్లో నిర్వహించిన మీడియా సమావేశంలో కాశ్మీర్ డివిజనల్ కమీషనర్ మాట్లాడుతూ.. ఈ ఏడాది అమర్నాథ్ యాత్ర జులై 1న ప్రారంభమై 62 రోజులపాటు కొనసాగి ఆగస్టు 31న ముగుస్తుంది. దేశవిదేశాల నుండి వచ్చే భక్తులకు ఎక్కడా అసౌకర్యం కలగకుండే యాత్ర ఆద్యంతం వారికి సౌకర్యాలు కల్పించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. దారి పొడవునా సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేస్తున్నాము. 

క్యాంపుల సామర్ధ్యాన్ని పెంచి ఒక్కోచోట సుమారు 75000 మందికి పైగా  భక్తులకు వసతి సౌకర్యాలను కూడా ఏర్పాటు చేయనున్నాము. వ్యర్ధాలను తొలగించడానికి ప్రతి క్యాంపులోనూ అంతర్గతంగా నిర్మించిన వ్యవస్థలను ఏర్పాటు చేశాము. ఈ ఏడాది అమర్నాథ్ యాత్రకు సుమారు 8-9 లక్షల మంది హాజరయ్యే అవకాశముందన్నారు.   

హోంమంత్రి అమిత్ షా పర్యవేక్షణలో..  
రిజర్వేషన్ కౌంటర్లు, తత్కాల్ రిజర్వేషన్లు, సాంకేతిక సదుపాయాలు, వైఫై, విద్యుత్తు, మంచి నీటి సౌకర్యాలు, పారిశుధ్యం, పరిశుభ్రత, వైద్య సదుపాయాలు తదితర ఏర్పాట్లన్నిటినీ జమ్మూ డిప్యూటీ కమీషనర్ అవ్ని లవాస పర్యవేక్షణలో జరుగుతున్నాయని, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎప్పటికప్పుడు ఏర్పాట్లను సమీక్షిస్తున్నారని ఆయన తెలిపారు. 

జీవితంలో ఒక్కసారైనా.. 
ప్రతీ ఏటా వైభవోపేతంగా జరిగే అమర్నాథ్ యాత్రకు దేశవిదేశాల నుంచి లక్షల్లో భక్తులు హాజరవుతూ ఉంటారు. హిమాలయాల నడుమ కోలాహలంగా జరిగే ఈ యాత్రకు జీవితంలో ఒక్కసారైనా వెళ్లి శివనామస్మరణ చేసి తరించాలనుకుంటారు భక్తులు. వచ్చే నెలలో ప్రారంభమయ్యే ఈ యాత్రకు ఈ ఏడాది కూడా అత్యధిక సంఖ్యలో భక్తులు పోటెత్తుతారని అంచనా.   

ఇది కూడా చదవండి: కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై.. సచిన్ పైలట్ కొత్త పార్టీ?     
   

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top