
ఎమ్మెల్యే కొడుకుపై యువతి ఆరోపణలు
మహిళా కమిషన్‌కు ఫిర్యాదు
కర్ణాటక: కాబోయే భార్యను అత్యాచారం, మోసం చేశాడని ఆరోపణలు వచ్చిన బీదర్ జిల్లా ఔరాద్ బీజేపీ ఎమ్మెల్యే ప్రభు చౌహాన్ కుమారుడు ప్రతీక్ చౌహాన్ గొడవ ఆ పార్టీ నేతల మధ్య చిచ్చు పెట్టింది. ప్రతీక్ చౌహాన్‌పై పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో ఆమె శనివారంనాడు బెంగళూరులో మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. 2023 డిసెంబరులో తమకు నిశ్చితార్థం అయ్యింది, అప్పటినుంచి కలిసి మెలిసి తిరిగామని పేర్కొంది.
తామిద్దరం గదిలో ఉన్నట్లు సాక్ష్యాలను విడుదల చేసింది. నిశ్చితార్థానికి ముందే ప్రతీక్ చౌహాన్ తనను బెంగళూరులోని రేస్‌కోర్స్ సమీపంలోని హోటల్‌కు తీసుకొచ్చాడని, అక్కడ ఏకాంతంగా గడిపామని తెలిపింది. మహారాష్ట్రలోని ఓ హోటల్‌కు కూడా తీసుకెళ్లి లైంగికంగా వాడుకున్నాడని వాపోయింది. చివరకు గొడవలు పుట్టించి పెళ్లి చేసుకోనని వంచించారని ఆరోపించింది. వారి నిశ్చితార్థం ఫోటోలు వైరల్ అయ్యాయి.
అంతా కుట్ర: ప్రభుచౌహాన్
ఇదంతా కుట్ర, ఇందులో బీజేపీ మాజీ కేంద్రమంత్రి భగవంత ఖూబా అనుచరుల హస్తం ఉన్నట్టు ప్రభు చౌహాన్ ఆరోపించారు. ఆదివారంనాడు బీదర్‌లో విలేకరుల భేటీ ఏర్పాటు చేసి మాట్లాడారు. తనపై, కుమారునిపై కుట్రతోనే ఇదంతా చేస్తున్నారన్నారు. యువతికి ఖూబా అనుచరుల అండదండలు ఉన్నాయన్నారు. తన కుమారునికి ఎలాంటి పరీక్షలు అయినా చేసుకోవచ్చని, అతడు అలాంటి వ్యక్తి కాదని అన్నారు.