ప్రజాగ్రహం దెబ్బకు  సీఎంను మార్చేశారు  | PM Narendra Modi slams Congress over the recent Karnataka CM change | Sakshi
Sakshi News home page

ప్రజాగ్రహం దెబ్బకు  సీఎంను మార్చేశారు 

Jun 6 2026 4:43 AM | Updated on Jun 6 2026 4:43 AM

PM Narendra Modi slams Congress over the recent Karnataka CM change

గుజరాత్‌లో పలు అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంబోత్సవంలో కాంగ్రెస్‌పై మోదీ విమర్శ 

సూరత్‌: అధికారంలో ఉన్న కొన్ని రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్‌ సమర్థవంతమైన పాలన అందించలేక అవస్థలు పడుతోందని ప్రధాని మోదీ విమర్శించారు. కర్ణాటకలో సీఎం కుర్చీ నుంచి సిద్ధరామయ్యను దింపేసి డీకే శివకుమార్‌కు కాంగ్రెస్‌ పట్టంకట్టిన ఉదంతాన్ని మోదీ ప్రస్తావించారు. గుజరాత్‌లోని సూరత్‌ జిల్లాలో శుక్రవారం రూ.18,000 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంబోత్సవాలు, శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొని మోదీ ప్రసంగించారు.

 ‘‘కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న ప్రతి రాష్ట్రంలోనూ అక్కడి ప్రజలు అసంతృప్తితో రగిలిపోతున్నారు. కాంగ్రెస్‌ అందించే అసమర్థపాలన చలువే ఇదంతా. కర్ణాటకలోనూ ఇదే పునరావృతమైంది. అందుకే ఉన్నపళంగా ప్రస్తుత సీఎంను పక్కకునెట్టి కొత్త నేతను సీఎం కుర్చీపై కాంగ్రెస్‌ కూర్చోబెట్టింది. గత 12 ఏళ్లుగా కాంగ్రెస్‌ దేశవ్యాప్తంగా సందిగ్ధ పరిస్థితులను తనుకు సానుకూలంగా మల్చుకోవాలని ఆశపడింది. కానీ జనం వాళ్లను తిరస్కరించారు. 

ఇటీవల హిమాచల్‌ ప్రదేశ్, హరియాణా, పంజాబ్‌ స్థానిక ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌కు భంగపాటు తప్పలేదు. గుజరాత్‌ ఓటర్లు కాంగ్రెస్‌ను కన్నెత్తి కూడా చూడట్లేరు. కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనూ అసమర్థన పాలనతో పరువుపోగొట్టుకుంటున్నారు. దేశంలో అస్తవ్యస్థ పరిస్థితులు నెలకొనేలా చేసి రాజకీయ, ఎన్నికల లభ్ది పొందాలని కాంగ్రెస్‌ శతథా ప్రయతి్నస్తుంటే మేం భారత దేశం పలురంగాల్లో సామర్థ్యం పెంపు కోసం కృషిచేస్తున్నాం’’అని మోదీ వ్యాఖ్యానించారు.

 ‘‘వ్యతిరేక భావం నుంచి భారత్‌ ఏనాడో పక్కకు జరిగింది. ఇప్పుడంతా అవధుల్లేని ఆశా దృక్పథంతో, అసాధారణ ఆకాంక్షలతో భారత్‌ పురోగమిస్తోంది. ఇంధన రంగంలో భారత్‌ స్వావలంభన దిశగా అడుగులేస్తోంది. ఓవైపు చమురు, సహజవాయువులను వేర్వేరు ఖండాల దేశాల నుంచి కొనుగోలుచేస్తూ మరోవైపు పునరుత్పాదక ఇంధన రంగంలో పెట్టుబడులను పెంచుకుంటున్నాం. 

గత 12 ఏళ్లలో భారత సౌరవిద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యం 250 గిగివాట్లకు పెరిగింది’’అని మోదీ అన్నారు. పర్యటనలో భాగంగా సూరత్‌ జిల్లాలోని హజీరాలో ఉన్న లార్సెన్‌ అండ్‌ టూబ్రో వారి పరిశ్రమలో ‘జొరావర్‌(బలశాలి) 25 టన్నుల యుద్ధట్యాంక్‌ల తయారీని మోదీ పర్యవేక్షించారు. తర్వాత డామన్‌లో రూ.2,970 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ఆరంభించారు. కొత్త ఎయిర్‌పోర్ట్‌ టరి్మనల్‌నూ ప్రారంభించారు. లక్షద్వీప్‌లోనూ రూ.885 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు.   

Advertisement
 
Advertisement
Advertisement