రాష్ట్రాలతోనే దేశాభివృద్ధి 

PM Narendra Modi said that the development of the country is with the states - Sakshi

తమిళనాడులో ప్రధాని మోదీ పునరుద్ఘాటన

తిరుచిరాపల్లి/లక్షద్వీప్‌:  రాష్ట్రాల అభివృద్ధితోనే దేశాభివృద్ధి సాధ్యం అనేది కేంద్ర ప్రభుత్వం విశ్వసించే విధానమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. రాష్ట్రాల అభివృద్ధి దేశాభివృద్దిని ప్రతిబింబిస్తుందని అన్నారు. ఆయన మంగళవారం తమిళనాడులో పర్యటించారు. పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పౌర విమానయానం, ఓడ రేవులు, రైల్వే, హైవేలు, పెట్రోలియం, సహాయ వాయువు, అణు శక్తి, ఉన్నత విద్యకు సంబంధించిన రూ.20,140 కోట్ల విలువైన వివిధ ప్రాజెక్టులను ప్రారంభించారు.

వాటిని జాతికి అంకితం ఇచ్చారు. మరికొన్ని కొత్త ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. తొలుత భారతీదాసన్‌ విశ్వవిద్యాలయం 38వ స్నాతకోత్సవంలో పాల్గొన్నారు. అనంతరం తిరుచిరాపల్లి అంతర్జాతీయ విమానాశ్రయంలో నూతన టెర్మినల్‌ భవనాన్ని ప్రారంభించారు. ఏడాది కాలంలో 40 మందికిపైగా కేంద్ర మంత్రులు తమిళనాడులో 400సార్లు పర్యటించారని చెప్పారు.

తమిళనాడు అభివృద్ధితో ఇండియా అభివృద్ధి సాధిస్తుందన్నారు. దేశ విదేశాలతో బహుళ అనుసంధానం అభివృద్ధికి కీలక మార్గమని అన్నారు. దీనివల్ల కీలక రంగాల్లో పెట్టుబడులు, తద్వారా వ్యాపారం, వాణిజ్యం పెరుగుతాయని, ప్రజల జీవనం సులభతరం అవుతుందన్నారు. దేశాభివృద్ధిని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లడానికి యువతకు ఇది మంచి సమయమని చెప్పారు. ఈ అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకోవాలన్నారు.

లక్షద్వీప్‌లో మోదీ..
రూ1.1,50 కోట్లకుపైగా విలువైన పలు జాతీయ అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించడానికి ప్రధాని మోదీ మంగళవారం లక్షద్వీప్‌కు చేరుకున్నారు. అగత్తీ ఎయిర్‌పోర్టు వద్ద బహిరంగ సభలో ప్రసంగించారు. లక్షద్వీప్‌లో గత పదేళ్లలో ఎన్నో ప్రాజెక్టులను అమల్లోకి తీసుకొచ్చామని చెప్పారు. ఇక్కడి ద్వీపాల అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందన్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top