వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్‌లో ప్రధాని వ్యాఖ్య
న్యూఢిల్లీ: భారతీయ జెన్ జెడ్ యువతరంలో సృజనాత్మకత పుష్కలంగా ఉందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. 2047 ఏడాదికల్లా భారత్‌ను అభివృద్ధిచెందిన దేశంగా వికసిత్ భారత్‌గా అవతరింపజేసుకునేందుకు యువత తమ వంతుగా అందించే వినూత్న, సృజనాత్మక ఆలోచనల వేదికగా వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్(బీవీవైఎల్‌డీ)ను మోదీ ప్రభుత్వం తీర్చిదిద్దింది.
స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని ప్రతి ఏటా జనవరి 12వ తేదీన బీవీవైఎల్‌డీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. సోమవారం ఢిల్లీలో వీబీఐఎల్‌డీ ముగింపు కార్యక్రమంలో మోదీ పాల్గొని ప్రసంగించారు. ‘‘ ఏటా స్వామి వివేకానంద గౌరవార్థం జాతీయ యువజన దినోత్సవం జరుపుకుంటున్నాం. ఆయన స్ఫూర్తితో వీబీవైఎల్‌డీని స్థాపించాం. యువతను దృష్టిలో ఉంచుకుని పలు కేంద్ర ప్రభుత్వ పథకాలను తీసుకొచ్చాం. అంకురసంస్థల విప్లవాన్ని ఆశిస్తున్నాం.
ఇప్పుడు సృజనాత్మక ఆలోచనలు, శక్తి, సదుద్దేశాలతో మన యువశక్తి ఇప్పుడు దేశ నిర్మాణంలో ముందు వరసలో నిలబడింది. సృజనాత్మక ఆలోచనలు, సమా చారం, సంస్కృతిలతో ఆరెంజ్ ఎకానమీ గణనీయమైన వృద్ధిపథంలో పయనిస్తోంది. గత దశాబ్దకాలంగా చేపట్టిన పలు సంస్కరణలతో ఇప్పుడు ఏకంగా సంస్కరణ ఎక్స్‌ప్రెస్ దూసుకుపోతోంది. ఈ సంస్కరణల కేంద్ర బిందువు మన యువతలోనే దాగి ఉంది’’ అని మోదీ అన్నారు. జనవరి 9వ నుంచి 12వ తేదీదాకా బీవీవైఎల్‌డీ కొనసాగింది. దేశవ్యాప్తంగా పలు స్థాయిల్లో 50 లక్షల మందికిపైగా యువత ఈ కార్యక్రమంలో పాల్గొంది.


