
సాక్షి, న్యూఢిల్లీ: దేశాన్ని సెమీకండక్టర్ డిజైన్, తయారీ, సాంకేతిక అభివృద్ధి కేంద్రంగా మార్చే లక్ష్యంతో దేశ రాజధాని ఢిల్లీ మరో అంతర్జాతీయ మహాసదస్సుకు వేదికైంది. ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ఉదయం 10 గంటలకు ఢిల్లీలోని యశో భూమిలో ‘సెమికాన్ ఇండియా–2025’సదస్సును ప్రారంభించనున్నారు. ఈ నెల 2 నుంచి 4 వరకు మూడు రోజులపాటు కొనసాగనుంది.
3వ తేదీ ఉదయం 9.30 గంటలకు ప్రధాని మోదీ వివిధ కంపెనీల సీఈవోల రౌండ్‌టేబుల్ భేటీలో పాల్గొని చర్చలు జరపనున్నారు. సదస్సుకు 20,750 మంది పాల్గొననున్నారు. వీరిలో 48 దేశాల 2,500 ప్రతినిధులున్నారు. 350 ఎగ్జిబిటర్లు తమ ఉత్పత్తులు, సాంకేతికతలను ప్రదర్శించనున్నారు. 2022లో బెంగళూరు, 2023లో గాం«దీనగర్, 2024లో గ్రేటర్ నోయిడాలో ఈ సదస్సులు జరిగాయి.