ఆ పార్టీ దశాబ్దాల పాలనలో దేశం అధోగతి పాలైంది
తక్కువ వృద్ధి రేటును ‘హిందూ వృద్ధి రేటు’గా అభివర్ణిచారు
వాస్తవానికి అది ‘కాంగ్రెస్ వృద్ధిరేటు’
కాంగ్రెస్ పాలన నుంచి దేశానికి విముక్తి కల్పించడం అతిపెద్ద విజయాలలో ఒకటి
ఎన్డీయే పక్షాల సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టీకరణ
న్యూఢిల్లీ: దశాబ్దాల కాంగ్రెస్ పాలనలో దేశం అధోగతి పాలైందని ప్రధాని నరేంద్ర మోదీ మండిపడ్డారు. విధానపరమైన, పాలనాపరమైన వైఫల్యాలతో కాంగ్రెస్ ప్రభుత్వాలు దేశాన్ని నిస్సహాయతలోకి నెట్టేశాయని ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలో భారతదేశం తక్కువ వృద్ధి రేటు నమోదు చేసిన కాలాన్ని ‘హిందూ వృద్ధి రేటు’గా తప్పుగా అభివర్ణిచారని ఆక్షేపించారు. వాస్తవానికి దానిని ‘కాంగ్రెస్ వృద్ధి రేటు’గా అని పిలవాలని అన్నారు.
దేశంలో అభివృద్ధి నెమ్మదిగా జరుగుతుందని, ఇక్కడ వేగవంతమైన ప్రగతి సాధ్యం కాదని ప్రజలు భావించేలా చేశారని మండిపడ్డారు. విధానపరమైన వైఫల్యాల నిందలను హిందువులపై అన్యాయంగా మోపారని, కాంగ్రెస్‌ను కాపాడే ప్రయత్నం చేశారని విమర్శించారు. ఆ పార్టీ రూ.వేల కోట్ల కుంభకోణాలకు పాల్పడిందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ హయాంలో అన్ని వ్యవస్థలూ కుప్పకూలాయని చిప్పులు చెరిగారు. కాంగ్రెస్ వారసత్వ పాలన నుంచి దేశానికి విముక్తి కల్పించడం ఎన్డీయే ప్రభుత్వ అతిపెద్ద విజయాలలో ఒకటి అని తేల్చిచెప్పారు.
కాంగ్రెస్ ఇనుప సంకెళ్ల నుంచి దేశాన్ని రక్షించామని వ్యాఖ్యానించారు. బుధవారం ఢిల్లీలో ఎన్డీయే పక్షాల సదస్సులో ప్రధాని మోదీ ప్రసంగించారు. రాజకీయ స్థిరత్వం, స్పష్టమైన సంకల్పంతో భారీ స్థాయిలో అభివృద్ధిని సాధించవచ్చని ఎన్డీయే ప్రభుత్వం నిరూపించిందని అన్నారు. 2014లో తమ ప్రభుత్వం వచి్చనప్పుడు సామాన్య పౌరుడికి ఒక కొత్త ఆశ చిగురించిందని చెప్పానని గుర్తుచేశారు. కాంగ్రెస్ ద్రోహం తర్వాత దేశ ప్రజలు తమపై సంపూర్ణ విశ్వాసం వ్యక్తంచేశారని తెలిపారు. 12 ఏళ్లలో తమ కూటమి ఆ విశ్వాసాన్ని మరింత బలపరిచిందని వ్యాఖ్యానించారు. మోదీ ఇంకా ఏం మాట్లాడారంటే..
ప్రజలే నాకు దేవుళ్లు
‘‘అవినీతికి తావులేని పాలన అందిస్తున్నాం. ప్రధానమంత్రిగా సుదీర్ఘకాలం ప్రజలకు సేవ చేసే అవకాశం దక్కడం నా అదృష్టంగా భావిస్తున్నా. ఇది నిజంగా నా దృష్టిలో అద్భుతమైన క్షణం. ప్రజలే నాకు దేవుళ్లు. అధికారాన్ని సేవగానే ఎల్లప్పుడూ భావించాం. 140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలను నెరవేర్చేందుకు కృషి చేస్తున్నాం. గతంలో దశాబ్దాలపాటు జరిగే అభివృద్ధి మేము అధికారంలోకి వచ్చాక కేవలం నెలల వ్యవధిలోనే జరుగుతోంది. స్థిరమైన పాలనతో అభివృద్ధి వేగం పుంజుకుంది.
2014కి ముందు దేశంలో అస్థిరత ఉండేది. 2014 తర్వాత దేశ రూపురేఖల్లో అనేక మార్పులు తీసుకొచ్చాం. మా పథకాలు, కార్యక్రమాలను ప్రజలు ఆదరించడం సంతోషంగా ఉంది. వికసిత్ భారత్ లక్ష్య సాధనలో ప్రజలందరూ భాగస్వాములే. మా పాలనలో 25 కోట్ల మంది పేదరికం నుంచి విముక్తి చెందారు. ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య 25 కోట్ల నుంచి 100 కోట్లకు చేరింది. ప్రభుత్వ విధానాలు సరైన దిశలో సాగుతున్నాయనడానికి చెప్పడానికి ఇదొక తార్కాణం. స్థిరమైన ప్రభుత్వం ఉంటేనే అభివృద్ధి సాధ్యమవుతుంది’’ అని అన్నారు.
ఉగ్ర దాడులపై దేశం మౌనంగా ఉండదు
సామాన్యులపై భారం తగ్గించాలన్నదే మా సంకల్పం. పన్ను మినహాయింపులు, పాలనాపరమైన సంస్కరణలతో సహా మధ్యతరగతి వర్గానికి ఉపశమనం కల్పించాం. ఏడాదికి రూ.12 లక్షల వరకు ఆదాయంపై పన్ను మినహాయింపు ఇచ్చాం. నేడు దేశం సరళమైన పన్ను విధానంతో ప్రయోజనం పొందుతోంది. దేశమే ప్రథమం(నేషన్ ఫస్ట్) అనే నినాదంతో పనిచేస్తున్నాం. దేశంలో మావోయిస్టుల సమస్యను అంతం చేశాం. ఈశాన్య రాష్ట్రాల్లో శాంతి భద్రతలు, స్థిరత్వాన్ని నెలకొల్పాం. ఇలాంటి నిర్ణయాలను తీసుకొనే సాహసాన్ని గత ప్రభుత్వాలు చేయలేకపోయాయి. ఉగ్రవాదులకు గట్టిగా బుద్ధి చెప్తున్నాం. సర్జికల్ దాడులు, ఆపరేషన్ సిందూర్ వంటి చర్యలతో మన సంకల్పాన్ని, బలాన్ని ప్రదర్శించాం’’ అని అన్నారు.
విదేశాలపై ఆధార పడొద్దు
నా దృష్టిలో పార్టీ కంటే దేశ ప్రజలే ముఖ్యం. దేశంలో డిజిటల్ చెల్లింపుల విప్లవం వచ్చింది. నేడు ప్రపంచమంతా భారత్ వైపు చూస్తోంది. ‘2047 నాటికి వికసిత్ భారత్’ మన లక్ష్యం. అందుకోసం మరింత వేగంగా, క్రియాశీలకంగా పని చేయాలి. ‘మేడ్ ఇన్ ఇండియా’ సంకల్పం సాకారమవుతుండడం ఆనందంగా ఉంది. మన అవసరాల కోసం విదేశాలపై ఆధారపడడాన్ని తగ్గించుకోవాల్సిందే. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో నౌకలు తయారు చేస్తున్నాం. సెమీకండక్టర్లు, అరుదైన ఖనిజాలు, కృత్రిమ మేధ(ఏఐ), క్వాంటం కంప్యూటింగ్ వంటి రంగాల్లో భారతదేశం స్వావలంబన సాధిస్తోంది.
అదే సమయంలో జాతీయ భద్రత, ఆర్థిక సంస్కరణలపై కూడా నిర్ణయాత్మకంగా వ్యవహరిస్తోంది. మన ఆర్థిక, వ్యూహాత్మక భద్రతతో ముడిపడి ఉన్న అంశాల్లో విదేశాలపై ఆధారపడకూడదు. 2014లో ఉదయించిన ఆశాకిరణం నేడు నూతన ఆత్మవిశ్వాసపు కాంతిరేఖగా మారింది’’ అని ప్రధాని మోదీ స్పష్టంచేశారు. తనను సత్కరించినందుకు ఎన్డీయే మిత్రపక్షాలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ విజయం వ్యక్తిగతంగా తనది మాత్రమే కాదని, మొత్తం కూటమికి, బీజేపీ కార్యకర్తలందరికీ చెందుతుందని వివరించారు. ఇది తన వ్యక్తిగత విజయంగా కాకుండా.. తమ సమిష్టి కృషికి నిదర్శనంగా భావిస్తున్నానని చెప్పారు. ఈ సుదీర్ఘ పదవీకాలాన్ని ఒక గొప్ప గౌరవంగా అభివర్ణిచారు. దేశ సేవ ఎల్లప్పుడూ ఒక ఆధ్యాత్మిక సాధన వంటిదని అన్నారు.


