
పాట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి పాట్నా హైకోర్టు ఝలక్ ఇచ్చింది. ఇటీవల ప్రధాని మోదీ, ఆయన తల్లి హీరాబెన్‌పై కాంగ్రెస్ రూపొందించిన ఏఐ వీడియోపై పాట్నా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వెంటనే ఏఐ వీడియోను తొలగించాలని కాంగ్రెస్‌ను ఆదేశించింది.
వివరాల ప్రకారం.. ప్రధాని మోదీ, ఆయన తల్లి హీరాబెన్‌పై కాంగ్రెస్ రూపొందించిన ఏఐ వీడియో తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ బీహార్ యూనిట్ సోషల్ మీడియాలో ఈ వీడియోను ప్రసారం చేసింది. ఈ నేపథ్యంలో దీనిపై బీజేపీ, ఎన్డీయే మిత్రపక్షాలు తీవ్రంగా ఖండించాయి. దీంతో, బీజేపీ నేతలు పలుచోట్ల కాంగ్రెస్ పార్టీపై ఫిర్యాదులు చేశారు. ఈ క్రమంలోనే దీనిపై విచారణ జరిపిన పాట్నా హైకోర్టు వాటిని వెంటనే తొలగించాలని కాంగ్రెస్‌ను ఆదేశించింది. ఈ సందర్బంగా చీఫ్ జస్టిస్ పీబీ బజంత్రి.. ఈ వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల నుండి తొలగించాలని ఆదేశించారు.
Bihar Congress posted this AI Generated Video about Narendra Modi and his mother.
These people were screaming only a couple of weeks ago that they had nothing to do with abuse hurled at the Prime Minister's mother.
Now they do this.
Shocking behaviour. pic.twitter.com/rTsrZtpRFA— Sensei Kraken Zero (@YearOfTheKraken) September 11, 2025
బీహార్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ వ్యక్తిగత విమర్శలకు దిగడం తీవ్ర కలకలం సృష్టించింది. బీహార్ కాంగ్రెస్ విభాగం నేరుగా సోషల్ మీడియాలో విడుదల చేసిన ఓ ఏఐ వీడియో తీవ్ర దుమారం రేపుతోంది. సాహబ్ కలలో అమ్మ .. ఆ తర్వాత ఏం జరిగిందో చూసేయమంటూ.. ఆ వీడియో ఉంది. అందులో ప్రధాని మోదీని పోలిన క్యారెక్టర్.. ‘‘ఈరోజు ఓట్ల దొంగతనం(Vote Chori) అయిపోయింది.. ఇప్పుడు హాయిగా నిద్రపోవచ్చు అని కళ్లు మూసుకుంటుంది. ఆ వెంటనే హీరాబెన్‌ను పోలి ఉన్న పాత్ర కలలో ప్రత్యక్షమై.. "ఓట్ల కోసం నా పేరును ఉపయోగించడంలో ఎంత దూరం వెళ్తావు? రాజకీయాల్లో నీతిని మరచిపోయావా? అని అంటుంది. ఈ మాటలతో నిద్రపోతున్న వ్యక్తి ఆశ్చర్యంతో మెలకువకు వస్తాడు.
ఈ వీడియోపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్‌ను డిమాండ్ చేస్తోంది. బీజేపీ ఎంపీ రాధా మోహన్ దాస్ అగర్వాల్ కాంగ్రెస్ విడుదల చేసిన AI వీడియోపై తీవ్రంగా స్పందించారు.. ఈ వీడియో రాజకీయాల్లో దిగజారిన స్థాయికి నిదర్శనమని అన్నారాయన. రాహుల్ గాంధీ సూచన మేరకే బీహార్ కాంగ్రెస్ యూనిట్ ఈ వీడియోను రూపొందించిందని ఆరోపించారాయన. ప్రధాని మోదీ ఎప్పుడూ కుటుంబాన్ని రాజకీయాలకు దూరంగా ఉంచారని, కానీ ఇప్పుడు ఆయన తల్లి హీరాబెన్‌ను రాజకీయాల్లోకి లాగి మరీ కాంగ్రెస్ దాడి చేయడం బాధాకరం అని పేర్కొన్నారు. టెక్నాలజీని ఉపయోగించి దేశాన్ని తప్పుదోవ పట్టించడమే కాకుండా.. మోదీ సహా దేశంలోని ప్రజలందరి తల్లుల గౌరవాన్ని అవమానించడమే ఈ వీడియో ఉద్దేశమని విమర్శించారు. ఈ వ్యవహారాన్ని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. అయితే.. క్షమాపణలకు కాంగ్రెస్ నిరాకరిస్తోంది. ఇదేం వ్యక్తిగత దూషణ కాదని.. రాజకీయ విమర్శ మాత్రమే అని చెబుతోంది. వీడియోలో వ్యక్తీకరించిన సందేశం ప్రధానిగా మోదీ తన తల్లి పేరును రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నారనే విమర్శ మాత్రమే అని అంటోంది.