మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు లోక్‌సభ ఆమోదం.. వ్యతిరేకంగా 2 ఓట్లు

Parliament Special Sessions Live Updates On Day 3 - Sakshi

Updates..

మహిళా రిజర్వేషన్ బిల్లు లోక్‌సభలో పాస్‌ అయ్యింది

► మహిళా రిజర్వేషన్‌ బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందింది. దీంతో.. ఇది ఇక రాజ్యసభ ముందుకు వెళ్లనుంది. అయితే.. ఇది పెద్దల సభలోనూ ఆమోదం పొందినా.. రిజర్వేషన్‌ కోటా అమలు అయ్యేది మాత్రం 2029 ఎన్నికల సమయంలోనేనని కేంద్రం స్పష్టం చేసింది. అంతకు ముందు జనాభా లెక్కలు, డీ లిమిటేషన్‌ ప్రక్రియ జరగాల్సి ఉంటుంది.

► మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు..ఓటింగ్‌ ప్రక్రియ ద్వారా ఆమోదం లభించింది. బిల్లుకు మెజార్టీ సభ్యులు ఆ​మోదం తెలిపారు. ఓటింగ్‌ సమయంలో 456 మంది సభ్యులు సభలో ఉన్నారు. అనుకూలంగా 454 ఓట్లు రాగా.. వ్యతిరేకంగా 2 ఓట్లు వచ్చాయని లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా ప్రకటించారు.

►  మహిళా రిజర్వేషన్ బిల్లుపై లోక్‌సభలో కొనసాగుతున్న ఓటింగ్‌ ప్రక్రియ

► ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ విధానంలో సాంకేతిక సమస్య. స్లిప్పుల ద్వారా కొనసాగుతున్న ఓటింగ్‌.  ఎరుపు, ఆకుపచ్చ స్లిప్పుల ద్వారా ఓటింగ్‌ ప్రక్రియ కొనసాగుతోంది. 
► మహిళా రిజర్వేషన్ బిల్లుపై లోక్‌సభలో ఓటింగ్ ప్రారంభమైంది. బిల్లుపై 60 మంది ఎంపీలు మాట్లాడారు. ఎనిమిది గంటలపాటు సుధీర్ఘంగా చర్చ సాగింది. 

► 2024 ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు వర్తించదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. ఎన్నికల తర్వాత జనాభా లెక్కలు, డీలిమిటేషన్ చేపడతామని పేర్కొన్నారు. కావాలంటే బిల్లులో కొన్ని మార్పులు కూడా చేపడతామని పేర్కొన్నారు. అమిత్ షా మాట్లాడుతుండగానే సభ నుంచి రాహుల్ గాంధీ బయటకు వెళ్లిపోయారు. 

►కొత్త పార్లమెంటులో లోక్‌సభ  స్పీకర్ స్థానంలో కూర్చున్న తొలి తెలుగు ఎంపీగా మిథున్ రెడ్డి రికార్డు.
►లోక్ సభలో సభాపతి స్థానంలో  రెండు గంటల పాటు సభా కార్యక్రమాలను నిర్వహించిన ప్యానెల్ స్పీకర్  మిథున్ రెడ్డి 
►చారిత్రాత్మక మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చను నిర్వహించిన మిథున్ రెడ్డి

మహిళా రిజర్వేషన్ బిల్లుపై లోక్ సభలో చర్చ 

►వైఎస్సార్‌సీపీ తరపున ఎంపీ సత్యవతి చర్చలో పాల్గొన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లులో ఓబీసీల కోటా పెట్టాలని సీఎం జగన్ కోరారని ఎంపీ సత్యవతి తెలిపారు. మహిళ రిజర్వేషన్లను కేవలం 15 ఏళ్ల వరకే అని పరిమితం చేయవద్దని, రిజర్వేషన్లను  సమయానుకూలంగా  సమీక్షించేలా, పొడిగించేలా బిల్లులో రాయాలని సూచించారు. మహిళలకు నిజమైన ప్రాతినిధ్యం ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

►రిజర్వేషన్లను రాజ్యసభ, శాసన మండలిలో కూడా అమలు చేయాలని ఎంపీ సత్యవతి తెలిపారు. సీఎం జగన్‌ ప్రభుత్వ నామినేటెడ్ పదవులు, స్థానిక సంస్థలలో  50% కోటాను అమలు చేస్తున్నారని ప్రస్తావించారు. దేశం మొత్తం దీన్ని ఆదర్శంగా తీసుకోవాలని.. మహిళల రక్షణ కోసం ఏపీ ప్రభుత్వం దిశా చట్టాన్ని తీసుకొచ్చిందని పేర్కొన్నారు.

లోక్‌సభలో వైఎస్సార్‌సీపీ ఎంపి వంగా గీత మాట్లాడుతూ.. ‘మహిళలను గౌరవించడంలో ఏపీ ముందుంది. నామినేటెడ్‌ పదవుల్లో మహిలలకు 50 శాతం మించి పదవులు. మహిళల పేరుతో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఇళ్ల పట్టాలు ఇస్తోంది.  వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం మహిళలను లక్షాధికారులను చేసింది. మహిళలు తప్పనిసరిగా చట్టసభల్లో ఉండాలి’ అని స్పష్టం చేశారు.

►డీఎంకే ఎంపీ కనిమొళి మాట్లాడుతూ.. మహిళా బిల్లును బీజేపీ రాజకీయంగా వాడుకుంటోంది. దేశంలోనే తొలిసారిగా 1921లో తమిళనాడు మహిళ ప్రజాప్రతినిధిగా ఎన్నుకున్నాం. వందేళ్ల తర్వాత ఇప్పటికీ మహిళలకు రిజర్వేషన్లు అమలు కాలేదు. యూపీఏ ప్రభుత్వ హయాంలో రాజ్యసభలో మహిళా బిల్లును ఆమోదించారు. 

► మహిళా బిల్లుపై లోక్‌సభలో వాడీవేడి చర్చ జరుగుతోంది. 

► సోనియా గాంధీ వ్యాఖ్యలను కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ఖండించారు. కాంగ్రెస్‌ నిర్ణయాలను తప్పుబడుతూ బీజేపీ ఎంపీలు నినాదాలు చేశారు. 

► లోక్‌సభలో సోనియా గాంధీ మాట్లాడుతూ.. మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు మేం మద్దతు ఇస్తాం. వంటింటి నుంచి ప్రపంచ వేదికల వరకు భారత మహిళల పాత్ర ఎంతో ఉంది. మహిళలు వారి స్వార్థం గురించి ఏనాడు ఆలోచించరు. స్త్రీల త్యాగాలు ఎనలేనివి.

► ఆధునిక భారత నిర్మాణంలో పురుషులతో కలిసి స్త్రీలు పోరాడారు. సరోజినీ నాయుడు, సుచేత కృపాలనీ, ఆరుణాసఫ్‌ అలీ, విజయలక్ష్మీ పండిట్‌ వంటి వారెందరో దేశం కోసం పోరాడారు. 

►ఈ బిల్లు కోసం దశాబ్దాలుగా పోరాడుతున్నాం. మహిళా రిజర్వేషన్‌ బిల్లు రాజీవ్‌ గాంధీ కల. స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళా ప్రాతినిధ్యాన్ని నిర్ణయించేందుకు తొలిసారిగా రాజ్యాంగ సవరణ చేస్తూ రాజీవ్ గాంధీ బిల్లును తీసుకొచ్చారు.

►పీఎం పీవీ నరసింహారావు నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యసభలో ఆమోదించింది. ఫలితంగా స్థానిక సంస్థల ద్వారా దేశవ్యాప్తంగా 15 లక్షల మంది మహిళా నేతలు ఎన్నికయ్యారు. దీంతో, రాజీవ్ గాంధీ కల పాక్షికంగా మాత్రమే పూర్తయింది. ఈ బిల్లు ఆమోదంతో అది పూర్తవుతుంది.

► గతంలో బీజేపీ సభ్యులు మహిళా బిల్లును అడ్డుకున్నారు. ఈ బిల్లును కాంగ్రెస్‌ పార్టీ సమర్థిస్తుంది. కానీ, మాకు ఒక భయం ఉంది. ఇప్పటి వరకు 13 ఏళ్లుగా మహిళలు బిల్లు అమలు కోసం వేచిచూస్తున్నారు. ఇంకెన్నాళ్లు మహిళలు వేచిచూడాలి. వెంటనే కులగణన చేసి మహిళలకు రిజర్వేషన్లు అమలు చేయాలి’ అని డిమాండ్‌ చేశారు.  

► లోక్‌సభలో అర్జున్‌ మేఘ్వాల్‌ మాట్లాడుతూ.. చట్టసభల్లో మహిళల భాగస్వామ్యం పెరుగుతుంది. పార్లమెంట్‌తో పాటు అసెంబ్లీలోనూ మహిళలకు రిజర్వేషన్లు లభిస్తాయి. ఈ చట్టంతో మహిళల సాధికారత సాధ్యమవుతుంది. మహిళా రిజర్వేషన్ల కోసం వాజ్‌పేయి చాలా కృషి చేశారు. మన్మోహన్‌ సింగ్‌ హయాంలో బిల్లు తెస్తే రాజ్యసభలో బీజేపీ మద్దతు ఇచ్చింది. ఏకాభిప్రాయంతో బిల్లును ఆమోదించాలి. 

► మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై లోక్‌సభలో చర్చ జరుగుతోంది. 

► మూడో రోజు పార్లమెంట్‌ స్పెషల్‌ సమావేశాలు ప్రారంభమయ్యాయి. 

► మహిళా రిజర్వేషన్‌ బిల్లు రాజీవ్‌ గాంధీ కల.. సోనియా గాంధీ.

► పార్లమెంట్‌ సమావేశాల హాజరుకు ముందు ఇండియా కూటమి సభ్యులు సమావేమయ్యారు. 

►మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై మంత్రి అర్జున్‌రామ్‌ మేఘ్వాల్‌ మాట్లాడుతూ.. బిల్లుపై సభలో ఉదయం 11 గంటలకు చర్చ ప్రారంభమవుతుంది. సాయంత్రం ఆరు గంటల వరకు చర్చ జరుగుతుంది. ఈ బిల్లు విషయంలో రాజకీయాలు చేయదలచుకోలేదు. 

నేడు మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై చర్చ
►కాసేపట్లో పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు మూడో రోజు ప్రారంభం కానున్నాయి. ఈరోజు సమావేశాల్లో భాగంగా సభలో మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై చర్చ జరుగుతుంది. కాగా, మహిళా బిల్లుపై చర్చకు ఆరు గంటల సమయం కేటాయించారు. 

►ఇక, మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై చర్చను కాంగ్రెస్‌ తరఫున సోనియా గాంధీ ప్రారంభించనున్నారు. 

►మరోవైపు.. మహిళా రిజర్వేషన్‌ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించాలని ప్రధాని మోదీ కోరుతుండటం విశేషం. 

► మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతూ..2010లో మేము బిల్లును రాజ్యసభలో ఆమోదించాము. కానీ లోక్‌సభ ఆమోదించడంలో విఫలమైంది. అందుకే, ఇది కొత్త బిల్లు కాదు. ఆ బిల్లును ముందుకు తీసుకెళ్ళి ఉంటే ఈ రోజుకి త్వరగా పూర్తయ్యేది. బీజేపీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రచారం చేస్తున్నారని నేను భావిస్తున్నాను.  కానీ, నిజానికి డీలిమిటేషన్ లేదా జనాభా లెక్కలు జరిగితే తప్ప బిల్లు సాధ్యం కాదు. ఈ బిల్లుకు మేము పూర్తిగా సహకరిస్తాం. ఈ బిల్లులో లొసుగులు మరియు లోపాలను సరిదిద్దాలి.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top