అబద్ధాల బురదలో పాక్‌  | Pakistan launches disinformation campaign targeting Sikh soldiers | Sakshi
Sakshi News home page

అబద్ధాల బురదలో పాక్‌ 

May 6 2025 4:52 AM | Updated on May 6 2025 4:52 AM

Pakistan launches disinformation campaign targeting Sikh soldiers

భారత వ్యతిరేక తప్పుడు ప్రచారాన్ని పెంచిన పాకిస్తాన్‌ 

ఇండియన్‌ ఆర్మీలో సిక్కులు తిరుగుబాటు తెస్తున్నారని ప్రేలాపన 

అవాస్తవాల ప్రచారం కోసం ఏఐతో నకిలీ వీడియోల సృష్టి 

ఖలిస్తానీ సానుభూతిపరుల ద్వారా విస్తృత ప్రచారం 

న్యూఢిల్లీ: భారత ఆర్మీని నేరుగా ఎదుర్కొనే సత్తాలేని పాకిస్తాన్‌ దొడ్డిదారిన పాక్షికంగానైనా తన లక్ష్యాన్ని నెరవేర్చుకోవాలని కుట్ర పన్నింది. అందులోభాగంగా తప్పుడు వార్తలను ఆన్‌లైన్‌లో కుమ్మరిస్తోంది. భారత ఆర్మీలో సిక్కు సైనికులు, ఉన్నతాధికారులు, సైన్యాధికారులు పాకిస్తాన్‌తో పోరుకు విముఖత చూపుతున్నారని, వాళ్లంతా ఐక్యమై తిరుగుబాటు లేవదీస్తున్నారని ఇష్టమొచ్చిన తప్పుడు కథనాలు వండివార్చి సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా షేర్‌చేస్తోంది. భారత సైన్యంలో మత విద్వేషాలు రెచ్చగొట్టి ఆర్మీలో ఐక్యత దెబ్బతీయడమే లక్ష్యంగా పాకిస్తాన్‌ సోషల్‌మీడియా వేదికగా అహరి్నశలు పనిచేస్తోంది. ముఖ్యంగా సిక్కు సైనికులపై గురి పెట్టింది.  

అన్ని రకాలుగా ప్రయత్నాలు 
పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఈ అవాస్తవ కథనాల అల్లిక ఎక్కువైంది. పాకిస్తానీ సైనికులకు చెందిన సామాజిక మాధ్యమ ఖాతాల నుంచి విపరీతంగా ఈ అబద్ధాల ఒరవడి ఊపందుకుంది. సంబంధంలేని, పాత, కృత్రిమమేధ సృష్టించిన విరుద్ద నివేదికలతో అవాస్తవాలను అద్భుతంగా రచించి సోషల్‌మీడియాలో షేర్‌ చేస్తున్నారు. 

సరిహద్దు వెంట కీలకమైన స్థావరాల వద్ద సిక్కు సైనికులు, సిక్కు అధికారుల వ్యవహార శైలిపై ఓ కంట కనిపెట్టాలని ఇతర మతాలకు చెందిన అధికారులకు భారత ఆర్మీ రహస్య సూచనలు చేసిందని, లీక్‌ అయిన ఒక నిఘా నివేదికతో ఈ విషయాలు బహిర్గత అయ్యాయంటూ ఒక పేద్ద అసత్య కథనం ఇప్పుడు సోషల్‌మీడియాల్‌ షేర్‌ అవుతోంది. 

దీంతో ఆర్మీ పట్ల సిక్కు సైనికుల్లో విధేయత తగ్గి, సైన్యంలో ఐక్యత లోపిస్తుందని పాకిస్తాన్‌ భావిస్తోంది. ‘‘భారత ఆర్మీలో ప్రస్తుతమున్న కఠోర వాస్త వం ఇది. సొంత సైనికులనే నమ్మని భారత ఆర్మీ.. పొరుగున పాక్‌తో ఏపాటి యుద్ధం చేయగలదు?’’అని ఒక పాకిస్తాన్‌ సైన్యాధికారి వ్యాఖ్యానించినట్లు మరో తప్పుడు పోస్ట్‌ ఇప్పుడు అధికంగా షేర్‌ అవుతోంది. ‘ఇండియా ఆజ్‌ తక్‌’వార్తాసంస్థ ప్రచురించినట్లుగా ఒక తప్పుడు, నకిలీ కథనాన్నీ పాకిస్తానీయులు ఆన్‌లైన్‌లో షేర్‌ చేస్తున్నారు.  

ధమాకా ఏఐ పేరిట నకిలీ ఏఐ వీడియోలు 
కృత్రిమమేధతో సృష్టించిన భారతవ్యతిరేక తప్పుడు వీడియోలు  ఃధమాకాఏఐ ఖాతా నుంచి షేర్‌ అవుతున్నాయి. పాకిస్తాన్‌పై యుద్ధం చేయబోమని, ముందుగా ఖలిస్తాన్‌ విషయం తేల్చాలని, ఇందుకోసం రెఫరెండం నిర్వహించాల్సిందేనని సిక్కు సైనికులు పట్టుబడుతున్నారని ఒక తప్పుడు ఏఐ వీడియోను సృష్టించారు. ‘‘సైన్యంలో వెలుగుచూసిన తిరుగుబాటుతో మోదీ షాక్‌కు గురయ్యారు. సిక్కు శక్తులన్నీ ఏకమయ్యాయి. యుద్ధం చేయబోమని తేల్చిచెప్పాయి’’అని మరో అవాస్తవ వార్త ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమైంది. 

సిక్కు సంబంధ అసత్య వార్తలు, వీడియోలను ఖలిస్తానీ సానుభూతిపరుల ఖాతాల ద్వారా షేర్‌ చేయిస్తోంది. ఏప్రిల్‌ 25న సరిహద్దు వెంబడి భారత ఆర్మీలోని వేర్వేరు యూనిట్ల సైనికుల మధ్య ఘర్షణ జరిగిందని, ఆ ఘర్షణలో ఐదుగురు సైనికులు చనిపోయారని ఒక తప్పుడు వార్త సారాంశం. ఈ ఘటనలో ఒక అత్యున్నత స్థాయి సిక్కు సైన్యాధికారిని మాత్రమే అరెస్ట్‌చేశారని మరో పోస్ట్‌ ఆన్‌లైన్‌లో కనిపిస్తోంది. 

యుద్ధం చేయాల్సివస్తే మీరు మాత్రం రణక్షేత్రంలోకి కాలుపెట్టొద్దని సిక్కులకు ఖలిస్తానీ వేర్పాటువాది, సిఖ్స్‌ ఫర్‌ జస్టిస్‌ చీఫ్‌ గురుపత్వంత్‌ సింగ్‌ పన్నూ పిలుపు ఇచ్చినట్లు మరో నకిలీ వీడియో షేర్‌ అవుతోంది. భారత వైమానిక స్థావరాల గుట్టుమట్లు చెప్పిన వాళ్లకు 1.1 కోట్ల డాలర్ల నజరానా ఇస్తానని గురుపత్వంత్‌ చెప్పినట్లు ఆ ఏఐ సృష్టించిన వీడియోలో ఉంది. ఇలాంటి వీడియోలు, కథనాలను షేర్‌చేస్తున్న చాలా సోషల్‌మీడియా ఖాతాలను భారత్‌ ఇప్పటికే నిషేధించి బ్లాక్‌చేసింది. అయితే విదేశాల్లో భారత్‌ పట్ల వ్యతిరేక భావనను పెంచే ఉద్దేశ్యంతో పలు తప్పుడు వెబ్‌సైట్ల ద్వారా ఈ కపట కథనాలపరంపర కొనసాగుతోంది.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement