breaking news
Sikh soldier
-
అబద్ధాల బురదలో పాక్
న్యూఢిల్లీ: భారత ఆర్మీని నేరుగా ఎదుర్కొనే సత్తాలేని పాకిస్తాన్ దొడ్డిదారిన పాక్షికంగానైనా తన లక్ష్యాన్ని నెరవేర్చుకోవాలని కుట్ర పన్నింది. అందులోభాగంగా తప్పుడు వార్తలను ఆన్లైన్లో కుమ్మరిస్తోంది. భారత ఆర్మీలో సిక్కు సైనికులు, ఉన్నతాధికారులు, సైన్యాధికారులు పాకిస్తాన్‌తో పోరుకు విముఖత చూపుతున్నారని, వాళ్లంతా ఐక్యమై తిరుగుబాటు లేవదీస్తున్నారని ఇష్టమొచ్చిన తప్పుడు కథనాలు వండివార్చి సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా షేర్చేస్తోంది. భారత సైన్యంలో మత విద్వేషాలు రెచ్చగొట్టి ఆర్మీలో ఐక్యత దెబ్బతీయడమే లక్ష్యంగా పాకిస్తాన్ సోషల్‌మీడియా వేదికగా అహరి్నశలు పనిచేస్తోంది. ముఖ్యంగా సిక్కు సైనికులపై గురి పెట్టింది. అన్ని రకాలుగా ప్రయత్నాలు పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఈ అవాస్తవ కథనాల అల్లిక ఎక్కువైంది. పాకిస్తానీ సైనికులకు చెందిన సామాజిక మాధ్యమ ఖాతాల నుంచి విపరీతంగా ఈ అబద్ధాల ఒరవడి ఊపందుకుంది. సంబంధంలేని, పాత, కృత్రిమమేధ సృష్టించిన విరుద్ద నివేదికలతో అవాస్తవాలను అద్భుతంగా రచించి సోషల్‌మీడియాలో షేర్ చేస్తున్నారు. సరిహద్దు వెంట కీలకమైన స్థావరాల వద్ద సిక్కు సైనికులు, సిక్కు అధికారుల వ్యవహార శైలిపై ఓ కంట కనిపెట్టాలని ఇతర మతాలకు చెందిన అధికారులకు భారత ఆర్మీ రహస్య సూచనలు చేసిందని, లీక్ అయిన ఒక నిఘా నివేదికతో ఈ విషయాలు బహిర్గత అయ్యాయంటూ ఒక పేద్ద అసత్య కథనం ఇప్పుడు సోషల్‌మీడియాల్ షేర్ అవుతోంది. దీంతో ఆర్మీ పట్ల సిక్కు సైనికుల్లో విధేయత తగ్గి, సైన్యంలో ఐక్యత లోపిస్తుందని పాకిస్తాన్ భావిస్తోంది. ‘‘భారత ఆర్మీలో ప్రస్తుతమున్న కఠోర వాస్త వం ఇది. సొంత సైనికులనే నమ్మని భారత ఆర్మీ.. పొరుగున పాక్‌తో ఏపాటి యుద్ధం చేయగలదు?’’అని ఒక పాకిస్తాన్ సైన్యాధికారి వ్యాఖ్యానించినట్లు మరో తప్పుడు పోస్ట్ ఇప్పుడు అధికంగా షేర్ అవుతోంది. ‘ఇండియా ఆజ్ తక్’వార్తాసంస్థ ప్రచురించినట్లుగా ఒక తప్పుడు, నకిలీ కథనాన్నీ పాకిస్తానీయులు ఆన్లైన్లో షేర్ చేస్తున్నారు. ధమాకా ఏఐ పేరిట నకిలీ ఏఐ వీడియోలు కృత్రిమమేధతో సృష్టించిన భారతవ్యతిరేక తప్పుడు వీడియోలు ఃధమాకాఏఐ ఖాతా నుంచి షేర్ అవుతున్నాయి. పాకిస్తాన్‌పై యుద్ధం చేయబోమని, ముందుగా ఖలిస్తాన్ విషయం తేల్చాలని, ఇందుకోసం రెఫరెండం నిర్వహించాల్సిందేనని సిక్కు సైనికులు పట్టుబడుతున్నారని ఒక తప్పుడు ఏఐ వీడియోను సృష్టించారు. ‘‘సైన్యంలో వెలుగుచూసిన తిరుగుబాటుతో మోదీ షాక్‌కు గురయ్యారు. సిక్కు శక్తులన్నీ ఏకమయ్యాయి. యుద్ధం చేయబోమని తేల్చిచెప్పాయి’’అని మరో అవాస్తవ వార్త ఆన్లైన్లో ప్రత్యక్షమైంది. సిక్కు సంబంధ అసత్య వార్తలు, వీడియోలను ఖలిస్తానీ సానుభూతిపరుల ఖాతాల ద్వారా షేర్ చేయిస్తోంది. ఏప్రిల్ 25న సరిహద్దు వెంబడి భారత ఆర్మీలోని వేర్వేరు యూనిట్ల సైనికుల మధ్య ఘర్షణ జరిగిందని, ఆ ఘర్షణలో ఐదుగురు సైనికులు చనిపోయారని ఒక తప్పుడు వార్త సారాంశం. ఈ ఘటనలో ఒక అత్యున్నత స్థాయి సిక్కు సైన్యాధికారిని మాత్రమే అరెస్ట్‌చేశారని మరో పోస్ట్ ఆన్లైన్లో కనిపిస్తోంది. యుద్ధం చేయాల్సివస్తే మీరు మాత్రం రణక్షేత్రంలోకి కాలుపెట్టొద్దని సిక్కులకు ఖలిస్తానీ వేర్పాటువాది, సిఖ్స్ ఫర్ జస్టిస్ చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్నూ పిలుపు ఇచ్చినట్లు మరో నకిలీ వీడియో షేర్ అవుతోంది. భారత వైమానిక స్థావరాల గుట్టుమట్లు చెప్పిన వాళ్లకు 1.1 కోట్ల డాలర్ల నజరానా ఇస్తానని గురుపత్వంత్ చెప్పినట్లు ఆ ఏఐ సృష్టించిన వీడియోలో ఉంది. ఇలాంటి వీడియోలు, కథనాలను షేర్‌చేస్తున్న చాలా సోషల్‌మీడియా ఖాతాలను భారత్ ఇప్పటికే నిషేధించి బ్లాక్‌చేసింది. అయితే విదేశాల్లో భారత్ పట్ల వ్యతిరేక భావనను పెంచే ఉద్దేశ్యంతో పలు తప్పుడు వెబ్సైట్ల ద్వారా ఈ కపట కథనాలపరంపర కొనసాగుతోంది. -
అరుదైన గౌరవం.. అంతలోనే అపఖ్యాతి
లండన్ : పేరు ప్రఖ్యాతులు సాధించడం ఎంత కష్టమో వాటిని నిలుపుకోవడం కూడా అంతే కష్టం. ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారు చరణ్‌ప్రీత్ సింగ్ లాల్(22). బ్రిటన్ చరిత్రలోనే తొలిసారి తలపాగా ధరించి మిలటరీ పరేడ్‌లో పాల్గొన్న సైనికుడిగా రికార్డు సృష్టించిన చరణ్‌ప్రీత్ సింగ్ ఎంతో కాలం గడవకముందే ఆ పేరును పొగొట్టుకోవడమే కాకా ఉద్యోగాన్ని కూడా కోల్పోయే పరిస్థితులు కొని తెచ్చుకున్నాడు. వివరాలు.. చరణ్‌ప్రీత్ సింగ్ బ్రిటన్ ఆర్మీలో పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం రాణి ఎలిజబేత్ పుట్టినరోజు సందర్భంగా నిర్వహించిన పరేడ్‌లో తలపాగా ధరించి పాల్గొన్న ఏకైక సైనికుడిగా వార్తల్లో నిలిచాడు. ఇంత పేరు సాధించిన చరణ్‌ప్రీత్ సింగ్ గత వారం నిర్వహించిన డ్రగ్స్ టెస్ట్‌లో ఫెయిల్ అయ్యాడు. చరణ్‌ప్రీత్ సింగ్ ఎక్కువ మోతాదులో కొకైన్ తీసుకున్నట్లు ఈ టెస్ట్‌లో తేలీంది. దాంతో త్వరలోనే అతను తన ఉద్యోగాన్ని కోల్పోయే ప్రమాదం ఉన్నట్లు సమాచారం. ఈ విషయం గురించి ఆర్మీ అధికారి ఒకరు ‘చరణ్‌ప్రీత్ సింగ్ గురించి ఎంత గొప్పగా ఊహించుకున్నామో.. ఇప్పుడు అతను చేసిన పని అంత ఇబ్బందికరంగా మారింది. సైనికులందరికి అప్పుడప్పుడు ఇలా డ్రగ్స్ టెస్ట్ నిర్వహిస్తుంటాం. ఈ సారి చరణ్‌ప్రీత్ సింగ్‌తో పాటు మరో ఇద్దరు సైనికులు కూడా మత్తు పదర్ధాలు తీసుకున్నట్లు తెలిసింద’ని తెలిపారు. పంజాబ్‌లో జన్మించిన చరణ్‌ప్రీత్ సింగ్ తన చిన్నతనంలోనే తల్లిదండ్రులతో కలిసి లండన్‌కి వలస వెళ్లాడు. చదువు పూర్తయిన తరువాత 2016, జనవరిలో సైనికుడిగా బ్రిటీష్ ఆర్మీలో చేరాడు. -
’సిక్కు సోల్జర్’ రెడీ.. ఫస్ట్‌లుక్ చూశారా!
మరోసారి తన అభిమానుల్ని మెస్మెరైజ్ చేసేందుకు బాలీవుడ్ నటుడు రణ్‌దీప్ హుడా సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే ’సరబ్జిత్’ సినిమా లుక్‌తో అభిమానులను విస్మయపరిచిన రణ్‌దీప్ తాజాగా మరో చారిత్రక పాత్రలో ఒదిగిపోయేందుకు సిద్ధమవుతున్నాడు. రాజ్‌కుమార్ సంతోషి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించబోతున్న పిరియాడిక్ డ్రామా ’సారాగర్హి’ సినిమాలో సిక్కు సోల్జర్, హవాల్దార్ ఇషార్ సింగ్ పాత్రను రణ్‌దీప్ పోషించబోతున్నారు. ఈ పాత్ర ఫస్ట్‌లుక్‌ను తాజాగా ట్విట్టర్లో విడుదల చేశారు. చరిత్రలో గొప్ప ఆర్మీ పోరాటంగా ఘనత వహించిన సారాగర్హి యుద్ధం నేపథ్యంగా ఈ సినిమా తెరకెక్కబోతున్నది. 36 సిక్కు బెటాలియన్ కమాండర్ ఇషార్ సింగ్ అఫ్ఘన్ గిరిజన తెగలతో వీరోచితంగా జరిపిన పోరాటమే ఈ సినిమా. 1897లో 21మంది సిక్కు సైనికులతో కూడిన 36 బెటాలియన్.. పదివేలమంది ఆఫ్ఘన్లు యుద్ధానికి సిద్ధపడినా.. వెన్నుచూపకుండా తుదివరకు పోరాడింది. చివరివరకు యుద్ధం క్షేత్రంలో నిలిచి పోరాడిన వీరుడైన ఇషార్ సింగ్ పాత్రను రణ్‌దీప్ పోషించబోతున్నారు. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది.