
ఢిల్లీ :న్యూఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఒక పాకిస్తాన్ అధికారి తన దౌత్య కార్యకలాపాలకు విరుద్ధంగా వ్యవహరించినందుకు సదరు అధికారిని భారత ప్రభుత్వం పర్సనా నాన్ గ్రాటాగా ప్రకటించింది. ఈ మేరకు మంగళవారం కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
అంతర్జాతీయ స్థాయిలో ఓ వ్యక్తి దౌత్య అధికారిగా ఉన్న సమయంలో ఏమైనా విరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే పర్సనా నాన్ గ్రాటాగా పరిగణించి దేశం నుంచి బహిష్కరిస్తూ నిషేధాజ్ఞాలు అమలు చేస్తారు. ఆ పాకిస్తాన్ అధికారి భారతదేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
కాగా, పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్తాన్ ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్న సంగతి విదితమే. ఉగ్రవాదుల ఏరివేతే లక్ష్యంగా పాకిస్తాన్ పై దాడికి దిగింది భారత్. పాకిస్తాన్ కు గట్టిగా బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో ఆపరేషన్ సిందూర్ ను ఆరంభించి దాయాది దేశంలోని పలు ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసింది. అదే సమయంలో పాకిస్తాన్ లో ని పలు ఎయిర్ బేస్ లను సైతం భారత్ నేలమట్టం చేసింది. పాకిస్తాన్ పదే పదే కవ్వింపు చర్యలకు పాల్పడిన తరుణంలో భారత్ ఆపరేషన్ సిందూర్ తో తన సత్తా ఏమిటో చూపెట్టింది.