
2022–2024 మధ్య 429 మంది వైద్యుల రాజీనామా
ఢిల్లీ ఎయిమ్స్ నుంచి అత్యధికంగా 52 మంది
రాజీనామాల్లో అధికభాగం ఉన్నత స్థాయిలోనే
న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఎయిమ్స్.. అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ. దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన సంస్థ తీవ్ర అనారోగ్యంతో ఉంది. ఒకప్పుడు ఇందులో చేరడానికి వైద్యులు పోటీపడ్డ సంస్థను ఇప్పుడు వైద్యులు వీడుతున్నారు. ఎంతో ప్రతిష్ట ఉన్న సంస్థ. ఆ సంస్థతో అంతే విడదీయలేని అనుబంధం. కొంతమంది డాక్టర్లయితే.. వారి పేరుతో కాకుండా.. ఎయిమ్స్‌తోనే గుర్తింపు. అలాంటి గుర్తింపును కూడా ఎందుకు వదులుకొంటున్నారు? పేగుబంధం లాంటి అనుబంధాన్ని తెంచేసుకుంటున్నారు? ఇటీవల పార్లమెంటుకు ప్రభుత్వం ఇచ్చిన నివేదిక చెప్పిన సత్యాలేంటో చూద్దాం.
ఢిల్లీ ఎయిమ్స్ నుంచే ఎక్కువగా...
దేశవ్యాప్తంగా ఉన్న ఎయిమ్స్‌ల్లో 429 మంది రాజీనామా చేశారు. 2022 నుంచి 2024 మధ్య రెండేళ్ల కాలంలోనే, రాజీనామాలు సంభవించాయి. ఢిల్లీలోని ఎయిమ్స్ నుంచి అత్యధికంగా 52 మంది వైద్యులు రాజీనామా చేసి వెళ్లిపోయారు. అయితే ఇది కేవలం ఢిల్లీకే పరిమితం కాలేదు. రిషికేశ్‌లో 38 మంది, రాయ్‌పూర్‌లో 35, బిలాస్‌పూర్‌లో 32, మంగళగిరిలో 30 మంది, భోపాల్‌లో 27 మంది వైద్యులు రాజీనామా చేశారు. ఢిల్లీలోని ఎయిమ్స్‌లో 1,000 మందికంటే ఎక్కువ మంది అధ్యాపకులు, విభాగాధిపతులు, కేంద్రాల అధిపతులు, సీనియర్ ప్రొఫెసర్లు ఉన్నారు. అయితే.. ఇక్కడ జరిగిన రాజీనామాలలో ఎక్కువ భాగం ఉన్నత స్థాయిలోనే జరిగాయి.
అత్యున్నత స్థాయివారే అత్యధికం..
రాజీనామా చేసినవారిలో మాజీ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా వంటి ప్రముఖులు ఉండటం గమనార్హం. ఆయన వీఆర్‌ఎస్ తీసుకుని గురుగ్రామ్‌లోని మేదాంత ఆసుపత్రిలో పనిచేస్తున్నారు. కార్డియాలజీ విభాగాధిపతి డాక్టర్ శివ్ చౌదరి రాజీనామా చేసి ఫోర్టీస్ ఎస్కార్ట్‌లో చేరారు. న్యూరోసర్జరీ విభాగాధిపతి డాక్టర్ శశాంక్ శరద్ కాలే అపోలోకు మారారు. రాజీనామా చేసిన ప్రముఖుల్లో ఈఎన్‌టీ విభాగం, నేషనల్ కేన్సర్ ఇనిస్టిట్యూట్ మాజీ అధిపతి డాక్టర్ అలోక్ టక్కర్, రోటరీ కేన్సర్ హాస్పిటల్ అనస్థీషియాలజీ అధిపతి డాక్టర్ సుష్మా భటా్నగర్, న్యూరాలజీ విభాగం మాజీ అధిపతి, న్యూరోసైన్సెస్ సెంటర్ చీఫ్ డాక్టర్ పద్మ శ్రీవాస్తవ, ఆర్థోపెడిక్ విభాగం మాజీ అధిపతి డాక్టర్ రాజేష్ మల్హోత్రా కూడా ఉన్నారు. వీరంతా ఎయిమ్స్‌లోనే ఎదిగి, 3 దశాబ్దాలకు పైగా ఇక్కడే సేవలందించడం గమనార్హం.
అపనమ్మకం.. అసమర్థత...
ఢిల్లీలోని ఎయిమ్స్ అంటే.. తక్కువ ఖర్చుతో అత్యున్నతమైన వైద్యం అందుతుందనే అపారమైన నమ్మకం ఉంటుంది. అందుకే.. ఇప్పటికీ ప్రతిరోజూ వేలాది మంది రోగులు వస్తుంటారు. అలాంటి సంస్థ చిత్రం మొత్తం మారిపోయింది. సరైన నాయకత్వం లేకపోవడం నిర్వహణ అస్తవ్యస్థంగా మారింది. అపాయింట్‌మెంట్ల కోసం గంటల తరబడి క్యూలు, శస్త్రచికిత్సల కోసం నెలలపాటు సుదీర్ఘ నిరీక్షణలు సర్వసాధారణం అయ్యాయి. ఇప్పుడు వ్యవస్థ మొత్తం నిత్యం ఒత్తిడిలో ఉంటోంది. గతంలో ఎయిమ్స్ డైరెక్టర్ అంటే.. గొప్ప గౌరవం. కానీ ఇప్పుడు అపనమ్మకం, అసమర్థతతో కూడిన వాతావరణాన్ని సృష్టించారు. ఇక విభాగాధిపతులైతే తమ శాఖలకు సంబంధించిన నిర్ణయాన్ని తీసుకోలేని స్థితికి తీసుకొచ్చారు. వారి ప్రతిపాదనలన్నీ కాగితాలపైనే నిలిచిపోతున్నాయి. రోజువారీ పనితీరు కూడా కష్టమవ్వడం వల్లే ఎయిమ్స్‌ను వీడామని పలువురు చెబుతున్నారు.
రోటరీ హెడ్‌షిప్ విధాన అమలే లేదు..
ఇక్కడ మరో వివాదాస్పద అంశం రోటరీ హెడ్‌షిప్ విధానం. రోటరీ హెడ్‌షిప్ అనేది వైద్య కళాశాల విభాగాల అధిపతులను రొటేషన్ పద్ధతిలో నియమించే విధానం. దీని ప్రకారం, ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి, ఒక అధ్యాపకుడు ఆ విభాగానికి అధిపతిగా ఉంటారు. ఆ తర్వాత మరొకరు ఆ స్థానాన్ని తీసుకుంటారు. అధ్యాపకులందరికీ నాయకత్వ అవకాశం కల్పించడం, వారి అనుభవాన్ని పెంచడం లక్ష్యంగా దీన్ని రూపొందించారు. ఆక్స్‌ఫర్డ్, హార్వర్డ్ వంటి ప్రతిష్టాత్మక అంతర్జాతీయ సంస్థలలో అమలు చేసే వ్యవస్థ. ఢిల్లీలోని ఎయిమ్స్, చండీగఢ్‌లలోని పీజీఐఎంఈఆర్‌లో దీనిని అమలు చేయాలని 2023లో కేంద్ర ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది. 2024 జూన్ వరకు గడువు విధించింది. అయినా ఈ విధానం అమలు కాలేదు.
రాజకీయాలతో విశ్వసనీయతకు మచ్చ..
ఎయిమ్స్‌తో 30 నుంచి 35 ఏళ్ల అనుబంధం కలిగి ఉండి కూడా.. జరుగుతున్న నష్టాన్ని చూస్తూ భరించలేక వీడామని సీనియర్లు అంటున్నారు. నిబద్ధతతో ఉన్న వైద్యులపై రాజకీయాలు చేయడం, తక్కువ అనుభవం ఉన్నవారికి సంస్థలో నిర్ణయాధికారాలు కట్టబెట్టే ధోరణి సీనియర్లకు ఇబ్బందికరంగా మారింది. తప్పని పరిస్థితుల్లోనే అంత గొప్ప సంస్థను వీడామంటున్నారు. తాము వేతనాలకోసమే అయితే ఎప్పుడో వెళ్లిపోయేవారమని, ఇన్ని దశాబ్దాల తరువాత సంస్థను వీడాల్సి రావడానికి సంస్థలో రాజకీయాలే కారణమని చెబుతున్నారు. ఈ సామూహిక వలసలతో సీనియర్ స్థాయి వైద్యుల కొరత ఏర్పడింది. ప్రస్తుతం ఎక్కువ మంది అధ్యాపకులు, అసిస్టెంట్ ప్రొఫెసర్లతో నిండిపోయింది. ఇది ఎయిమ్స్ ఢిల్లీ వంటి ప్రఖ్యాత వైద్య సంస్థ విశ్వసనీయతపై ప్రశ్నలను లేవత్తుతోంది.
సౌకర్యాల కొరతతో పోస్టులు ఖాళీ..
ఎయిమ్స్ ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి. అక్కడ సరిపోను క్వార్టర్స్ ఉండటం లేదు. కనెక్టివిటీ తక్కువగా ఉంటోంది. దగ్గరలో ఉన్నతస్థాయి పాఠశాలు ఉండటం లేదు. షాపింగ్ కాంప్లెక్సులు సరికదా.. చివరకు ఇంటర్నెట్ సౌకర్యంగా కూడా సరిగా ఉంటం లేదు. ఇక వీరు ఉంటున్న ప్రాంతాలు టైర్–3 నగరాలుగా గుర్తించి హోమ్ అలవెన్స్ తక్కువగా ఇస్తున్నారు. ఈ సమస్యలపై ఇప్పటికే పలుమార్లు ప్రభుత్వానికి నివేదించినా ఫలితం లేదు. దీంతో ఇక్కడికి రావడానికి వైద్యులు అంతగా ఆసక్తి చూపడం లేదు. రాయ్‌బరేలిలో 201 ఫ్యాకల్టీ పోస్టులకు 88 భర్తీ కాలేదు.
జమ్మూలోని ఎయిమ్స్‌లో అసోసియేట్ ప్రొఫెసర్ స్థాయిలో 183కి గాను 68 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రెండు మూడేళ్లుగా ఖాళీలను భర్తీ చేయడం లేదు. గత మూడేళ్లలో ఒక్క ఢిల్లీలోని ఎయిమ్స్‌లోనే 1,191 అధ్యాపక పోస్టులు మంజూరయ్యాయి. వాటిలో 827 భర్తీ అయ్యాయి. ఇక దేశవ్యాప్తంగా 2023–24లో 1,207 పోస్టులు మంజూరు కాగా, 850 భర్తీ అయ్యాయి. 2024–25లో 1,235 పోస్టులు మంజూరు కాగా, 803 భర్తీ అయ్యాయి. 2025–26 సంవత్సరానికి 1,306 పోస్టులు మంజూరు కాగా, 844 భర్తీ అయ్యాయి. దేశవ్యాప్తంగా మొత్తం 12 ఎయిమ్స్‌ల్లో సగానికి పైగా ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉండటం గమనార్హం.