
యువతలో సంపాదనాపరులు 40% లోపే
34% మంది నెల ఆర్జన రూ.10 వేలలోపే
నాలుగింట మూడొంతులు ప్రైవేట్ జాబ్స్
మనదేశం మొత్తం జనాభాలో 15–29 సంవత్సరాల మధ్య వయస్సు గల యువత సుమారు 29% ఉన్నారు. అంటే దాదాపు 42 కోట్ల మంది! యువత జనాభా పరంగా భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద దేశంగా అవతరించింది. ఆర్థిక వృద్ధి, అభివృద్ధిని నడిపించే సామర్థ్యం వీరికి ఉంది. ఇదంతా నాణేనికి ఒకవైపు. వాస్తవానికి మన దేశంలోని యువతలో ఆర్జించే వారి సంఖ్య 40 శాతం లోపే ఉంది. అంతేకాదు, ప్రతి పది మందిలో ఒకరే ఉద్యోగం చేస్తున్నారు.
పీపుల్ రీసెర్చ్ ఆన్ ఇండియాస్ కన్జ్యూమర్ ఎకానమీ (పీఆర్‌ఐసీఈ) విడుదల చేసిన ‘నావిగేటింగ్ ది యూత్ ఫ్రాంటియర్’ అనే పరిశోధనా పత్రంలో ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. 2025 నాటికి ప్రపంచవ్యాప్తంగా దాదాపు ఐదుగురు యువకుల్లో ఒకరు భారత్‌కు చెందిన వారు ఉంటారని ఈ అధ్యయనం తెలిపింది.
2024–25లో మొత్తం యువతలో 2.4 శాతం అంటే.. ఒక కోటి మంది మాత్రమే వ్యవసాయ సంబంధిత కార్యకలాపాల్లో నిమగ్నమయ్యారని వివరించింది. ‘యువతలో అత్యధికంగా 26.8 శాతం మంది విద్యార్థులు ఉన్నారు. వ్యాపారం, స్వయం ఉపాధి 14.1 శాతం; వేతన జీవులు 9.9 శాతం, రోజువారీ కూలీలు 12.3 శాతం ఉన్నారు’ అని వెల్లడించింది.
నాలుగింట మూడొంతులు ప్రైవేట్ జాబ్స్
మూడింట ఒక వంతు..: సంపాదించే యువతలో మూడింట ఒక వంతు.. అంటే 34.2 శాతం మంది ఆదాయం నెలకు రూ.10,000 లోపే ఉండడం ఆందోళన కలిగించే అంశం. ఇక 69.3 శాతం మంది ఆదాయం నెలకు రూ.25,000 లోపే ఉంది. దిగువ, దిగువ మధ్య ఆదాయ విభాగంలో ఎక్కువ మంది స్త్రీలు ఉండగా; ఎగువ మధ్య, అధిక ఆదాయ విభాగంలో పురుషులు అధికంగా ఉన్నారు. ప్రైవేటు రంగంలో ఏకంగా 3 కోట్లపైచిలుకు మంది విధులు నిర్వర్తిస్తున్నారు.
గ్రామాల్లోనే ఎక్కువ..: యువతలో 70 శాతం కంటే ఎక్కువ మంది కార్మికులు, 90 శాతం మంది వ్యవసాయదారులు గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. నిరుద్యోగుల్లో 68 శాతం మంది గ్రామీణ ప్రాంతాల్లోనే ఉన్నారు. మెట్రో నగరాల్లోని యువతలో అత్యధికంగా 22 శాతం మంది ఉద్యోగాలు చేస్తున్నారు. అలాగే వ్యవసాయేతర కార్యకలాపాలలో 17 శాతం మంది స్వయం ఉపాధి పొందుతున్నారు. సాంకేతికత, కళలు, సంస్కృతి పరంగా ప్రత్యేకత ఉన్న నగరాల్లో 19 శాతం, ఆర్థికంగా వేగంగా వృద్ధి చెందుతున్న పట్టణాల్లో 16 శాతం యువత స్వయం ఉపాధి పొందుతున్నారు.
2024–25లో భారతీయ యువత ఆదాయాలు ఇలా..
సగటు ఆదాయం రూ.1,59,000
మొత్తంగా భారత్‌లోని యువతలో 38.7 శాతం మంది మాత్రమే సంపాదనపరులు ఉన్నారు. యూత్ సగటు ఆదాయం దేశంలో రూ.1,59,000 మాత్రమే. ఇది పట్టణాల్లో రూ.2,19,000 కాగా, గ్రామీణ ప్రాంతాల్లో రూ.1,28,000.

