
బాధితురాలి తల్లిపైనా పోలీసు బలప్రయోగం
ర్యాలీలను అడ్డుకునేందుకు కోల్‌కతాలో భారీ ఏర్పాట్లు
సెక్రటేరియట్ వైపు వెళ్లకుండా ఆందోళనకారుల అడ్డగింత
కోల్‌కతా: కోల్‌కతాలోని ఆర్‌జీ కర్ ప్రభుత్వాస్పత్రిలో ట్రెయినీ వైద్యురాలు హత్యాచారానికి గురై ఏడాది నిండిన సందర్భంగా శనివారం నిరసనకారుల ర్యాలీలు రణరంగాన్ని తలపించాయి. కోల్‌కతాలోని రాష్ట్ర సెక్రటేరియట్ ‘నబన్న’దిశగా వచ్చే ఆందోళన కారులను అడ్డుకునేందుకు పోలీసులు 10 అడుగుల ఎత్తయిన బారికేడ్లను, పలు అంచెల భద్రతా వలయాన్ని ఏర్పాటు చేశారు.
వీటిని దాటేందుకు ఆందోళన కారులు ప్రయతి్నంచడంతో పోలీసులు లాఠీచార్జి చేపట్టారు. ముందుగా నిర్దేశించిన ప్రాంతం నుంచి కాకుండా రద్దీగా ఉండే పార్క్ స్ట్రీట్ మీదుగా ర్యాలీ సాగడం ఉద్రిక్తతకు కారణమైంది. పోలీసులు అడ్డుతగలడంతో బెంగాల్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత సువేందు అధికారి, బీజేపీకి చెందిన పలువురు నేతలు, ఎమ్మెల్యేలు నెహ్రూ రోడ్ క్రాసింగ్‌లో ధర్నాకు దిగారు.
ఈ సందర్భంగా పోలీసులు చేపట్టిన లాఠీచార్జిలో సువేందు తదితరులు సహా 100 మందికి పైగా గాయపడ్డారు. పోలీసులు తనపై దాడి చేశారని ట్రెయినీ వైద్యురాలి తల్లి ఆరోపించారు. ‘ర్యాలీలో పాల్గొన్న నన్ను పోలీసులు కొట్టారు. నా చేతి గాజులు పగిలిపోయాయి. మమల్ని ఎందుకు ఆపుతున్నారు? నా కుమార్తెకు న్యాయం కోసం సెక్రటేరియట్‌కు వెళ్లాలనుకున్నాం’అని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. లాఠీచార్జీలో తమ పార్టీ ఎమ్మెల్యేలతోపాటు బాధిత ట్రెయినీ వైద్యురాలి తల్లిదండ్రులకు కూడా దెబ్బలు తగిలాయని సువేందు ఆరోపించారు. ‘పోలీసులను కొట్టే సమయం దగ్గరపడింది.
మా హై కమాండ్ నుంచి ఆదేశాలు వస్తే చాలు..అప్పుడిక పోలీసులు మమతా బెనర్జీ చాటున దాక్కోవాల్సిందే’అని బీజేపీ నేత, మాజీ క్రికెటర్ అశోక్ దిండా ఆగ్రహంతో అన్నారు. అయితే, నబన్న చుట్టుపక్కల ప్రాంతాల్లో నిషేధాజ్ఞలు అమల్లోకి ఉన్నాయని పోలీసులు తెలిపారు. వేకువజామున 4 నుంచి రాత్రి 10 గంటల వరు నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలను అమలు చేశారు. హౌరా బ్రిడ్జిపై వాహనాల రాకపోకలను నిలిపివేశారు. పెద్ద సంఖ్యలో ఆందోళనకారుల తరలివస్తారన్న సమాచారంతో ముందు జాగ్రత్తగా పోలీసులు పలు చోట్ల వాటర్ కెనన్లను సిద్ధంగా ఉంచారు. కీలకమైన మార్గాల్లో భారీ కంటెయినర్లను అడ్డుగా ఉంచారు. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్‌ను మోహరించారు. కాగా, ఆర్‌జీ కర్ ఆస్పత్రిలో గతేడాది ఆగస్ట్‌లో చోటుచేసుకున్న దారుణం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఘటనలో సంజయ్ రాయ్ అనే పౌర వలంటీర్‌ను సీబీఐ కోర్టు దోషిగా నిర్థారించింది.