
న్యూఢిల్లీ: పలువురు విద్యార్థినులను లైంగికంగా వేధింపులకు గురిచేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీకి చెందిన స్వయం ప్రకటిత ఆధ్యాత్మిక గురువు చైతన్యానంద సరస్వతి తనను తాను అర్హత కలిగిన మేనేజ్‌మెంట్ గురువునని, ప్రముఖ రచయితనంటూ చెబుతున్నాడు. పైగా ‘స్టీవ్ జాబ్స్, ఒబామా.. తన ముందు జుజుబీ’.. అటూ సరికొత్త వాదన వినిపిస్తున్నాడు. దీంతో ఇప్పుడు అందరి దృష్టి అతని వ్యక్తిగత జీవితంపై పడింది.
పలు విశ్వవిద్యాలయాల నుండి ఏడు గౌరవ డిగ్రీలు
అకడమిక్ రీసెర్చ్ షేరింగ్ ప్లాట్‌ఫామ్‌లోని చైతన్యానంద ప్రొఫైల్‌లో అతను చికాగో విశ్వవిద్యాలయం బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుండి ఎంబీఏ, పీహెచ్‌డీ చేసినట్లు చూపిస్తోంది. అలాగే అతను పోస్ట్-డాక్టోరల్ డిగ్రీలు, డీలిట్ పూర్తి చేసారని, భారతదేశంతో పాటు విదేశాలలోని పలు విశ్వవిద్యాలయాల నుండి ఏడు గౌరవ డిగ్రీలను కలిగి ఉన్నాడని ఆ సైట్‌లో పేర్కొన్నారు. అయితే ఈ వాదనలు ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో అందుబాటులో ఉన్న అతని పుస్తక రచయిత పేజీలలోనూ ఉన్నాయి. అతని విద్యాభ్యాస వివరాలు అనుమానాస్పదంగా ఉన్నాయని, నిజానిజాలు తేల్చేందుకు సమగ్ర దర్యాప్తు జరుగుతున్నదని ఢిల్లీ పోలీసు వర్గాలు తెలిపాయి.
స్టీవ్ జాబ్స్ ముందుమాట
తన పుస్తకాలపై చైతన్యానంద తనను తాను ‘అంతర్జాతీయంగా ప్రశంసలు పొందిన రచయిత’గా పరిచయం చేసుకుంటాడు. అతని పుస్తకాలలో ఒకటైన ‘ఫర్గెట్ క్లాస్‌రూమ్ లెర్నింగ్’లో యాపిల్ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ ముందుమాటను రాసినట్లు ఉంది. పుస్తకం మొదటి పేజీలో ఈ చైతన్యానంద పుస్తకం.. ప్రపంచానికి అపూర్వమైన మార్గదర్శకాల మాన్యువల్’ అని జాబ్స్ చెప్పినట్లు ప్రచురితమయ్యింది. మాజీ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా చైతన్యానంద పుస్తకం ‘ట్రాన్స్‌ఫార్మింగ్ పర్సనాలిటీ’ని పదేపదే ప్రస్తావించారనే అనే విషయం బయటకొచ్చింది. ఈ పుస్తకం 2007లో యూరోపియన్, ఉత్తర అమెరికా మార్కెట్లలో బెస్ట్ సెల్లర్లలో ఒకటిగా నిలిచిందని సమాచారం.
రెండు దశాబ్ధాలుగా మహిళలపై వేధింపులు
ఈ పుస్తకంలో ఐక్యరాజ్యసమితి మాజీ సెక్రటరీ జనరల్ బాన్ కీ-మూన్ పేరుతో ప్రశంసా సందేశం కూడా ఉంది. ఆయన ఆ పుస్తకంలో రచయిత గురించి చెబుతూ, ప్రముఖ ప్రొఫెసర్, ప్రముఖ రచయిత, వక్త, విద్యావేత్త, ఆధ్యాత్మిక తత్వవేత్త పరోపకారి, భారతదేశంతో పాటు విదేశాలలో మేనేజ్‌మెంట్ నిపుణునిగా పేర్కొన్నారు. కాగా చైతన్యానంద ఎడ్యుకేషన్ ప్రొఫైల్‌లోని చాలా సమాచారం నకిలీదని పోలీసులు బలంగా నమ్ముతున్నారు. వసంత కుంజ్‌లోని శారదా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ మేనేజ్‌మెంట్‌లో విద్యార్థులను లైంగికంగా వేధించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో, చైతన్యానంద సరస్వతి ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. కాగా అతను అతను దేశం విడిచి పారిపోకుండా నిరోధించడానికి పోలీసులు లుకౌట్ నోటీసు జారీ చేశారు. చైతన్యానంద రెండు దశాబ్దాలుగా మహిళలను వేధిస్తున్నాడని దర్యాప్తులో వెల్లడైంది. కాగా జుజుబీ అంటే రేగిపండు.. దీని శాస్త్రీయ నామం జిజిఫస్ జుజుబా (Ziziphus jujuba). రేగిపండు చిన్నగా ఉంటుంది. దేన్నయినా జుజుబితో పోలిస్తే అది 'నా వెంట్రుకతో సమానం' అనే అర్థం వస్తుంది.