
సగానికి తగ్గిన అల్ప ఆదాయ దేశాల సంఖ్య
రెండింతలకుపైగా పెరిగిన సంపన్న దేశాలు
వెల్లడించిన ప్రపంచ బ్యాంక్ 1987–2024 లెక్కలు
2007లో ‘దిగువ మధ్య ఆదాయ దేశం’గా భారత్
అంతవరకు ‘అల్పాదాయ దేశాల’ జాబితాలో..
కాలం వేగంగా పరుగెడుతోంది. అందుకు తగ్గట్టుగా సాంకేతికంగానే కాదు, ఆర్థికంగానూ మార్పులను చూస్తున్నాం. ప్రజల జీవన ప్రమాణాలు చాలా మెరుగయ్యాయి. సగటు ఆదాయాలూ పెరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 1987లో అల్పాదాయ దేశాలు 49 ఉంటే.. 2024 నాటికి ఈ సంఖ్య దాదాపు సగానికి వచ్చిందంటే అభివృద్ధి దిశగా ఏ స్థాయిలో మార్పులొచ్చాయో అర్థం చేసుకోవచ్చు.
మనదేశం గత 20 ఏళ్ల కాలంలో విశేష పురోగతి సాధించింది. ప్రపంచ బ్యాంకు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. ఒకప్పుడు అల్పాదాయ దేశాల జాబితాలో ఉన్న మనదేశం.. 2007లోనే దిగువ మధ్య ఆదాయ దేశంగా అవతరించడం విశేషం. 1987లో అల్పాదాయ దేశాల జాబితాలో ఉన్న దక్షిణాసియాలోని ఆరు దేశాల్లో 2024 నాటికి అయిదు దేశాలు దిగువ మధ్య దేశాల జాబితాలోకీ, ఒకటి ఎగువ మధ్య దేశాల జాబితాలోకీ చేరాయి.
37 ఏళ్లలో అల్పాదాయ దేశాల సంఖ్య సగానికి పడిపోవడం ప్రజల ఆదాయాల పెరుగుదల తీరుతెన్నులకు అద్దం పడుతోంది. ఇక ఎగువ మ ధ్య తరగతి దేశాలు 28 నుంచి 54కు చేరాయి. అధిక ఆదాయ దేశాల సంఖ్య 41 నుంచి రెండింతలకుపైగా దూసుకెళ్లి 87 అయ్యాయి.
తగ్గిన పేదలు..: 2004–24 మధ్య ఎగువ మధ్య ఆదాయ గ్రూప్ దేశాల జనాభా 8.9 నుంచి 34.7%కి ఎగబాకడం గమనార్హం. 2004లో అల్పాదాయ గ్రూప్ దేశాల్లో నివసించిన జనాభా 37.4% ఉండగా.. రెండు దశాబ్దాల్లో ఇది 7.6%కి దిగొచ్చింది. అయితే యుద్ధాలు, ఆర్థిక సంక్షోభాలు ఆదాయాల్లో ఒక మెట్టు దిగేలా చేస్తాయనడానికి సిరియా, యెమెన్ ఉదాహరణ. 2017లో తక్కువ–మధ్య ఆదాయ గ్రూప్ నుంచి ఇవి అల్పాదాయ గ్రూప్‌నకు వచ్చాయి.
నాలుగు గ్రూపులుగా..: ప్రపంచంలోని దేశాలను.. ప్రపంచ బ్యాంకు ఏటా తలసరి స్థూల జాతీయ ఆదాయం (జీఎన్‌ఐ) ఆధారంగా అల్ప, దిగువ–మధ్య, ఎగువ–మధ్య, అధిక–ఆదాయ దేశాలుగా వర్గీకరిస్తోంది. 2025–26 (2025 జూలై–2026 జూన్) సంవత్సరానికిగాను ప్రపంచవ్యాప్తంగా 216 దేశాల జాబితా విడుదల చేసింది. తలసరి జీఎ న్ ఐ అనేది విదేశీ సంపాదనతో సహా ఏదైనా దేశంలోని జనాభా సగటు ఆదాయానికి కొలమానం. రాయితీ రుణాలకు ఏ దేశాలు అర్హమైనవో నిర్ణయించడానికి సగటు ఆదాయాలను ప్రపంచ బ్యాంకు పరిగణనలోకి తీసుకుంటోంది.

యూరప్, మధ్య ఆసియా: 1987–2024 మధ్య తక్కువ ఆదాయ దేశం ఒక్కటీ లేదు. అధిక ఆదాయ దేశాల శాతం 71 నుంచి 69కి తగ్గింది.
తూర్పు ఆసియా, పసిఫిక్: 1987లో 26% దేశాలు తక్కువ ఆదాయ గ్రూప్‌లో ఉండగా.. 2024 నాటికి కేవలం 3%కి తగ్గాయి.
లాటిన్ అమెరికా, కరేబియన్: తక్కువ ఆదాయ దేశాలు 2 నుండి సున్నాకి వచ్చాయి. అధిక ఆదాయ దేశాలు 9% నుంచి 46%కి పెరిగాయి.
మధ్యప్రాచ్యం, ఉత్తర ఆఫ్రికా: తక్కువ ఆదాయ దేశాలు 2 నుండి 3కి పెరిగాయి. అధిక ఆదాయ దేశాలు 35%కి చేరాయి.
సబ్–సహారన్ ఆఫ్రికా: తక్కువ ఆదాయ దేశాలు 75% నుండి 45%కి తగ్గాయి. ఒక దేశం అధిక ఆదాయ గ్రూప్‌లో చేరింది.