
పాలక్కాడ్: కేరళలో నిఫా వైరస్ మళ్లీ కలకలం సృష్టిస్తోంది. తాజాగా మరో ‘నిఫా’ అనుమానిత మరణం నమోదైంది. ఈ నేపధ్యంలో ఈ వైరస్ ప్రభావం కలిగినవిగా భావిస్తున్న ఆరు జిల్లాల్లోని వైద్యాధికారులు మరింత అప్రమత్తయయ్యారు. నిఫా రెండవ మరణం విషయంలో పుణేలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్‌ఐవీ)తుది నిర్ధారణ చేయనుంది.
జూలై 12న పాలక్కాడ్ జిల్లాకు చెందిన 57 ఏళ్ల వ్యక్తి నిపా వైరస్ కారణంగా మరణించాడనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. దీంతో ఈ వైరస్‌తో కేరళలో మరణించినవారి సంఖ్య రెండుకు చేరింది. బాధితుడు ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందాడు. మంజేరి మెడికల్ కాలేజీలో అతనికి వైద్య పరీక్షలు నిర్వహించగా, నిపా పాజిటివ్‌గా తేలిందని రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విషయంలో వెంటనే అప్రమత్తమైన కేరళ ప్రభుత్వం కాంటాక్ట్ ట్రేసింగ్, ఫీల్డ్ సర్వైలెన్స్‌ను ముమ్మరం చేసింది.
మృతునితో సంబంధం కలిగిన 46 మంది జాబితాను సిద్ధం చేశారు. మృతుడు గతంలో తిరిగిన ప్రాంతాలను గుర్తించేందుకు సీసీటీవీ ఫుటేజ్,మొబైల్ టవర్ డేటా సాయం తీసుకున్నారు. ప్రాంతీయ వైద్య బృందాలను అప్రమత్తం చేశామని, పరిస్థితులను పర్యవేక్షించేందుకు అందుబాటులో ఉన్న అన్ని డేటాలను సేకరిస్తున్నామని వీణా జార్జ్ తెలిపారు. కాగా పాలక్కాడ్, మలప్పురం జిల్లాల ప్రజలు అనవసరమైన సందర్శనలకు దూరంగా ఉండాలని అధికారులు కోరారు. ఆస్పత్రులలోని వైద్య సిబ్బంది, రోగులు, సందర్శకులు మాస్క్‌లు ధరించాలని సూచించారు. పాలక్కాడ్, మలప్పురం, కోజికోడ్, కన్నూర్, వయనాడ్, త్రిస్సూర్ తదితర ఆరు జిల్లాల్లోని ఆసుపత్రులకు నిపా అప్రమత్తతపై అధికారుల నుంచి హెచ్చరికలు అందాయి.