
కోలారు: కోలారు తాలూకా భట్రహళ్లి నివాసి సతీష్ గౌడ అనే వ్యక్తి కోసం ఎన్‌ఐఎ అధికారులు రావడం కలకలం రేపింది. అతడు లేకపోవడంతో విచారణకు రావాలంటూ ఇంటికి నోటీసులు అంటించి వెళ్లారు. ఉగ్రవాదులు ఉపయోగిస్తున్న మొబైల్ సిమ్ కార్డును గతంలో సతీష్‌గౌడ యాక్టివేషన్ చేసిచ్చాడనే ఆరోపణలున్నాయి. నిందితుడు భట్రహళ్లిలోని భార్యతో కలిసి మూడేళ్లుగా ఉంటున్నాడు. బెంగుళూరు కోరమంగలలోని ఓ ప్రైవేటు టెలికాం కంపెనీలో పనిచేశాడు, అప్పుడు ఇతడు యాక్టివేట్ చేయించిన సిమ్ కార్డులనే ఉగ్రవాదులు ఉపయోగించారని 2023లో ఎన్‌ఐఎ అధికారులు గుర్తించి సతీ‹Ùగౌడకు నోటీసులు ఇచ్చారు. అప్పుడు విచారణకు హాజరయ్యాడు. ఇప్పుడు మరోసారి విచారణకు వచ్చారు.
నా భర్త అమాయకుడు
ఎన్‌ఐఎ అధికారులు వస్తున్నట్లు తెలిసి సతీష్‌గౌడ ఇంటి పరారైనట్లు తెలిసింది. దాదాపు 3 గంటల పాటు ఇంట్లో తనిఖీచేసిన ఎన్‌ఐఎ అధికారులు బెంగళూరు ఇందిరనగరలో ఉన్న ఎన్‌ఐఎ ఆఫీసుకు రావాలని నోటీసులు ఇచ్చి వెనుదిరిగారు.
తరువాత విలేకరులతో మాట్లాడిన సతీష్ గౌడ భార్య హేమావతి.. నా భర్త ఏ తప్పు చేయలేదు. కంపెనీ వారు రోజూ కొన్ని సిమ్‌లు యాక్టివేట్ చేయాలని టార్గెట్ ఇచ్చేవారు, కంపెనీ చెప్పినట్లు చేశాడు, ఆ కంపెనీలో ఉద్యోగం వదిలిన తరువాత వేరే కంపెనీలో పనిచేశాడు. ఇప్పుడే ఏ పనీ లేకుండా ఇంట్లో ఉంటున్నారని తెలిపింది. నిరపరాధి అయిన భర్త అరెస్టు చేస్తారనే భయంతో ఫోన్ కూడా స్విఛాప్ చేసుకుని ఎక్కడికి వెళ్లారో తెలియదని విలపించింది.