శ్రీనగర్‌లో జసీర్ బిలాల్ వానీని అరెస్ట్‌చేసిన ఎన్‌ఐఏ
తోటి ఉగ్రవాదులకు డ్రోన్లతో దాడులు చేసేలా సాంకేతిక సాయం
బిలాల్‌ను ఆత్మాహుతి బాంబర్‌గా మారేలా ఉగ్రభావజాలం తలకెక్కించిన డాక్టర్ ఉమర్
దర్యాప్తులో కొత్త విషయాలు అమీర్ రషీద్‌ను 10 రోజులపాటు ఎన్‌ఐఏ కస్టడీకి అప్పగించిన కోర్టు
న్యూఢిల్లీ/ఫరీదాబాద్: ఎర్రకోట వద్ద కారుబాంబుతో ఆత్మాహుతి దాడి ఉదంతంలో మరో కీలక ఉగ్రవాదిని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) సోమవారం అరెస్ట్‌చేసింది. ఢిల్లీలో కారుపేలుడులో తునాతునకలైన ఉగ్రవాది, డాక్టర్ ఉమర్ ఉన్ నబీ ప్రోద్భలంతో ఆత్మాహుతి బాంబర్‌గా మారేందుకు సిద్ధమైన కశ్మీర్ వాసి జసీర్ బిలాల్ వానీ అలియాస్ డ్యానిష్‌ను ఎన్‌ఐఏ బృందం సోమవారం అరెస్ట్‌చేసింది. జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లా ఖ్వాజీగండ్ ప్రాంతం బిలాల్ స్వస్థలం. రాజనీతిశాస్త్రంలో డిగ్రీపట్టా పుచ్చుకున్న బిలాల్ ఢిల్లీలో ఆత్మాహుతి బాంబర్ డాక్టర్ ఉమర్‌కు సాంకేతిక సాయం చేసేవాడు.
డ్రోన్లలో మార్పులుచేసి అవి పేలుడుపదార్థాలను మోసుకెళ్లేలా ప్రమాదకరంగా మార్చేందుకు ఫరీదాబాద్ ఉగ్ర నెట్‌వర్క్‌కు బిలాల్ సాయపడ్డాడు. చిన్నపాటి రాకెట్‌లను సైతం తయారుచేసేందుకు ప్రయత్నించాడు. నవంబర్ 10న ఢిల్లీలో పేలుడు వెనుక ఉన్న వ్యూహరచన, సూత్రధారుల వివరాలను రాబట్టేందుకు బిలాల్‌ను ఎన్‌ఐఏ అధికారులు ప్రశ్నిస్తున్నారు. డాక్టర్ ఉమర్‌తో బిలాల్ తరచూ సంప్రతింపులు జరిపేవాడని దర్యాప్తులో తేలిందని ఎన్‌ఐఏ ఒక ప్రకటనలో పేర్కొంది. మరోవైపు కారు బాంబు ఘటనలో గాయపడిన మరో ఇద్దరు చనిపోవడంతో ఈ ఘటనలో మొత్తం మరణాల సంఖ్య సోమవారం 15కు పెరిగింది.
నెలల తరబడి బ్రెయిన్‌వాష్
విచారణలో బిలాల్ పలు కొత్త విషయాలు వెల్లడించాడు. ‘‘నువ్వు కూడా ఆత్మాహుతి బాంబర్‌లా మారితే తమ మిషన్‌కు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తరచూ డాక్టర్ ఉమర్ సలహాలిచ్చేవాడు. ఉగ్రభావజాలాన్ని నెలల తరబడి నాకు నూరిపోశాడు. గత ఏడాది అక్టోబర్‌లో కుల్గామ్‌లోని ఒక మసీదులో ఫరీదాబాద్ వైద్యుల ఉగ్రనెట్‌వర్క్ సభ్యులను తొలిసారిగా కలిశా. ఆత్మాహుతికి సిద్ధమని చెప్పాను. తర్వాత నన్ను అల్–ఫలాహ్ వర్సిటీ పరిధిలోని అద్దె ఇంట్లోకి మార్చారు.
వాస్తవానికి నన్ను జైషే మొహమ్మద్ ఉగ్రసంస్థ కోసం క్షేత్రస్థాయిలో పనిచేయాలని సూచించారు. కానీ డాక్టరే నన్ను సూసైడ్‌బాంబర్‌గా మారితే ఇంకా బాగుంటుందని ఎగదోశాడు. అయితే సొంతంగా ఖర్చుపెట్టి వీళ్ల కోసం పనిచేసేంత స్తోమత నాకు లేదు. దీంతో కలిసిపనిచేయలేనని చెప్పి ఈ ఏడాది ఏప్రిల్ నుంచి దూరంగా ఉంటున్నా. అదీకాకుండా ఇస్లామ్ మతాచారాల ప్రకారం ఆత్మాహుతి అనేది మహాపాపం’’ అని బిలాల్ కశ్మీర్ పోలీసు విచారణలో చెప్పాడు.
ఉమర్‌కు రవాణా సాయం అందించిన రషీద్
ఆత్మాహుతి బాంబర్ డాక్టర్ ఉమర్‌కు ఢిల్లీలో సురక్షిత స్థావరంతోపాటు రవాణా ఏర్పాట్లను అమీర్ రషీద్ అలీ చూసుకు న్నాడని దర్యాప్తులే తేలింది. ఢిల్లీలోని పటియాలా కోర్టుల ప్రాంగణంలోని ప్రిన్స్‌పల్ జిల్లా, సెషన్స్ కోర్టు జడ్జి అంజూ బజాజ్ ఛాంద్నా వద్ద రషీద్‌ను సోమవారం హాజరుపరిచారు. ఈ సందర్భంగా రిమాండ్ పత్రంలో పలు అంశాలను ఎన్‌ఏఐ ప్రస్తావించింది.
‘‘ఢిల్లీలో పేలిన కారు రషీద్ పేరిటే ఉంది. ఉమర్‌కు ఢిల్లీ సురక్షిత స్థావరంతోపాటు పేలుడుపదార్థాలు ఇతరత్రాల రవాణా సదుపాయాలు కల్పించాడు. ఢిల్లీలో అలజడి సృష్టించడంతోపాటు ప్రజల్లో భయాందోళనలు పెంచడం ఈ బాంబుపేలుడు మరో ఉద్దేశం. రషీద్‌ను తమ కస్టడీకి అప్పగిస్తే ఈ కుట్రలోని మరిన్ని వివరాలు రాబట్టేందుకు అవకాశం దక్కుతుంది’’ అని ఎన్‌ఐఏ పేర్కొంది. దీంతో రషీద్‌ను 10 రోజులపాటు ఎన్‌ఐఏ కస్టడీకి అప్పగిస్తూ జడ్జి ఉత్తర్వులు జారీచేశారు. రషీద్‌ను కోర్టుకు తీసుకురావడంతో భద్రత దృష్ట్యా కోర్ట్‌హాల్‌లోకి ఎవరినీ రానివ్వలేదు. కోర్టు బయట సైతం కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటుచేశారు.
పాతాళంలో దాక్కున్నా పట్టుకొస్తాం: అమిత్ షా
ఢిల్లీలో పేలుడు, దేశంలో విద్రోహచర్యకు దు స్సాహసం చేసిన దోషులు పాతాళంలో దాక్కున్నాసరే వెతికి పట్టుకొచ్చి చట్టం ముందు నిలబెడతామని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ప్రతిజ్ఞచేశారు. ఈశాన్యరాష్ట్రాల జోనల్ మండలి 32వ సమావేశంలో అమిత్‌షా పాల్గొని ప్రసంగించారు. ‘‘ మోదీ సారథ్యంలో ప్రభుత్వం ఎన్నో విజయవంతమైన పనులుచేసింది. ఇప్పుడు కూడా ఉగ్రవాదులు పాతాళంలో నక్కినాసరే చట్టం ముందు నిలబెట్టి కఠినంగా శిక్షిస్తాం’’ అని అన్నారు.


