నేడే ప్రజాస్వామ్య సౌధం ప్రారంభం

New Parliament Building Inauguration on may 28 2023 - Sakshi

తెల్లవారుజామున యాగం, పూజలు, ప్రార్థనలతో శ్రీకారం 

హాజరు కానున్న పలువురు ప్రముఖులు, 25 పార్టీల నేతలు 

ప్రారంభోత్సవాన్ని బహిష్కరించిన 20 విపక్షాలు  

న్యూఢిల్లీ:  దేశ ప్రజలందరికీ గర్వకారణమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా అభివర్ణించిన పార్లమెంట్‌ నూతన భవన ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ ప్రజాస్వామ్య సౌధాన్ని ఆదివారం ప్రధాని మోదీ లాంఛనంగా ప్రారంభించనున్నారు. షెడ్యూల్‌ ప్రకారం తెల్లవారుజాము నుంచే యాగం, పూజలు, ప్రార్థనలతో ప్రారంభోత్సవానికి శ్రీకారం చుట్టనున్నారు. కేంద్ర మంత్రులు, ఎంపీలు, వివిధ పార్టీల నేతలు, ఇతర ప్రజాప్రతినిధులు, ప్రముఖు లు హాజరవుతారు.

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును ఆహ్వానించనందుకు నిరసనగా పార్లమెంట్‌ నూతన భవన ప్రారంభోత్సవాన్ని తాము బహిష్కరిస్తున్నట్లు 20 విపక్ష పార్టీలు ఇప్పటికే ప్రకటించారు. ఇదిలా ఉండగా, 25 పార్టీల నాయకులు హాజరు కానున్నట్లు తెలుస్తోంది. ప్రజాస్వామ్య దేవాలయాన్ని నిర్మించుకోవడానికి దేశ ప్రజలంతా ఒక్కటై, చేతులు కలపిన తీరు అసలు సిసలైన ‘ఏక్‌ భారత్, శ్రేష్ట్‌ భారత్‌’ స్ఫూర్తిని ప్రతిబింబిస్తోందని అధికార వర్గాలు వెల్లడించాయి.   

పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు  
పార్లమెంట్‌ కొత్త భవనం ప్రారంభోత్సవం నేపథ్యంలో లుటెన్స్‌ ఢిల్లీ ప్రాంతంలో అధికారులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. పార్లమెంట్‌ చుట్టుపక్కల ఏరియాలను పోలీసుల తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అదనపు బలగాలను మోహరించారు. సీసీటీవీ కెమెరాల ద్వారా నిఘా కొనసాగిస్తున్నారు. సెంట్రల్‌ ఢిల్లీలో ప్రత్యేకంగా పికెట్లు ఏర్పాటు చేశారు. రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా చీఫ్‌ బ్రిజ్‌భూషణ్‌పై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్‌తో కొత్త భవనం వద్ద ధర్నా చేస్తామని మహిళా రెజ్లర్లు ప్రకటించగా, అనుమతి లేదని అధికారులు స్పష్టం చేశారు.   

అధీనం మఠం పెద్దలతో మోదీ భేటీ   
ప్రధాని మోదీ శనివారం తన నివాసంలో అధీనం మఠం పెద్దలతో సమావేశమయ్యారు. వారు ఆయనకు ఆశీస్సులు అందించారు. సెంగోల్‌తోపాటు కొన్ని బహుమతులు అందజేశారు. అనంతరం మోదీ వారిని సత్కరించారు. పార్లమెంట్‌ భవన ప్రారంభోత్సవంలో పాల్గొనడానికి అధీనం మఠం పెద్దలు, ప్రతినిధులు తమిళనాడు నుంచి శనివారం ఉదయమే ఢిల్లీకి చేరుకున్నారు.  

ప్రతి శకంలో భారత జాతీయవాదానికి తమిళనాడు కేంద్రంగా నిలిచిందని ప్రధాని మోదీ తెలిపారు. దేశ స్వాతంత్య్ర పోరాటంలో తమిళనాడు ప్రజల భాగస్వామ్యానికి తగిన గుర్తింపు దక్కకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత సెంగోల్‌కు గౌరవం దక్కాల్సి ఉండగా, దాన్నొక ‘వాకింగ్‌ స్టిక్‌’గా ప్రయాగ్‌రాజ్‌లోని ఆనంద్‌ భవన్‌లో మూలన పడేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు మన ప్రభుత్వం దాన్ని ఆనంద్‌ భవన్‌ నుంచి బయటకు తీసుకువచ్చిందన్నారు. దేశ మహోన్నత సంప్రదాయానికి ప్రతీక అయిన సెంగోల్‌ను పార్లమెంట్‌ నూతన భవనంలో ప్రతిష్టిస్తుండడం సంతోషకరమని ప్రధాని మోదీ చెప్పారు.

హాజరయ్యే పార్టీలు, ఉభయ సభల్లో వాటి ఎంపీల సంఖ్య
ఎన్డీయే పార్టీలు  
1.    బీజేపీ (394)  
2.    శివసేన (15)  
3.    నేషనలిస్టు పీపుల్స్‌ పార్టీ
– మేఘాలయా(2)  
4.    నేషనలిస్టు డెమొక్రటిక్‌
    ప్రోగ్రెసివ్‌ పార్టీ(1)   
5.    సిక్కిం క్రాంతికారీ మోర్చా(1)  
6.    జననాయక్‌ జనతా పార్టీ  
7.    ఏఐఏడీఎంకే(5)
8.    ఐఎంకేఎంకే  
9.    ఏజేఎస్‌యూ(1)  
10.    ఆర్‌పీఐ–అథవాలే(1)  
11.    మిజో నేషనల్‌ ఫ్రంట్‌(2)       
12.    తమిళ మానిల కాంగ్రెస్‌(1)  
13.    ఐటీఎఫ్‌టీ–త్రిపుర  
14.    బోడో పీపుల్స్‌ పార్టీ  
15.    పీఎంకే(1)  
16.    మహారాష్ట్రవాదీ గోమంతక్‌ పార్టీ  
17.    ఆప్నా దళ్‌(2)  
18.    అస్సాం గణపరిషత్‌ (1)  

నాన్‌–ఎన్డీయే పార్టీలు
1.    వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ (31)  
2.    తెలుగుదేశం పార్టీ(4)  
3.    లోక్‌ జనశక్తి పార్టీ–
    రామ్‌ విలాస్‌ పాశ్వాన్‌(1)
4.    బిజూ జనతాదళ్‌(21)  
5.    బీఎస్పీ(10)

గైర్హాజరయ్యే పార్టీలు   
1.    కాంగ్రెస్‌ (81)  
2.    డీఎంకే (34)  
3.    శివసేన–యూబీటీ(7)  
4.    ఆమ్‌ ఆద్మీ పార్టీ (11)  
5.    సమాజ్‌వాదీ పార్టీ (6)  
6.    సీపీఐ (4)    
7.    జేఎంఎం (2)    
8.    కేరళ కాంగ్రెస్‌–మణి(2)  
9.    విడుదలై చిరుతైగళ్‌ కట్చీ(1)  
10.    రాష్ట్రీయ లోక్‌దళ్‌ (1)
11.    తృణమూల్‌ కాంగ్రెస్‌ (35)  
12.    జేడీ–యూ (21)   
13.    ఎన్సీపీ (9)   
14.    సీపీఎం (8)  
15.    ఆర్జేడీ (6)   
16.    ఐయూఎంఎల్‌ (4)  
17.    నేషనల్‌ కాన్ఫరెన్స్‌ (3)   
18.    ఆర్‌ఎస్పీ (1)   
19.    ఎండీఎంకే (1)  
20.    ఎంఐఎం (2)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top