బిహార్‌లో చెరో సగం! | NDA finalises seat-sharing formula for upcoming Bihar Assembly elections | Sakshi
Sakshi News home page

బిహార్‌లో చెరో సగం!

Jun 8 2025 5:11 AM | Updated on Jun 8 2025 5:11 AM

NDA finalises seat-sharing formula for upcoming Bihar Assembly elections

243 స్థానాలకుగాను చెరో వంద స్థానాల్లో పోటీ చేయనున్న జేడీయూ, బీజేపీ

మిగతా 43 స్థానాలు ఎల్‌జేపీ, ఆర్‌ఎల్‌ఎం, హెచ్‌ఏఎంలకు

ఎన్డీఏ కూటమి పార్టీల మధ్య కుదిరిన ఏకాభిప్రాయం!

సాక్షి, న్యూఢిల్లీ: ఈ ఏడాది జరగనున్న బిహార్‌ ఎన్నికల్లో పోటీ చేసే స్థానాల సంఖ్యపై ఎన్‌డీఏ కూటమి పార్టీలు సీట్ల పంపకంపై ఒక ఏకాభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. కూటమిలోని ప్రధాన పార్టీలైన బీజేపీ, జేడీయూలో సమాన స్థాయిలో సీట్లు తీసుకోవాలని ఒక ప్రాథమిక నిర్ణయానికి వచ్చాయని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. 

మొత్తం 243 స్థానాలకు గానూ బీజేపీ, జేడీయూలు చెరో వంద స్థానాలు పోటీ చేసేలా అవగాహన కుదిరినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బిహార్‌లోని ఎన్‌డీఏ కూటమిలో బీజేపీ, జేడీయూలతో పాటు చిరాగ్‌ పాశ్వాన్‌ నేతృత్వంలో ని లోక్‌ జనశక్తి పార్టీ (రామ్‌ విలాస్‌) , జితన్‌ రామ్‌ మాంఝీకి చెందిన హిందుస్తానీ అవామీ మోర్చా (హెచ్‌ఏ ఎం), ఉపేంద్ర కుష్వాహా రాష్ట్రీయ లోక్‌మంచ్‌ (ఆర్‌ఎల్‌ఎం) ఉన్నాయి. 

గడిచిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 17, జేడీయూ 16, ఎల్‌జేపీ 5, హెచ్‌ఏఎం, ఆర్‌ఎల్‌ఎం ఒక్కొక్క స్థానంలో పోటీ చేశాయి. పార్లమెంటరీ ఎన్నికల్లో బీజేపీ ఒక స్థానంలో అధికంగా పోటీ చేసినప్పటికీ ఈసారి సమానంగా సీట్ల పంపకాలు ఉంటాయని తెలుస్తోంది. 243 అసెంబ్లీ సీట్లలో జేడీయూ 102–103 సీట్లలో, బీజేపీ 101–102 సీట్లలో పోటీ చేయవచ్చని సమాచారం. మిగిలిన 40 సీట్లు కూటమిలోని మిగతా పార్టీలకు వదిలేస్తారని భావిస్తు న్నారు. 

పార్లమెంట్‌లో ఐదుగురు సభ్యుల ప్రాతినిధ్యం దృష్ట్యా ఎల్‌జేïపీ దాదాపు 28 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసే అవకాశాలున్నాయి. హెచ్‌ఏఎంకు 7 సీట్లు, ఆర్‌ఎల్‌ఎంకు 4–5 సీట్లు కేటాయించవచ్చని అంటున్నారు. కొద్ది నెలల కిందట అసెంబ్లీ నియోజక వర్గాలన్నింటిలో నిర్వహించిన అంతర్గత బీజేపీ సర్వేల ఆధారంగా సీట్ల పంపిణీపై ఒక అవగాహన వచ్చినట్లు తెలుస్తోంది. సీట్ల కేటాయింపుతోపాటు అభ్యర్థుల ఎంపిక కోసం ఈ సర్వే చేశారు. ఎన్నికల తేదీలను ప్రకటించకముందే అభ్యర్థులను ప్రకటించేలా రెండు పార్టీల ఆలోచనలు చేస్తున్నట్లు సమాచారం.  

Advertisement
 
Advertisement
Advertisement