
నాగపూర్: గ్యాంగ్‌స్టర్లు ప్రధాన పాత్రల్లో కనిపించే సినిమాను తలపించే ఉదంతం మహారాష్ట్రలోని నాగపూర్‌లో చోటుచేసుకుంది... గ్యాంగ్ నాయకుని భార్యతో అదే గ్యాంగ్‌లోని సభ్యుడు అఫైర్ నడిపితే.. ఆ విషయం గ్యాంగ్‌లోని అందరికీ తెలిస్తే.. ఇంతలో ఆ గ్యాంగ్ నాయకుని భార్య అనుకోని పరిస్థితుల్లో మరణిస్తే... ఈ సీన్లన్నీ నిజంగా జరిగినవే.. మరి పర్యవసానం ఏమయ్యిందనే విషయానికొస్తే..
మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఇప్పా గ్యాంగ్‌లోని 40 మంది సభ్యులు నగరంతో పాటు, కాంప్టీ శివారు ప్రాంతాల్లో తిరుగుతూ, తమ గ్యాంగులోని సభ్యుడైన అర్షద్ టోపీని అంతమెందించాలని నిర్ణయించుకున్నారు. తమ గ్యాంగ్ లీడర్ భార్య మరణించాక.. వారంతా అర్షద్ టోపీని వెదుకుతున్నారు. అర్షద్ టోపీ ఆ పేరుమోసిన ముఠా నాయకుని భార్యతో సంబంధం పెట్టుకున్నాడు. వారిద్దరూ ఒక బైక్ వెళుతుండగా, ఆమె రోడ్డు ప్రమాదంలో మరణించింది. ఈ విషయం ముఠాలోని సభ్యులందరికీ తెలిసింది. గురువారం అర్షద్ టోపీ ఆ మహిళతో బయటకు వెళ్లినప్పుడు ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
నాగ్‌పూర్ సీనియర్ పోలీసు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం అర్షద్ టోపీతో పాటు ఆ మహిళ బైక్‌పై ప్రయాణిస్తుండగా, వారి వాహనం జేసీబీని ఢీకొంది. అర్షద్ టోపీ స్వల్ప గాయాలతో బయటపడగా, ఆ మహిళ తీవ్రంగా గాయపడింది. కోరాడి థర్మల్ ప్లాంట్‌కు చెందిన పెట్రోలింగ్ వాహనం సంఘటనా స్థలానికి చేరుకుని, బాధితురాలిని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించింది. ఆ ఆసుపత్రి సిబ్బంది ఆమెకు చికిత్స చేసేందుకు నిరాకరించడంతో, ఆమెను కాంప్టీలోని మరొక ఆసుపత్రికి తరలించారు. అక్కడ కూడా ఆమెకు చికిత్స అందించేందుకు నిరాకరించారు.
ఎట్టకేలకు ఆమెను అర్షద్ టోపీ నాగ్‌పూర్ ప్రభుత్వ వైద్య కళాశాలకు తీసుకువెళ్లాడు. అక్కడ ఆమె చికిత్స పొందుతూ మృతిచెందింది. ఈ వార్త తెలియగానే ఇప్పా గ్యాంగ్ సభ్యులు అర్షద్ టోపీని హత్య చేయాలని నిర్ణయించుకున్నారు. తమ ముఠా నాయకుని భార్యను అర్షద్ టోపీని హత్య చేసివుండవచ్చని ఇప్పా గ్యాంగ్ సభ్యులు భావిస్తున్నారని సీనియర్ పోలీసు అధికారులు తెలిపారు. కాగా తన ప్రాణానికి ప్రమాదం ఉందని గ్రహించిన అర్షద్ టోపీ పార్డిలోని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డీసీపీ) కార్యాలయానికి రక్షణ కోరుతూ వెళ్లాడు.
పరిస్థితి తీవ్రతను పరిగణనలోకి తీసుకున్న డీఎస్‌పీ అతనిని కొరాడి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అక్కడ అతని స్టేట్‌మెంట్ రికార్డ్ చేశారని ఒక అధికారి తెలిపారు. ఇప్పటివరకు జరిపిన దర్యాప్తులో ఆ మహిళ ప్రమాదంలో మరణించిందా? లేక హత్యకు గురైందా అనేదానిపై ఎటువంటి ఖచ్చితమైన ఆధారాలు లభ్యం కాలేదని పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తులో ఉంది.
ఇది కూడా చదవండి: ‘దళితులంటే అంత చులకనా? ‘జగద్గురువు’పై శశి థరూర్ విశ్లేషణ